బ్యాంకు నిబంధనలు తెలుసుకోకుండా సురక్షితంగా ఉంటాయనుకుని బ్యాంక్ లాకర్‌లో పెట్టుకున్న సొమ్ము చెదల పాలు కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. కష్టపడి సంపాదించిన సొమ్ము సర్వ నాశనం కావడంతో బాధిత మహిళ ఆవేదనకు అంతులేకుండా పోయింది. అల్కా పాఠక్ తన కుమార్తె పెళ్లి కోసం దాదాపు ఒకటిన్నర సంవత్సరాల పాటు రూ. 18 లక్షల నగదు, కొన్ని ఆభరణాలను లాకర్‌లో దాచింది. అయితే ఆర్‌బీఐ నిబంధలన ప్రకారం KYC ధృవీకరణ , వార్షిక లాకర్ నిర్వహణ కోసం ఆమెను బ్యాంక్ అధికారులు పిలిచినప్పుడు ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.బాధిత మహిళ ట్యూషన్లు చెబుతూ,చిన్న వ్యాపారం చేస్తూ, ఒక్కో రూపాయి పొదుపు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇండియా టుడే నివేదిక ప్రకారం లాకర్‌లో ఉంచిన రూ. 18 లక్షలను చెదపురుగులు తినేశాయి.
ఈ విషయంపై స్పందించిన బ్యాంకు సిబ్బంది ఈ ఘటనను ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియజేశామని అన్నారు. అల్కా పాఠక్‌కు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఆర్‌బీఐ తాజా నిబంధనల ప్రకారం బ్యాంకు లాకర్లలో నగదు భద్రపర్చడానికి వీల్లేదు. నగలు, డాక్యుమెంట్లు మాత్రమే భద్రపర్చుకోవాలి. ఈ నేపథ్యంలో ఆమెకు ఎలాంటి న్యాయం జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. (Today Gold and Silver: బంగారం నేలచూపులు, షాకిస్తున్న వెండి)
లాకర్‌కు సంబంధించి తాజా నిబంధనలు
బ్యాంకు లాకర్లలో నగదు నిల్వ చేయకూడదు. కేవలం నగలు, పత్రాలు వంటి విలువైన వస్తువులు నిల్వ చేసుకొనేందుకు, చట్టబద్ధమైన ప్రయోజనాల కోసమే మాత్రమే దీన్ని వినియోగించాలి. చట్టవిరుద్ధమైన ప్రమాదకర పదార్ధాలను అసలు ఉంచకూడదు. ఏదైనా అనుమానం వచ్చినప్పుడు, కస్టమర్‌పై 'తగిన చర్య' తీసుకునే హక్కు బ్యాంకులకు ఉంటుంది.
అగ్నిప్రమాదం, దొంగతనం, దోపిడి, దోపిడీ, భవనం కూలిపోవడం మొదలైన వాటికి బ్యాంకుదే బాధ్యత. ఉద్యోగి మోసం చేయడం వల్ల నష్టం జరిగితే బ్యాంకు కూడా బాధ్యత వహిస్తుంది. ఇలాంటి కేసుల్లో 'సేఫ్ డిపాజిట్ లాకర్’ ప్రస్తుత వార్షిక ఫీజుకు వంద రెట్లు ఖాతాదారుడికి నష్టపరిహారంగా చెల్లించాలి.
కానీ వరదలు, భూకంపాలు , ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా లాకర్ కంటెంట్‌కు ఏదైనా నష్టం లేదా నష్టానికి బ్యాంక్ బాధ్యత వహించదు. అలాగే లాకర్ అద్దెను మూడేళ్లపాటు చెల్లించకపోతే, కస్టమర్‌కు సమాచారం అందించి, కస్టమర్ అనుమతి తర్వాత బ్యాంక్ 'డ్యూ ప్రొసీజర్‌ను అనుసరించి' లాకర్‌ను తెరిచే అధికారం
ఈ నిబంధనలు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అలాగే ఇప్పటికే లాకర్ ఉన్న వినియోగదారులు బ్యాంకులకు కొత్త ఒప్పంద పత్రం సమర్పించాల్సి ఉంటుంది. దీనికోసం వినియోగదారుడు రూ. 200 స్టాంప్ పేపర్‌పై నోటరీ చేయించి బ్యాంకులో ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్‌బిఐ నిర్దేశించిన ఈ గడువు జూన్‌తో ముగిసిపోగా తాజాగా ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు దీన్ని పొడిగించింది. అంతేకాదు కొత్త నిబంధనల ప్రకారం నష్టపరిహారం పొందాలంటే గడువులోగా సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.
లాకర్లలో ఉంచకూడని వస్తువులు , సెల్ఫ్ డిక్లరేషన్
కరెన్సీ నోట్లు, ఆయుధాలు, పేలుడు సామగ్రి, మాదక ద్రవ్యాలు రేడియేషన్ పరికరాలు చట్ట విరుద్ధమైన వస్తువులు ఉంచకూడదు. దీనికి సంబంధించి అక్రమ, నిషేధిత వస్తువులను లాకర్‌లో దాచిపెట్టనని ఖాతాదారుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ప్రాథమిక నిబంధనలకు లోబడి లాకర్‌ను వినియోగిస్తానంటూ సంబంధిత ఒప్పంద పత్రంపై సంతకం చేయాలి. అలా బ్యాంకులో లాకర్ తీసుకున్న తరువాత ఈ అగ్రిమెంట్ కాపీని బ్యాంకు నుంచి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment