ఆర్నెల్ల నుంచి రెండేళ్ల వరకూ శిక్షలు... రూ. 20,000 నుంచి రూ. 50,000 వరకూ జరిమానాల విధింపు వగైరాలు కూడా ఉన్నాయి. చూడగానే ఇన్ని మంచి అంశాలు కనబడుతున్న ఈ బిల్లుకు బాలల హక్కుల కార్యకర్తలనుంచి, స్వచ్ఛంద సంస్థల నుంచి, విపక్షాలనుంచి ఎందుకంత వ్యతిరేకత వచ్చింది? బీజేపీ సభ్యుడు వరుణ్ గాంధీ సైతం దీన్ని ఎందుకు తప్పుబడుతున్నారు? దీన్ని ఆమోదిస్తే బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించినట్టవుతుందని ఎందుకు హెచ్చరించారు? బాల కార్మిక వ్యవస్థను మరింత సమర్ధవంతంగా నిర్మూలించేందుకని చెబుతున్న ఈ బిల్లు ఆచరణలో అందుకు విరుద్ధమైన ఫలితాలనిస్తుందన్నదే వీరి వాదన. ప్రమాదకరం కాని కుటుంబ వ్యాపారాలు, కుటుంబ వృత్తుల్లో, వ్యవసాయంలో 14 ఏళ్ల లోపు పిల్లలు పనిచేయవచ్చునని తాజా బిల్లు మినహాయింపునిస్తున్నది.
అలాగే టీవీ సీరియళ్లు, సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, ఇతర వినోద రంగాల్లో, క్రీడారంగాల్లో కూడా వారు పనిచేయవచ్చు. అయితే వారి చదువు దెబ్బతినకుండా పాఠశాల పని గంటలు ముగిశాక లేదా సెలవుల్లోనూ పనిచేయవచ్చు. అంతేకాదు... ప్రమాదకర పనులు, ప్రక్రియల జాబితాను కూడా గణనీయంగా తగ్గించింది. కేవలం మైనింగ్, మండే స్వభావం ఉండే పదార్థాలు, ఫ్యాక్టరీల చట్టం ప్రమాదకరమైన ప్రక్రియలుగా పరిగణించే రంగాలను మాత్రమే ఇందులో చేర్చింది. కుటుంబ వృత్తులు, వ్యాపారా లంటే సవరణ బిల్లును రూపొందించినవారి ఆంతర్యం ఏమోగానీ... కార్పెట్, జరీ, బీడీ, మైకా, వజ్రాల కోత, పారిశుద్ధ్యం, ఇటుకబట్టీలు వంటివి కూడా అందులో కొస్తాయి. సవరణల్లో మరో ప్రమాదం కూడా పొంచి ఉంది. భవిష్యత్తులో ఏదైనా వృత్తి లేదా వ్యాపారం ప్రమాదకరం కానిదని కేంద్ర ప్రభుత్వం భావిస్తే ఏ సవరణా అవసరం లేకుండానే ఆ కేటగిరీలోకి చేర్చే హక్కు దానికుంటుంది. ఫలానా రంగానికి మినహాయింపు వచ్చిన సంగతి పార్లమెంటుకు కూడా తెలియదు.
అమల్లో ఉన్న చట్టానికి చేసే సవరణలు దాని లోటుపాట్లను తీర్చేవిధంగా ఉండాలి తప్ప మరింత నీరుగార్చేలా మారకూడదు. ఒకపక్క 14 ఏళ్లలోపు పిల్లలకు నిర్బంధ, ఉచిత విద్య పొందే హక్కు ఉన్నదని చెబుతూ మనం ఘనంగా విద్యా హక్కు చట్టం తెచ్చుకున్నాం. ఏదో ఒక పేరు మీద 14 ఏళ్లలోపు పిల్లలతో పని చేయించడానికి అవకాశం కల్పించే ఇలాంటి సవరణలను ఆమోదిస్తే విద్యాహక్కు చట్టం తీసుకొచ్చిన ఉద్దేశమే నీరుగారే ప్రమాదం ఉండదా? నిజానికి విద్యాహక్కు చట్టం వచ్చాక చాలామంది పిల్లలు బడిబాట పట్టారు. అట్టడుగు, నిరుపేద వర్గాలవారికి చెందిన పిల్లల హాజరు శాతం గణనీయంగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.
మొదట్లో బడికి పిల్లల్ని పంపడం దండగనీ, తమ కొచ్చే ఆదాయం పడిపోతుందని తీవ్రంగా వ్యతిరేకించిన తల్లిదండ్రులు సైతం అనంతర కాలంలో కాస్త మారారు. బడికెళ్లొస్తున్న పిల్లల్లో మార్పు గమనించాకనే ఇది సాధ్యమైంది. తాము బతికినలాంటి బతుకు తమ పిల్లలకు రాకూడదన్న ఆకాంక్ష వారిలో పెరుగుతోంది. దీన్ని మరింత విస్తృతపరిచే కార్యాచరణ ఉంటే పిల్లల హాజరు వందశాతానికి చేరుకోవడం పెద్ద కష్టంకాదని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. ఈ సమయంలో ఇలాంటి చట్టాలు దాన్ని నీరుగార్చవా? తప్పని సరైతే వేరుగానీ అవకాశాన్నిస్తే ఉపయోగించుకోవడానికి చూసే తల్లిదండ్రుల సంఖ్య పెరుగు తుంది. పిల్లల్ని పనికి పంపే వీలుందని తెలిసినప్పుడు ఇంట్లో మగపిల్లలకన్నా ఆడ పిల్లలే సహజంగా దానికి బలవుతారు. ఆడపిల్ల ఎటూ పరాయి ఇంటికి వెళ్లాల్సినదే గనుక పనికి పంపుదామన్న ఆలోచన ఉంటుంది. సభ మరికాస్త సమయం తీసుకునైనా ఈ అంశాలన్నిటిపైనా ఆలోచించాల్సింది. కానీ అది జరగలేదు.
బిల్లుపై చర్చ జరిగిన సందర్భంగా కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ కుటుంబ వ్యాపారాల్లో తల్లిదండ్రులెవరైనా భోజనానికో, మరో పనికో వెళ్లినప్పుడు పిల్లలు కాసేపు ఆ పనులు చూస్తూ ఉండటం సాధారణమేనని చెప్పారు. అందులో అవాస్తవమేమీ లేదు. అయితే ఆ ‘కాసేపు’ పనిని చట్టబద్ధం చేయడంతో అదొక హక్కుగా మారి పిల్లలను బడికి పంపడం మానుకునే ధోరణి బలపడే ప్రమాదం ఉంటుంది. అసలు తనిఖీకొచ్చిన అధికారులకు పనిలో ఉన్న పిల్లలతో యజమానులకున్న చుట్టరికాన్ని లోతుగా ఆరా తీయడం సాధ్యమవు తుందా? వారిని మాయజేసే అవకాశం ఉండదా? అసలు బాల కార్మిక చట్టానికి ఇలాంటి మినహాయింపులు కావాలని అడిగిందెవరు? ఒత్తిళ్లు తెచ్చిందెవరు? కౌమార దశలో ఉన్న పిల్లలను ఈ చట్టం పరిధిలోకి తీసుకొస్తూనే ‘ప్రమాదకర’ జాబితాను కాస్తా కుదించడమేమిటి?