
పర్యటనల పల్లకీ మోత సరే..
ఈ దోపిడీ వ్యవస్థలోనే పేదవర్గాలను చావకుండా కొన ఊపిరితో నిలబెడుతున్న ప్రణాళికా పద్ధతికి కొత్త పాలకులు స్వస్తి చెప్పేందుకు యోచిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలి. గమ్యం తప్పి నడుస్తున్న రాజకీయ పక్షాలు బిహార్ ఫలితాలను చూసి నేర్చుకోవాలి. దేశ భవిష్యత్తుకు ప్రపంచ బ్యాంకులూ, టాటాలూ, బిర్లాలూ, అంబానీ, అదానీలు ఆదర్శం కారని గుర్తించాలి. ఇంట్లో ఈగల మోత ఉంటే, విదేశీ పర్యటనల పల్లకీ మోత పరిష్కారం చూపలేదు.
‘వీళ్లూ, వాళ్లూ అని కాదు; విదేశాలలో జీవిస్తున్న ఏ దేశీయులైనా (భారత సంతతి ఎన్‌ఆర్‌ఐలు సహా) లోలోన మార్పులకు ఇష్టపడని మితవాదులూ, కన్సర్వేటివ్‌లుగానే ఉంటారు. వీరిలో అత్యధికులు వ్యాపారులు లేదా వ్యాపా రాలతో సంబంధం ఉన్న వృత్తిదారులే. రాజకీయ ధోరణులను అంతగా పట్టించుకోరు. భారతీయ ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవర్గంలో ప్రధాన భాగమే ప్రధాని మోదీకి వెన్నుదన్ను. వీరు మత సంబంధమైన ఛాందస ధోరణులను వదులుకోకుండా రాజకీయ మితవాదులతో కలసిపోతూంటారు.’
లార్డ్ మేఘనాథ్ దేశాయ్, 13-11-15
(బ్రిటన్ ఎంపీ, ప్రసిద్ధ ఎన్‌ఆర్‌ఐలలో ఒకరు)
‘పిల్లల్ని కనగలం గానీ, బుద్ధుల్ని కంటామా!’ అన్నది తెలుగు సామెత. కానీ దీని సారం సర్వవ్యాప్తమైనది. ఈ మధ్య లండన్ నుంచి చిత్రమైన ఒక వార్త (18-10-15) వెలువడింది. సందర్భం- అమెరికా అధ్యక్ష స్థానానికి జరిగే ఎన్నికలో పోటీ పడుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతున్నదట. ఈ వేలం వెర్రిని దృష్టిలో ఉంచుకునే అమెరికా పౌరుడొకరు ఇంగ్లండ్ రాణికి ఉత్తరం రాశాడు. ఆ లేఖలోని ప్రతిపాదనకు రాణి విముఖత వ్యక్తం చేశారు. ఇంతకీ ఆ అమెరికా పౌరుని ఆవేదన ఏమిటి? ‘మా నాయకత్వ ప్రమాణాలు సరిగా లేవు. ఒకనాడు తెగతెంపులు చేసుకుని స్వాతంత్య్రం పొందిన అమెరికన్లను మళ్లీ బ్రిటన్‌లో భాగం చేసుకుని పాలిస్తే బావుంటుందేమో!’ అని వ్యంగ్యంగా రాశాడు. ‘సార్వభౌమశక్తిగా ఉన్న మరో దేశం వ్యవహా రాలలో ఈ రాణి జోక్యం చేసుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదు’ అని ఆమె జవాబి చ్చిందట. కానీ రాణి చెప్పిందెల్ల ధర్మమూ కాదు, సత్యమూ కాదు.
పెట్టుబడులకు హామీ ఉందా?
వేర్వేరు ప్రయోజనాల కోసం మన వేలు విడిచిన బ్రిటన్, కొత్త తరహా సంకెళ్లతో భారతదేశం మీద పెత్తనం కోసం ఉవ్విళ్లూరుతున్న అమెరికా నయా వలస సామ్రాజ్య శక్తులుగా ఎత్తుగడలు పన్నుతున్న వాస్తవాన్ని విస్మరించ లేం. యూపీఏ, ఎన్డీఏ పాలనలో గాని, ఇప్పటి మోదీ పాలనలో గాని, విదేశీ పాలనావశేషాల నుంచి గాని, బహుళ జాతి గుత్త సంస్థల, దేశీయ కార్పొరేట్ వ్యవస్థ నుంచి వస్తున్న ఒత్తిళ్ల వల్లగాని ప్రజాబాహుళ్యంలోని ఏ వర్గానికి శాంతి, సుఖసంతోషాలు లేవు. దేశ నవనాడులూ బంధించి, పిండుకుపో తున్న దేశీయ వనరుల సంరక్షణకు బాధ్యత వహించే ప్రభుత్వాలు ఇప్పటికీ మనకు లేవు. ఈ పరిస్థితులలో మోదీ ‘సీరియల్ నవలా రూపం’లో తలపెట్టిన విదేశీ యాత్రలవల్ల కొన్ని ప్రయోజనాలు కలిగితే కలగవచ్చు. కానీ మోదీ అటు న్యూయార్క్ మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ నుంచి; ఇటు లండన్ వెంబ్లీ స్టేడియం వరకు తీర్చిన సభలు, సాగించిన యాత్రలతో భారత ఆర్థిక వ్యవస్థ కోసం రాబట్ట దలుచుకున్న పెట్టుబడుల గురించి స్పష్టత గానీ, అవతల నుంచి ప్రకటనలు గానీ వచ్చినట్టు కానరాదు.
పెట్టుబడులకు సంబంధించే, గుత్త పెట్టుబడుల తాలూకు విదేశీ గుత్త సంస్థలు ఇచ్చిన హామీలు, కుదిరిన అవగాహనల గురించి కూడా ఎలాంటి స్పష్టతా రాలేదు. దీనికి తోడు మన పాలకుల విదేశీ పెట్టుబడుల మోజును గమనించిన అమెరికా, బ్రిటన్ పాలనా వ్యవస్థలు, ప్రత్యక్ష పెట్టుబడుల సంస్థలు మరిన్ని రాయితీలను కోరుతున్నట్టు, మరిన్ని షరతులతో మనలను లొంగదీయడానికి ప్రయత్నించినట్టు వార్తలు కూడా వెలువడినాయి. పైగా ‘ది గార్డియన్’, ‘ది టైమ్స్’, ‘డెయిలీ మెయిల్’, ‘టెలిగ్రాఫ్’, ‘ది ఇండిపెండెంట్’ వంటి పత్రికలు మోదీలో తీవ్రవాదాన్ని చూస్తున్నాయి. మోదీ ముఖ్యమంత్రిగా ఉండగా జరి గిన గుజరాత్ ఊచకోతల గురించి ప్రస్తావించాయి. మోదీకి ఆహ్వానం పలక డంపై అవి బ్రిటిష్ ప్రధాని కామెరాన్‌ను కూడా ఆడిపోసుకున్నాయి. భారత్‌లో రాజ్యాంగ విరుద్ధంగా మోదీ ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్ఛను, సమావేశ స్వేచ్ఛను అడ్డుకుంటున్నదని ఎమర్జెన్సీ కాలంలో ఇందిర ప్రకటనను విమర్శించినంత నిశితంగానే విరుచుకుపడ్డాయి. ఇందులో కొన్ని వామపక్ష పక్ష పత్రికలు కాగా, ఇంకొన్ని మితవాద ధోరణి కలిగినవి. అయితే ఈ వైఖరిని గురించి ప్రశ్నించిన భారత పాత్రికేయులకు ఆ పత్రికలు పెడసరంగానే సమాధానం ఇచ్చాయి. బ్రిటన్ పత్రికలు రాజకీయవేత్తలను ఉపేక్షించవనీ, అలాంటి సంప్రదాయానికి ఇవి దూరమనీ వివరణ ఇచ్చాయి.
మేధ తరలిపోతే నష్టం కాదా?
ఒక సత్యాన్ని విస్మరించరాదు. బహుళ సంస్కృతులతో దీపించే సమష్టి సమాజం మనది. ఇక్కడ వ్యక్తుల ఆహార నియమాలను, వివాహ స్వేచ్ఛను, మతాతీత లౌకిక వ్యవస్థను ఈసడించుకుంటూ ఆంక్షలకూ దాడులకూ గురిచేసే విధానాలకు మానవజాతి ఎదుగుదల, దాని మనుగడే సమాధాన మని గుర్తించాలి. ఈ సహన సంస్కృతి భారతీయ జీవన విధానానికి కొత్త కాదని తెలుసుకోవడానికి ‘పరివార్’కు ఇంకా ఎన్ని యుగాలు, మన్వంతరాల కాలం పడుతుందో! అయితే మోదీ విదేశీ పర్యటనల ద్వారా ఇప్పటికే ఒక విషయం అవగతమై ఉండాలి. అది అర్థంకాకుంటే నేషనల్ హిందూ స్టూడెంట్స్ ఫౌండేషన్ (బ్రిటన్)కు చెందిన మయూరి పార్మార్ ఏమన్నారో తెలుసుకోవాలి: ‘బ్రిటన్‌లో స్థిరపడిన భారతీయ సంతతి వారు మతపరంగా కన్సర్వేటివ్‌లు. వారి రాజకీయేతర సంస్కృతి ఇప్పుడిప్పుడే బ్రిటన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలలో మార్పులకు గురవుతున్నదన్న సంగతి మరవరాదు’. అలాగే మరొక కోణం నుంచి నరేంద్ర ఠకరార్ అనే మరో ఎన్‌ఆర్‌ఐ (ఉగాండా నుంచి వచ్చి బ్రిటన్‌లో స్థిరపడ్డారు) ఇలా వ్యాఖ్యానిం చారు: ‘నరేంద్ర మోదీ హిందూత్వ సందేశానికి ఎన్‌ఆర్‌ఐలు ఆకర్షితుల య్యారు’. మరి మోదీ వ్యాపార లావాదేవీల మాటేమిటని ప్రశ్నించుకుంటే, వ్యాపారంలోనే వ్యవహారాలు చక్కదిద్దుకోవడమనే సూత్రం ఇమిడి ఉంటుందని గ్రహించాలి. అందుకనే ఎన్‌ఆర్‌ఐలకు ఇండియాలో కూడా ఓటు హక్కు కల్పించాలని కోరుతూ మన సుప్రీంకోర్టుకు విజ్ఞాపనలు పంపి ఉంటారు. ఈ ప్రయోజనం దృష్టితోనే ‘మేధా సంపద అమెరికా, బ్రిటన్‌లకు తరలిపోవడాన్ని దేశం నుంచి అది ఊడ్చుకుపోయినట్టుగా భావించరాద ’ని మోదీ ఒక పాచిక వేశారు.
ఈ టుమ్రీతో దేశంలో నిరుద్యోగ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని ఆయన భావించి ఉండవచ్చు. పైగా భారత దేశంలో పనిచేసిన మల్‌ఫోర్డ్ వంటి అమెరికా దౌత్యవేత్తలూ, బ్రిటన్ ప్రధాని కామెరాన్ వంటి వారూ తమ దేశాలలో ఆర్థిక వ్యవస్థలను సంక్షోభాల నుంచి భారతీయ మేధావులే రక్షించగలుగుతున్నారని కితాబులిచ్చారు. అయితే, సోమరిపోతులను పెంచి పోషించే పెట్టుబడిదారీ వ్యవస్థలు తమ తమ పార్ల మెంట్లలోనూ, మంత్రివర్గాలలోనూ భారతీయ సంతతికి చోటు కల్పించి, మాతృదేశం వైపు చూడకుండా కట్టిపడేసే చిట్కాలు కూడా అమలు చేస్తున్న సంగతిని గుర్తుంచుకోవాలి. ఈ తరహా జనం నుంచి తమకు ఏదో ఒనగూడు తుందని భారత ప్రజలూ, బహుజన వర్గాలూ ఆశించలేవు. ఇదేకాకుండా మన చేతివృత్తులనూ, సేద్యాన్నీ భూస్వామ్య వ్యవస్థ నుంచి పెట్టుబడిదారీ దోపిడీ పద్ధతులలోకి మళ్లించిన పాత, కొత్త వలస సామ్రాజ్యవాద శక్తుల నుంచి రక్షించుకునే స్వతంత్ర విధానాలను భారత పాలక వర్గాలు అనుసరిం చడం లేదు. సరికదా, ప్రపంచ బ్యాంక్ ప్రజా వ్యతిరేక సంస్కరణలతో అంటకాగుతున్నాయి. దీనిని కేవలం మేక్ ఇన్ ఇండియా నినాదం రక్షించ లేదు. ఎలాగంటే, ఇండియాలో తిష్టవేసి, ఇక్కడి బంగారాన్ని (మేధస్సును, నైపుణ్యాన్ని) పక్కనపెట్టి, మా సరుకులను ఉత్పత్తి చేసి పెట్టమని విదేశీ గుత్త పెట్టుబడులను ఆహ్వానించే పద్ధతికి మారు పేరే మేక్ ఇన్ ఇండియా.
అసలు వస్తువుల తయారీరంగంలో సన్నకారు ఉత్పత్తిదారులకు గతిలేని స్థితిలో ఈ నినాదానికి విలువలేదు. ప్రభుత్వరంగాన్ని క్రమంగా పక్కకు తోసేసి, దానిస్థానే పబ్లిక్, ప్రైవేట్ రంగాలలో విదేశీ గుత్త పెట్టుబడుల వాటాను 80-100 శాతానికి పెంచాలని ఇటీవల పాలకులు నిర్ణయించడమే ఇందుకు నిదర్శనం. ఈ విదేశీ పెట్టుబడుల సద్దును చూసి తమకూ బడా విదేశీ గుత్త సంస్థలతో సమాన హోదాలో రాయితీలు కల్పించాలని దేశీయ గుత్త కంపెనీలు దేశ ప్రభుత్వాన్ని ప్రాధేయ పడవలసి వచ్చింది. అంటే నేడు మనం పరాధార స్థితిలో ఉన్నామా? పరాధీనతలో ఉన్నామా? అని ప్రశ్నిం చుకోవలసిన స్థితి.
స్టాక్‌మార్కెట్ షేర్లను భారత ఆర్థిక వ్యవస్థ నవనాడులనూ బంధించే స్థాయిలో, శాసించేస్థితిలో లేదా ఉన్న పెట్టుబడులను అర్ధంతరంగా తరలించుకుపోగల రీతిలో విదేశీసంస్థలు ఉన్నాయి. ప్రపంచ బ్యాంక్, అంత ర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, దీని అనుబంధ సంస్థలు, వాటి రేటింగ్ (ఆర్థిక వ్యవస్థ ఎగుడుదిగుళ్లను అంచనా వేయగల/ వీలును బట్టి తారుమారుగా చూపగల) సంస్థలే ప్రధాన శాసనకర్తలుగా ఇవాళ దేశంలో పనిచేస్తున్నాయి. ఈ దోపిడీ వ్యవస్థలోనే పేదవర్గాలను చావకుండా కొన ఊపిరితో నిలబెడు తున్న ప్రణాళికా పద్ధతికి కొత్త పాలకులు స్వస్తి చెప్పే దిశగా నడుస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలి. గమ్యం తప్పి నడుస్తున్న రాజకీయ పక్షాలు బిహార్ ఫలితాలను చూసి నేర్చుకోవాలి. దేశ భవిష్యత్తుకు ప్రపంచ బ్యాంకులూ, టాటాలూ, బిర్లాలూ, అంబానీ, అదానీలు ఆదర్శం కారని గుర్తించాలి. ఇంట్లో ఈగల మోత ఉంటే, విదేశీ పర్యటనల పల్లకీ మోత పరిష్కారం చూపలేదు.
(ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు)