తెలంగాణ రాష్ట్రంలో బలమైన ప్రశ్నించే గొంతు ఎవరిది కానుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తెలంగాణ రాష్ట్రంలో బలమైన ప్రశ్నించే గొంతు ఎవరిది కానుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రశ్నించే గొంతుక కోసం రాష్ట్ర ప్రజలు, విద్యావంతులు, తెలంగాణవాదులు ఆసక్తిగా గమనిస్తున్నారు. రోజు రోజుకు టీఆర్‌ఎస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుండటం, ప్రతిపక్షాలు కూడా అదే స్థాయిలో బలహీనపడటంతో ఈ చర్చ తెలంగాణలో మరింత విస్తృ తంగా సాగుతోంది. స్వాతంత్య్రం వచ్చి ఐదేళ్లు గడిచిన తర్వాత 1952లో జరిగిన ప్రప్రథమ సాధారణ ఎన్నికల్లో మళ్లీ ప్రధాన మంత్రిగా నెహ్రూ ఎన్నికైనప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిపక్షంగా చాలా బలహీనంగా ఉండేది. ప్రతిపక్షాలు బలహీ నంగా ఉంటే ప్రభుత్వాలు తప్పిదాలు చేస్తాయని, నాయకు లకు గర్వం తలకెక్కుతుందని అప్పట్లో ప్రధానమంత్రి నెహ్రూ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అనివార్యంగా ఆత్మను కూడ పక్కనపెట్టి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అది వ్యక్తిగతంగా తనకు ఇష్టం లేక పోయినా, రాజకీయంగా అనివార్యమై ఆ పనులు చేసినట్లు నెహ్రూ అనేక పర్యాయాలు తన ఉపన్యాసాల్లో, రచనల్ల్లో పేర్కొన్నారు. బలమైన ప్రతిపక్షం లేనప్పుడు తనమీద తానే విమర్శనాత్మక వ్యాసాలను పత్రికల్లో కలం పేరుతో నెహ్రూ రాశారు. ప్రశ్నించే హక్కుతోనే న్యాయం పొందగలమని ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. ఏ ప్రభుత్వానికైనా ప్రశ్నించే గొంతుక ఉంటేనే ప్రజాస్వామ్యం పదికాలాలపాటు బతుకు తుందని తరచుగా ప్రొఫెసర్ హరగోపాల్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కె.రామచంద్రమూర్తి సైతం చెబుతుంటారు.
ప్రజలం దరూ ప్రశ్నించకపోవచ్చు కానీ పౌర సమాజానికి ప్రాతినిథ్యం వహించే శక్తి కలిగిన వ్యక్తులు, సంస్థలు వారి ముందుకు రావాల్సిన చారిత్రాత్మక అవసరం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. ప్రభుత్వం గుప్పిస్తున్న హామీలు అమోఘం అనీ, అవి ప్రజల జీవితాలను మౌలికంగానే మారుస్తాయని అనుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. కానీ వాటి అమలుపైనే ఉత్కంఠ, ఆసక్తి నెలకొని ఉన్నాయి. వీటిని అధిగమిస్తారా.. అధిగమించారా అన్నది ప్రభుత్వ బాధ్యతే. ప్రశ్నించే గొంతు లేకపోవడంతో అధికార వికేంద్రీ కరణకు బదులు, కేంద్రీకరణకు దారితీస్తోంది. అయితే ప్రశ్నించే గొంతు అవసరమే కానీ ఆ గొంతు తన ఉనికి చాటుకునేందుకు కాకుండా రాజ్యాంగ విలువలకి, వ్యక్తి స్వేచ్ఛకు. ప్రజాస్వామ్యానికి సంకేతంగా పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- జి. రాజు, సామాజిక కార్యకర్త, మహబూబ్‌నగర్
మొబైల్: 9000797618