పాక్ ‘శాంతి’ రగడ | Pakistan makes unnecessary issue on hakimullah mehasud's death | Sakshi
Sakshi News home page

పాక్ ‘శాంతి’ రగడ

Published Wed, Nov 6 2013 4:10 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM

పాక్ ‘శాంతి’ రగడ

పాక్ ‘శాంతి’ రగడ

అమెరికా, పాకిస్థాన్‌ల కలహాల కాపురం ఇలా కుదటపడిందో లేదో అలా మళ్లీ రచ్చకెక్కింది. పాకిస్థాన్ ప్రధాని నవాజ్‌షరీఫ్ గత నెలలో (20-23) అమెరికాలో పర్యటించారు. పాక్ భూభాగంపై అమెరికా ద్రోన్ విమాన దాడులను తక్షణమే నిలిపివేయాలని అధ్యక్షుడు బరాక్ ఒబామాను కోరారు. ఇరు దేశాలకు సంతృప్తిని కలిగించిన  ఆ పర్యటనలో ఒబామాకు పట్టనిది అది ఒక్కటే. అందుకు నవాజ్ చింతించిందీ లేదు. 2014లో అఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా సేనల నిష్ర్కమణ తదుపరి  ద్వైపాక్షిక సహకారానికి వీలుగా పరిస్థితిని చక్కదిద్దగలిగామని ఒబామా ప్రభుత్వం సంతృప్తిని వ్యక్తం చేసింది.


 వారం తిరిగే సరికే కథ అడ్డం తిరిగినట్టయింది. ప్రభుత్వమూ, ప్రతిపక్షాలు కలిసి అమెరికాపై నిప్పులు కక్కుతున్నాయి. కార ణం నవంబర్ 2న జరిగిన మరో ద్రోన్ దాడి. అమెరికా 2004 నుంచి పాక్ వాయవ్య ప్రాం తంలోని ఖైబర్ ఫక్తున్‌ఖ్వా రాష్ట్రంలోనూ, కేంద్రపాలిత తెగల ప్రాంతంలోనూ ద్రోన్ దాడులు సాగిస్తూనే ఉంది. పాక్ నుంచి అప్ఘాన్‌లో దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులపై దాడుల పేరిట వందలాదిగా అమాయక పౌరులను బలిగొంటోంది. గ్రామాలకు గ్రామాలనే బుగ్గి చేస్తోంది. అమెరికా అధికారిక ప్రకటనల ప్రకారమే ఒక్కో మిలిటెం టును హతమార్చడానికి సగటున పది మంది పౌరులు బలి కావాల్సివస్తోంది. ఇంతకూ నవాజ్ ప్రభుత్వం అలకకు కారణం ద్రోన్ దాడుల కొనసాగింపు కానేకాదు... ఆ దాడిలో పాక్ తాలిబన్‌గా పిలిచే ‘తెహ్రిక్ ఎ తాలిబన్ పాకిస్థాన్’ (టీపీపీ) అగ్రనేత హకీముల్లా మెహసూద్ మృతి చెందడం. ద్రోన్ దాడుల్లో హతమవుతున్న పౌరుల గురించి మొసలి కన్నీళ్లు కార్చే పాక్ ప్రభుత్వం... ‘అత్యంత ప్రమాదకర ఉగ్రవాది’గా అమెరికా ముద్ర వేసిన హకీముల్లా హతమైనందుకు రభస చేయడంలో అర్థం లేకపోలేదు.
 
 నవాజ్ ప్రభుత్వం హకీముల్లాతో శాంతి చర్చలు నడుపుతోంది. సహచరులతో శాంతి చర్చలపై సంప్రదింపుల కోసమే ఉత్తర వజీరి స్థాన్‌కు అతను వచ్చాడు. ఆ సమావేశంపై అమెరికా ద్రోన్ దాడికి పాల్పడింది. ఇది ‘శాంతి ప్రక్రియని హత్య చేయడమే’నని పాక్ హోంమంత్రి చౌధరీ నిస్సార్ సోమవారం మండిపడ్డారు.

 

అఫ్ఘాన్‌లోని అమెరికా, నాటో సేనలకు పాక్ గుండా జరిగే సరఫరాలను వెంటనే నిలిపివేయాలని తెహ్రిక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్ కోరారు. ఖైబర్ ఫక్తున్‌ఖ్వాలోని అధికారపార్టీ అదే. హకీముల్లా హత్యతో శాంతి చర్చలకు విఘాతం కలిగిందని నవాజ్ పార్టీ (పీఎమ్‌ఎల్-ఎన్) ఆందోళన చెందుతోంది. ‘శాంతి చర్చలు పాక్ అంతర్గత సమస్య’ని, వాటితో తమకు ఎలాం టి సంబంధం లేదని అమెరికా తేల్చిపారేసింది. అదే సూత్రం ప్రకారం పాక్  మిలిటెన్సీ సమస్య కూడా ఆ దేశ అంతర్గత వ్యవహారమే కావాలి. ఎవరి అనుమతితో అమెరికా ద్రోన్ దాడులతో జోక్యం చేసుకుంటున్నట్ట్టు? దానికి ఎవరి అనుమతి అక్కర్లేని మాట నిజమే. కానీ కనీసం 2007 నుంచి పాక్ ప్రభుత్వ అనుమతితోనే ద్రోన్ దాడులు సాగుతున్నాయని ఇటీవలే ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక వెల్లడించింది. ఇక హకీముల్లా హత్యకు సంబంధించి... నవా జ్ ప్రభుత్వ ఆగ్రహానుగ్రహాలతో అమెరికాకు పనిలేదు. అందుకు ‘ఇవ్వవలసిన వారి’ అనుమతే ఉంది.  
 
 ఆర్మీ చీఫ్ జనరల్ అష్ఫాక్ కయానీ కూడా ‘శాంతి’నే కోరుతున్నారు. కాకపోతే శ్రీలంక తరహాలో ముందుగా తాలిబన్లను సైనికంగా నిర్మూలించాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ఆయన ఈ చేత్తో శాంతి చర్చల కోసం అఖిలపక్ష సమావేశం నిర్వహ ణకు నవాజ్‌కు పచ్చజెండా చూపి, మరో చేత్తో హకీముల్లా ఆనుపానులు అమెరికాకు అం దేట్టు చేశారు. అమెరికా గూఢచార సంస్థ సీఐఏకూ, పాక్ సైన్యం, ఐఎస్‌ఐలకూ మధ్య  ఈ విషయంలో ఉన్న సహకార సంబంధాలను కూడా ‘వాషింగ్టన్ పోస్ట్’ వెల్లడించింది. కయానీతో ఏకీభవించే మితవాద రాజకీయ పక్షాలు విస్పష్టంగా ‘మంచి మిలిటెంట్లు’, ‘చెడ్డ మిలిటెంట్లు’ అనే విభజన రేఖను గీసా యి.

 

అఫ్ఘాన్‌లో మాత్రమే దాడులకు పాల్పడే సలాఉద్దీన్ అయూబీ, హఫీజ్ గుల్ బహదూర్, హఖానీ గ్రూపులు మంచి మిలిటెంట్లు. పాక్‌లో బాంబు దాడులకు, ఆత్మహుతి దాడులకు పాల్పడే టీపీపీ చెడ్డ మిలిటెంట్లు. ఇక భారత్‌లో దాడులకు పాల్పడే ‘లష్కరే తోయి బా’, ‘లష్కరే జంగ్వీ’, ‘జైషే మొహ్మద్’ సం స్థలు ముఖ్య ‘వ్యూహాత్మక సాధనాలు లేదా మిత్రులు’. అఫ్ఘాన్‌లోనే దాడులకు పాల్పడే మిలిటెంట్లతో అమెరికాకు పేచీ. శాంతి చర్చలతో టీపీపీ  ప్రధాన రాజకీయ స్రవంతిలోకి రావడం కయానీ లాంటి సైనిక నేతల ఆధిపత్యానికి ప్రమాదం. అందుకే అమెరికా, కయానీలకు మధ్య మునుపెన్నటికంటే బలమైన ఏకీభావం నెలకొంది. ‘శాంతి హత్య’తో అమెరికా పాక్ బంధానికి వచ్చిన ముప్పేమీ లేదు. నవాజ్ నిమిత్తమాత్రుడు.  
 - పి.గౌతమ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement