అసాధారణ చిత్రాల చంద్రుడు | pannala subramanya battu opinion on cartoonists | Sakshi
Sakshi News home page

అసాధారణ చిత్రాల చంద్రుడు

Published Mon, Aug 22 2016 12:23 AM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

అసాధారణ చిత్రాల చంద్రుడు

అసాధారణ చిత్రాల చంద్రుడు

రచయితకి వలె బుద్ధి జనిత గుణాలుంటే చిత్రకారుడికి సాగదు. అందుకు సరిపడ రేఖా గమన, చైతన్య, స్ఫురిత విలాసం కూడా ఉండాలి. ఆ గుణాలు అందిపుచ్చుకొని వృద్ధి చేసుకున్న చిత్రకారుడు చంద్ర. అందుకే అతని ముఖచిత్ర రేఖాచిత్రాలు సరైన పోలికల లెక్కలకు తూగుతాయి.

చంద్ర మామూలు పత్రికా చిత్రకారుడు కాదు, సాధారణ కార్టూనిస్టు కాదు. ప్రజా మాధ్యమాలలో ఏ విభాగానికైనా రెండు తరాలు పైకి రావటానికి అవకాశాలుంటాయి. అలాగే వాటిని అలంకరించే, విశదపరిచే, వ్యక్తీకరించే ఉప విభాగాలలో కూడా పేరు తెచ్చుకొనే అవకాశాలుంటాయి. సినిమాలలో, రేడియోలో, పత్రికలో రెండు తరాలకే బృహదాకాశం కనిపిస్తుంది. అక్కడ లెక్కలేనన్ని తారలుండవు– ఒకొక్కసారి నాలుగైదు తారలు కూడా ఉండవు. సినిమాల్లో పాటలకి, రేడియోలో లలిత సంగీతానికి, పత్రికల్లో సంపాదకులకి గల తారాపథం చాలా ఇరుకయినది. అదొక మంత్రిగారి సార్టు, పరివ్రాజకుల బోగీ కాదు, బుద్ధి మంత్రాంగం గలవారికే ఆ వాహన యోగం.


అలా బొమ్మలు వేసే పత్రికా కథాపత్రాలలో, గిలిగింతలు పెట్టే కార్టూన్ల కార్నర్‌లలో చంద్ర కూడా, బాపుగారి సరసన ఒక స్థానం కోసం కష్టపడ్డాడు. నిలదొక్కుకున్నాడు. గౌరవం పొందాడు. పుస్తకాల ముఖచిత్ర రచనలో కూడా విశిష్ట స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ గౌరవం మంచి శిక్షితులైన కళామర్మబుధులకి– మంది బుద్ధులకి దక్కదు. పక్కన దారిలో లెక్కలకు మించిన యోధులు చిన్న చిన్న యుద్ధాలు చేసి రాలిపోతుంటారు. ఏ సృజనాత్మక రంగంలోనైనా సైనిక దృశ్యాలుంటాయి కాని నిలబడేవారు జాయప్ప సేనానులే.


ఈ చంద్ర సేనాని పత్ర గజ ముఖచిత్రాలనే కాదు, చాలా తక్కువ మంది చిత్రకారులు కృషి చేసే సంకేత, గూఢ, వ్యంగ్య చిత్రాల రచనల్లో కూడా సేవ చేయగల్గడం విశేషం. ప్రజాదరణకీ, ప్రచురణ కర్తల అభిరుచికీ భిన్నంగా, ఆలోచనాత్మక, అసాధారణ, అనలంకృత, అపురూప ముఖచిత్ర రచనలు చేసి, మంచి రసికుల మన్నలను పొందాడు. అప్పుడప్పుడూ అతను మరో కోణపు మంత్ర దర్పణం తెరిస్తేనే కాని అతని కళాభిజ్ఞతకి తృప్తి ఉండదు. అసలు అలాంటి అసంప్రదాయ ముఖచిత్రాలని గుచ్చి వేరే కట్ట కట్టాల్సినంత వృద్ధి కనబరిచాడు. ఈ కళావిభాగం తరువాతి తరం చిత్రకారులకి తెలుగులో కొంతయినా దారి చూపింది. ఆంగ్ల పత్రికలలో– ఆర్థిక విషయ ఆంగ్ల పత్రికలలో ఇది ఇప్పుడు చాలా విశేషంగా ఆదరింపబడుతోంది. ఇలాంటి రోజులు తెలుగు పత్రికలకి కూడా వస్తాయనుకుందాం. అప్పటివరకు– ముఖ్యమంత్రి ద్రౌపదిగా, ధరలు దుశ్శాసనులుగా చిత్రించే మకిలి కార్టూను సంస్కృతి మనకి పోదు. అవి పోగొట్టడానికి చంద్ర తొలి సమిధలు వేసినవాడిగా చెప్పవచ్చు. ప్రతికూల పక్షంవారు, తలిశెట్టివారు దీనికి ఆద్యులు అని చెప్పి వాదించవచ్చు. అయితే తలిశెట్టివారు గీసిన కేరంబోర్డు బిళ్ల, సంపెంగ ముక్కు చిత్రాలు మన వ్యంగ్య చిత్రానంద కోశాలలో సంకేత బుద్ధి గ్రహణని తృప్తి పరచవు.


వ్యంగ్య చిత్రకారులను, ముఖపత్ర చిత్రకారులను తెలుగు పాఠకులు కొన్ని మౌలిక సందిగ్ధాలలోకి నెట్టారు. ‘నవ్వించటం ప్రధానం, అది చూసుకో ముందు’ అన్నారు; ‘అందంగా ఉండాలి’ మరి ఏం చేస్తావో? అన్నారు. స్వచ్ఛం కాని ఈ నీటి చెలమలలో మన చిత్రకారులు ఈదాలి. ఇది ఒక సవాలు. ఈ సవాలుని ఎదుర్కొంటూ ఈదుతూ మన చిత్రకారులు జీవితం గడిపేస్తున్నారు. బాగానే గడిపేస్తున్నారు. ‘చిత్రం బాగానే ఉంది కదా!’ అనే మాట మాటున ఒక చిత్రకారుడి జీవితం నలభై సంవత్సరాలు గడిచిపోతుంది. క్రూరంగా మాట్లాడాలంటే, కాబరే నర్తకి జీవితంలా సాగిపోతోంది. అలా సాగకుండా తన బొమ్మలకి ఒక వైవిధ్యంతో పాటు విస్తరణ కల్గించగల్గిన చిత్రకారుడి పాత్ర చంద్ర పోషించాడు. అనేక ఆడ చిత్రాలనే కాదు, ‘ఆడ్‌’, ‘అమూస’ చిత్రాలనీ, వ్యంగ్య చిత్రాలనీ, ముఖపత్ర చిత్రాలనీ ఇవ్వగలిగాడు. అదీ అతని బుద్ధి విశేషం. రచయితకి వలె బుద్ధి జనిత గుణాలుంటే చిత్రకారుడికి సాగదు. అందుకు సరిపడ రేఖా గమన, చైతన్య, స్ఫురిత విలాసం కూడా ఉండాలి. ఆ గుణాలు అందిపుచ్చుకొని వృద్ధి చేసుకున్న చిత్రకారుడు చంద్ర. అందుకే అతని ముఖచిత్ర రేఖాచిత్రాలు సరైన పోలికల లెక్కలకు తూగుతాయి.


దీనికీ నాకు ఒక కారణం తోస్తోంది. చంద్ర మంచి కథకుల సోపాన క్రమంలో చేరిన రచయిత. 30కి పైగా కథలు వ్రాశాడు. సినిమా కళాదర్శనం వైపు కూడా మళ్లాడు. అవి సినీమా కథలూ కావు. సినీమా చిత్రీకరణల అవతార క్రమానికి చెందిన దృష్టి గలవీ కావు. ఆ ‘మిల్లు’ నుంచి వేరు పడిన మిల్లు కార్మికుడు చంద్ర. ఈ వేరు పడే దృష్టి వలన చిత్రకారుడిగా చంద్రకు ప్రత్యేక కోణం ఏర్పడింది. అతని వ్యాఖ్యారహిత వ్యంగ్య చిత్రాలకు అంత బలం వచ్చింది. దీనిని విశ్లేషించాలంటే అదొక ప్రత్యేక సోదాహరణ. చిత్ర ప్రసంగ ప్రదర్శన విషయం.
తెలుగులో కథాలంకార చిత్రకారుడి జీవితం చాలా పరిమితమైనది. రంగుల దృష్ట్యా, వేయవలసిన వయస్సులోని బొమ్మల గీతల, భావాల ప్రకటనల హద్దుల రీత్యా, పత్రికలిచ్చే, ప్రచురణ కర్తలిచ్చే అవకాశాల దృష్ట్యా చాలా ఇరుకు బాట. కొన్ని ప్రత్యేక సంచికలకీ, పద్యాలకీ, వచన కవితలకీ తనే వేసుకున్న వ్యంగ్య చిత్రాలకీ ఏ పాటి వెసులుబాటు కల్గినా మంచి వర్కుని అందించిన చిత్రకారుడు చంద్ర. కార్య Ô]æూరుడైన పురుష ఆకార చదరపు స్ఫూర్తి, అందమైన మధ్య వయస్సుగల స్త్రీరూపు లావణ్యం... ఈ రెంటినీ ప్రమాణీకరించిన నేర్పు అతనిది. రోగ గ్రస్తం కాని చేతులు, వేళ్లు, చమత్కారం కల్గించే ఆరోగ్య బాలల రూపం– సరైన అవయవ రేఖా స్వరూపాలతో బొమ్మలు గీసే చంద్ర గౌరవ సోపానాలు అధిరోహిస్తూ తెలుగు పాఠకుల మనస్సులలో అసాధారణ ముద్ర వేశాడు. అంతకంటే 70 ఏళ్ల జీవితానికి ఆనందం ఏముంటుంది!

                                                                                                                                     -పన్నాల సుబ్రహ్మణ్య భట్టు
                                                                                                                                     0866–2475120

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement