జీవించు... నేర్చుకో... అందించు!
కొత్తతరానికి- వారి ఉరుకుల పరుగుల జీవితానికి ఈ ఏకవాక్య ప్రక్రియ బాగా ఉపయోగపడుతుందని అనుకున్నాను. కొత్తతరాన్నే కాదు- నా తరాన్నే కాదు- నా కంటే ముందు తరాన్ని కూడా మనసులో నిలుపుకుని- మూడు తరాల మధ్య ఏర్పడ్డ అఖాతాన్ని కొటేషన్ల వంతెనతో అధిగమించాలనుకున్నాను.
‘శరీరమాద్యం ఖలు ధర్మసాధనం’ అనే కొటేషన్ (సూక్తి) మా ఇంటి దూలం పక్కన చాక్‌పీసుతో రాసి ఉండటాన్ని నేను చదివాను. అప్పుడు నేను రెండో తరగతిలో ఉండి ఉండవచ్చు. రాసిన వారెవరో ఆ కొటేషన్ రచయిత పేరు రాయలేదు. నాకంటే ఆరేండ్లు పెద్దదైన మా అక్కయ్య రాసి ఉండవచ్చు. అడగడానికి మా అక్కయ్య లేదిప్పుడు. అడగాలని నాకపుడు తెలియదు. మరో నలభై ఏడు సంవత్సరాల తరువాత, నేను కొటేషన్స్‌ని అధ్యయనం చేస్తున్నప్పుడు, అది సంస్కృత మహాకవి కాళిదాసు కొటేషన్ అని తెలిసింది.
భూమిలో పడ్డ విత్తనం తీరుగా- ఆ కొటేషన్ నా మనసులో పడ్డది అర్థమయీ కానట్టు- బోధపడీ పడనట్టు. దాని అర్థం ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలనే జిజ్ఞాస నాలో ప్రారంభమైంది. దాని అర్థం గురించి నేనెవరినీ అడగలేదు. వయసు పెరుగుతున్నకొద్దీ, జీవితానుభవాలు కలుగుతున్నకొద్దీ ఆ కొటేషన్ రోజూ నాకేదో బోధిస్తున్నట్టుగానే ఉండేది. శరీరం- ఆరోగ్యం- తిండి- వ్యాయామం వంటి విషయాలే కాదు, శరీరానికీ, జీవితానికీ ఉండే సంబంధం ఎటువంటిదో, అటువంటి శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, దానికోసం ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో నిత్యం నాకేదో ఎరుక పరుస్తున్నట్టుగా ఉండేది. ఆ కొటేషన్ చిన్నదేకాని, మొత్తం జీవితం పొడుగునా నన్ను చైతన్య పరుస్తూ వస్తూనేవుంది. అది మొదలు నాకు కనిపించిన ప్రతి కొటేషన్‌నీ చదువుతూ వచ్చేవాణ్ణి. నాకు సాహిత్యం పట్ల ఆసక్తి ఆ కొటేషన్‌తోనే ప్రారంభమైందని చెప్పాలి. అయితే అటువంటి కొటేషన్లు రాస్తానని కాని, రాయాలని కాని నేను ఏనాడూ అనుకోలేదు.
టెలివిజన్ చానెళ్లు అందుబాటులోకి వచ్చిన తరువాత, కొత్త తరానికి సాహిత్య పఠనాసక్తి పోతోందని మనలో చాలామంది అనుకుంటుండటం నాకు తెలుసు. అయితే రచయితలుగా కొత్త తరాన్ని మనం మన పాఠకులుగా భావించుకుంటున్నామా- అని నేను అనుకుంటూ ఉండేవాడిని. జీవన విధానాల్లో వచ్చిన మార్పుల వల్ల ఇపుడు అందరూ విడివిడిగా బతకవలసి వస్తోంది. పూర్వం- మూడు తరాలు కలిసి ఒకే ఇంట్లో బతికేవారు. హాస్టల్ చదువులు- విదేశీ ఉద్యోగాల వల్ల ఇపుడు రెండు తరాలు కూడా కలిసి ఒకే ఇంట్లో బతకడం లేదు. అందువల్ల కోల్పోతున్న విలువైన అనుభూతులు ఎన్నో ఉన్నాయి. మూడు తరాల మనుషుల మధ్య అనుబంధాల స్థానంలో, వియోగవిషాదాలు గూడు కట్టుకుని ఉంటున్నాయి. కనపడని దుఃఖమేదో మనుషుల్ని ముంచెత్తుతోంది. ఈ తరపు మనుషులందరిలాగే నేను కూడా అటువంటి స్థితులకు లోను అవుతూ వస్తున్నాను.
అయితే ఈ తెగిపోతున్న మానవసంబంధాల మధ్య, ఏదో ఒక అవగాహన వారధిని నిర్మించాలని నాకేదో తండ్లాటగా ఉండేది. తరం నుంచి తరానికి అందవలసిన జ్ఞానం అందడం లేదు. అటువంటి జ్ఞానాన్ని అందించడం ఎట్లాగా అని యోచించేవాణ్ణి. అట్లాంటి యోచనలోంచి వచ్చిందే, ఆధునిక కథని స్కిప్టు లేకుండా ఆశువుగా చెప్తూ ఉంటే కెమెరాతో రికార్డు చేసి డి.వి.డి.లుగా విడుదల చేయడం! (ఆ తరువాత కూడా) ఒక కథారచయితగా నేను, నా తరువాతి తరం మనసుకు పట్టేవిధంగా వుండే ప్రక్రియల గురించి మరింత ఆలోచిస్తూ ఉన్నాను.
‘జీవితం సరళమైందే కాని, మనమే దాన్ని సంక్లిష్టం చేస్తుంటాం’ అనే కన్ఫ్యూషియస్ కొటేషన్‌ని నేనేదో పత్రికలో చదివాను. కొత్తతరం కన్ఫ్యూషియస్ చెప్పినటువంటి కొటేషన్లలో ఏ ఒక్కటి చదవగలిగినా, నా ప్రయత్నం కొంత ఫలిస్తుందని నిర్ణయానికి వచ్చి, ప్రపంచ సాహిత్యంలోంచి కొటేషన్లను సేకరించాలనుకున్నాను. తెలుగులోకి సంకలనాలుగా వచ్చినంతమేరా కొటేషన్ల సంకలనాలు కొని తెచ్చుకుని చదవడం ఆరంభించాను. అది 2010 సంవత్సరం ప్రారంభపు రోజులు. నాక్కావాల్సిన కొటేషన్లను సేకరించే పనిలోకి అట్లా దిగాను కాని- నేను కొటేషన్లని రాయవలసి వస్తుందని నాకప్పటికి తెలియదు.
కొటేషన్లను చదువుతున్నకొద్దీ, నాకు చాలావాటితో విభేదం మొదలైంది. చదువుతున్నకొద్దీ, వాటికి భిన్నంగా నేను ఆలోచించాల్సి వచ్చింది. కొన్ని కొటేషన్స్‌తోనే నాకు ఆమోదం కలిగింది. విభేదించిన ఎన్నో కొటేషన్స్‌ని నాదైన పద్ధతిలో తిరిగి వ్యాఖ్యానించుకోవడం సాగేది. అటువంటి స్థితిలో నేను కొంత ఆగి ఆలోచించుకోవాల్సి వచ్చింది. కొటేషన్‌ను ఒక రచనాప్రక్రియగా ఎందుకు స్వీకరించకూడదు? అని ప్రశ్నించుకున్నాను. నాదైన దృక్పథంతో తిరిగి నిర్వచించే వాక్యాన్ని కవితాత్మకంగానే కాదు- హిందుస్థానీ శాస్త్రీయ సంగీత శ్రోతగా, లయపూరితంగా కూడా చెప్పడం మంచిదనుకున్నాను. కొత్తతరానికి- వారి ఉరుకుల పరుగుల జీవితానికి ఈ ఏకవాక్య ప్రక్రియ బాగా ఉపయోగపడుతుందని అనుకున్నాను. కొత్తతరాన్నే కాదు- నా తరాన్నే కాదు- నా కంటే ముందు తరాన్ని కూడా మనసులో నిలుపుకుని- మూడు తరాల మధ్య ఏర్పడ్డ అఖాతాన్ని కొటేషన్ల వంతెనతో అధిగమించాలనుకున్నాను.
ఇంతకుముందు కొటేషన్స్ చెప్పినవారు పనిగట్టుకుని చెప్పినవారు కాదు. తత్వశాస్త్రంలో భాగంగానో- రాజనీతిశాస్త్రాల్లో భాగంగానో- కథలోనో- నవలలోనో- నాటకంలోనో- కవిత్వంలోనో- పాత్రల పరంగానో- రచయిత వ్యాఖ్యానాలుగానో రాయబడ్డాయి తప్ప- కొటేషన్‌ను ఒక ప్రక్రియగా భావించి, దాన్నొక కళారూపంగా తీర్చిదిద్దుకుని, ఒక తాత్విక నేపథ్యంతో రాసినవారు కాదు. వారికా అవసరం పడలేదు. ఆధునిక జీవితం కలిగించిన ఆటంకాల వల్ల, నేను వాటిని అధిగమించడానికి కొటేషన్‌ని ఒక ప్రక్రియగా తీసుకోవలసి వచ్చింది.
ఫ్యూడల్ యుగానికి సంబంధించి... చిట్టచివరి దశలోని ఒక తెలంగాణ గ్రామంలో పుట్టి పెరిగినవాణ్ణి(1959). వ్యవసాయ కుటుంబం, బందిఖానా వంటి బడి చదువుల్లో గట్టెక్కలేక వ్యవసాయంలోకి దిగి, చేసి-చెడి, విధిలేక గోదావరిఖని బొగ్గుగనుల్లోకి కార్మికుడిగా వలస- సాహిత్య పరిచయం- కథారచనలోకి దిగడం- మరోవైపున వందలాది మంది అధికారులతో- వేలకొద్దీ కార్మికులతో కలిసి బొగ్గుగనుల్లో కఠినమైన పనులు చేయాల్సిరావడం- వారి వారి మనస్తత్వాలు- సంఘాలు- రాజకీయాలు- రచయితలు- వారివారి ప్రవర్తనలు- సభలు- సమావేశాలు- రాష్ట్రం- దేశం తిరగడం- ఆ నాటి గోదావరిఖని, క్రిక్కిరిసిన ప్రపంచానికి ఒక మినీ నమూనా(1980-2007).
27 సంవత్సరాల ఉద్యోగజీవితం చాలనుకుని- పదమూడేండ్లు ముందుగానే అధికారిగా ఉద్యోగాన్ని వదిలేశాను. విస్తృత జీవితానుభవం ఉన్నా పరిమితంగానే కథలు రాసినవాణ్ణి. రాయవలసింది చాలా ఉండిపోయిన స్థితి. యాభై సంవత్సరాల వయసుకు చేరుకున్నాను. జననం నుంచి మరణం దాకా, మానవ జీవితంలో, ప్రతి మనిషీ అనుభవించవలసి వచ్చే ఆనంద- విషాదాలన్నింటినీ అనివార్యంగా మూటకట్టుకుని ఉన్న స్థితి...
నేనెరిగిన మనుషుల మూలంగా- ముఖ్యంగా రచయితల మూలంగా- నాకు అనేక నిర్ధారణలు కలుగుతూ వచ్చాయి. ఫ్యూడల్- పెట్టుబడిదారి- సోషలిస్టు- ప్రజాస్వామ్య వ్యవస్థల, ఉత్థానపతనాలు విన్నవాణ్ణి- కొన్నింటిని చూసినవాణ్ణి. వందల, వేల సంవత్సరాల్లో జరిగిన ప్రపంచ పరిణామాల్ని చదువుకున్నవాణ్ణి. వేల సంవత్సరాలుగా మతాల- రాజకీయ సిద్ధాంతాల ఆవిర్భావ- పతనాలు, సామ్రాజ్యాలు కూలిపోవడం- దేశాలు స్వాతంత్య్రాన్ని పొందడం వంటి అనేక విషయాలు...
నేను పేర్కొన్న విషయాల నేపథ్యమే కాకుండా అపుడు నేనున్న మానసిక స్థితి- మా బాపు మరణం(2009), మా బాబు దూరదేశంలో ఉండిపోవడం, మనుషులతో పడకపోవడం- కోపం- ఆగ్రహం కలగలిసి ఒంటరినై... ‘‘ఉదాత్తంగా బతకడమే, ఉత్తమ ప్రతీకారం’’ అన్నట్టుగా, నా బతుకేదో నేను బతకాలని నిర్ణయించుకున్న స్థితి కూడా, కొటేషన్స్ రాయడానికి నన్ను ముందుకు తోసిందని నేను అనుకుంటున్నాను.
కథారచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డి తాజాగా ‘ఆధునిక తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి స్వతంత్ర కొటేషన్స్’ అంటూ ‘జీవించు... నేర్చుకో... అందించు!’ వెలువరించారు. ఇది ఆయన పూర్వ కొటేషన్స్ సంకలనాలను కూడా కలుపుకొని వెలువడిన సమగ్ర సంకలనం. సంపాదకులు: డాక్టర్ డి.చంద్రశేఖర రెడ్డి. ప్రచురణ: ఎమెస్కో. పేజీలు: 488; వెల: 250; ప్రతులకు: సాహితి ప్రచురణలు, విజయవాడ-2. ఫోన్: 0866-2436643
- తుమ్మేటి రఘోత్తమరెడ్డి
9000184107