రాజ్యాంగబద్ధం కాని హామీలేల? | rulers false promises to reserved category people | Sakshi
Sakshi News home page

రాజ్యాంగబద్ధం కాని హామీలేల?

Mar 24 2016 1:57 AM | Updated on Oct 8 2018 9:06 PM

రాజ్యాంగబద్ధం కాని హామీలేల? - Sakshi

రాజ్యాంగబద్ధం కాని హామీలేల?

ఏపీలో టీడీపీ రజకులను ఎస్సీలలో చేరుస్తామని వాగ్దానం చేసింది. రాజ్యాంగపరంగా అది నేడు సాధ్యమేనా? అంటే, ఇప్పట్లో అది నెరవేరే పరిస్థితి లేదు.

కొత్త కోణం
 
ఏపీలో టీడీపీ రజకులను ఎస్సీలలో చేరుస్తామని వాగ్దానం చేసింది. రాజ్యాంగపరంగా అది నేడు సాధ్యమేనా? అంటే, ఇప్పట్లో అది నెరవేరే పరిస్థితి లేదు. రజకులు తమ కుల వృత్తి మీద ఆధారపడి బతికే పరిస్థితి లేదు. వారికి విద్య, ఉపాధి అవకాశాలను, తగు శిక్షణను ఇచ్చి నూతన జీవన విధానంలోకి నడిపించే ప్రయత్నం అత్యావశ్యకం. వారిపై దాడులను, అత్యాచారాలను అరికట్టి, రక్షణ కల్పించాలి. అంతేగానీ రాజ్యాంగపరంగా సమంజసం కాని వాగ్దానంతో వారిని ఓటు బ్యాంకుగా వాడుకోవాలని చూడటం రాజకీయ వంచన.
 
‘‘షెడ్యూల్డ్ కులాలుగా నిర్ధారించడానికి అంటరానితనంతో కూడిన సామా జిక, ఆర్థిక, విద్యాపరమైన వెనుకబాటుతనమే ప్రాతిపదిక అవుతున్నది. వీరందరూ తరతరాలుగా అంటరానివారుగా జీవించడం వల్లనే వీరిని షెడ్యూల్డ్ కులాలుగా నిర్ణయించి, ఒక కేటగిరి కింద పేర్కొనడం జరిగింది’’ అని సుప్రీం కోర్టు 2004లో ఒక కేసు సందర్భంగా ఇచ్చిన తీర్పు పేర్కొంది. ఇదే అంశాన్ని 2002, ఆగస్టు 19న కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నెపోలియన్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కొన్ని కులాలను ఎస్సీలలో, కొన్ని తెగలను ఎస్టీలలో చేర్చాలని ప్రతిపాదనలు వచ్చాయని, ప్రభుత్వం వాటిని పరిశీలి స్తున్నదని ఆ సందర్భంగా మంత్రి తెలిపారు. అయితే, ఏ కులాలనైనా ఎస్సీలలో చేర్చాలంటే సాంప్రదాయకంగా, తరతరాలుగా అనుభవిస్తున్న అంటరానితనం వల్ల సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో అత్యంత వెనుక బాటుతనాన్ని ఎదుర్కొనడమే ప్రాతిపదిక కాగలదని నెపోలియన్  ప్రకటిం చారు. ఆదిమ సామాజిక, ఆర్థిక, జీవన విధానం, తమదైన ప్రత్యేక సంస్కృతి, భౌగోళికంగా ఆ ప్రాంతాలు గ్రామాలకు దూరంగా ఉండడం, ఇతర సామాజిక వర్గాలతో కలిసి ఉండే స్వభావం లేకపోవడం లాంటి విషయాల వల్ల వెనుకబాటుతనానికి గురై ఉండటమే ఎవరినైనా ఎస్టీలలో చేర్చడానికి ప్రాతిపదిక కాగలదని ఆయన స్పష్టం చేశారు.

2014 ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ రెండూ కొన్ని కులాలను ఎస్సీలలో, మరికొన్ని తెగలను ఎస్టీలలో చేరుస్తామని ప్రకటించాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్ కూడా రెండు తెగలను ఎస్టీలలో చేరుస్తామని ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది. ఆ విషయాన్ని పరిశీలించడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక కమిషన్ కూడా వేసింది. ప్రస్తుత అసెంబ్లీ సమా వేశాల మొదటి రోజున ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగాల్లో గవర్నర్ రజకులను ఎస్సీలలో చేర్చే విషయాన్ని ప్రస్తావించి, ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు. అయితే ఏపీలోని టీడీపీ ప్రభుత్వం అంటున్నట్టు రజకులను ఎస్సీలలో చేర్చడం సాధ్యమేనా? అందుకు అసెంబ్లీ తీర్మానం చెల్లుతుందా? లేకుంటే, రజకులను మభ్యపెడుతున్నారా? అనే వాటిని పరిశీలించాలి. రజకులనే కాదు మరే కులాన్నయినా కొత్తగా ఎస్సీల్లోకి చేర్చడానికి ప్రాతిపదిక ఏమిటో మొదటే చెప్పుకున్నాం. దానికి అనుగుణం గానే మార్పులు, చేర్పులు సాధ్యం.

షెడ్యూల్డ్ కులాల గుర్తింపునకు ప్రాతిపదిక
1935 నాటి భారత ప్రభుత్వ చట్టంలో మొట్టమొదటిసారిగా షెడ్యూల్డ్ కులాలనే ప్రస్తావన వచ్చింది. 1936లో దీనికి సంబంధించిన ప్రత్యేక ఉత్తర్వు లను ప్రకటించారు. 1935 భారతప్రభుత్వ చట్టంలోని 1, 5, 6 షెడ్యూళ్లలోని అంశాల ఆధారంగా షెడ్యూల్డ్ కులాల జాబితా రూపొందినట్టు ఆ ఉత్తర్వు లలో పేర్కొన్నారు. క్రైస్తవ మతంలోగానీ, బౌద్ధ మతంలోగానీ, మరేవిధమైన ఆదిమ జాతి మతంలోగానీ ఉన్నవారిని షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించడానికి వీల్లేదని అందులో స్పష్టంగా చెప్పారు. 1936లో షెడ్యూల్డ్ కులాలుగా ప్రకటించిన  కులాలన్నిటినీ అప్పటికే అణగారిన వర్గాలు(డిప్రెస్డ్ క్లాసెస్)గా గుర్తిస్తున్నారు.

మింటో-మార్లె నివేదిక, మాంటెగ్-చెమ్స్‌ఫర్డ్ నివేదిక, సైమన్ కమిషన్ సిఫార్సులలో అంటరాని కులాల హక్కులకు సంబంధించిన డిమాండ్లను పొందుపరచారు. అదేసమయంలో 1930-31 మధ్య లండన్‌లో మొదటి, రెండవ రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. వాటిలో అంబేడ్కర్ లేవనెత్తిన అంశాలపై ఆధారపడి అంటరాని కులాలు ఎదుర్కొంటున్న వివక్షను నిర్మూలించడానికి 1935 భారత ప్రభుత్వ చట్టంలో కొన్ని రక్షణలను పొందుపర్చారు. గాంధీ-అంబేడ్కర్‌ల మధ్య కుదిరిన పూనా ఒడంబడికపై ఆధారపడి రాజకీయ, విద్య, ఉద్యోగపరమైన రిజర్వేషన్లను కల్పించారు. వాటిని అమలు చేయడానికి అంటరాని కులాలను గుర్తించి, షెడ్యూల్డ్ కులాల జాబితాను రూపొందించారు.

ఆ తర్వాత  1950లో, 1975లో ఈ జాబితా లను ప్రకటించారు. 1911లోనే ఈ ప్రక్రియ మొదలైనప్పటికీ, 1931 జనాభా లెక్కల్లో దీనికి ఒక నిర్దిష్టమైన విధానాన్ని ప్రతిపాదించారు. అందుకు తొమ్మిది అంశాలను పరిగణనలోనికి తీసుకున్నారు. ఏది అంటరాని కులమని నిర్ణ యించేందుకు వాటినే ప్రాథమిక ఆధారాలుగా నిర్ధారించారు. అవి:

1. ఈ కులానికి బ్రాహ్మణ పురోహితులు విధులు (పూజాది కార్య క్రమాలు) నిర్వహిస్తున్నారా? లేదా? 2. హిందువులకు సేవలందించే మంగలి, దర్జీ, నీళ్ళు మోసే వాళ్ళు ఈ కులానికి కూడా పనులు చేస్తారా? లేదా? 3. ఈ కులం వలన మైల పడిపోతామనే భావన ఇతర హిందూ కులాల్లో ఉందా? లేదా? 4. ఈ కులం ప్రజల నుంచి ఇతర హిందూ కులాలు నీటిని స్వీకరిస్తాయా? లేదా? 5. ఒకే రకమైన విద్యార్హతలు ఉన్నప్పటికీ హిందువుతో సమానంగా ఈ కులానికి చెందిన వ్యక్తిని గౌరవిస్తారా? లేదా? 6. హిందువులు పూజలు నిర్వహించే దేవాలయాల్లోకి ఈ కులాలకు ప్రవేశం ఉందా? లేదా? 7. ఇతర కులస్తులు ఉపయోగించే బాటలు, బావులు, కాలు వలు, పాఠశాలల్లోకి వీళ్ళను అనుమతిస్తారా? లేదా? 8. వెనుకబాటు తనానికి, పేదరికానికి, నిరక్షరాస్యతకు కులం కారణమౌతుందా? లేదా? 9. ఆ కులం నిర్వహిస్తున్న వృత్తి కూడా వారి జీవన గమనానికి ప్రతిబంధకంగా ఉందా? లేదా?

పై తొమ్మది అంశాలలోనూ ప్రతికూలతలను ఎదుర్కొంటున్న వారిని అంటరానితనం అనుభవిస్తున్న కులంగా భావించి షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాలని నిర్ణయించారు. వాటి ఆధారంగానే ఇంత వరకు షెడ్యూల్డ్ కులాలను గుర్తిస్తున్నారు.

ఓటు బ్యాంకు క్రీడలో గుజ్జర్ పావులు  
అయితే ఇటీవల ఓట్ల కోసం వివిధ పార్టీలు చరిత్రను, చట్టాలను, రాజ్యాంగాన్ని మరిచి పలువురిని ఎస్సీ లేదా ఎస్టీలలో చేరుస్తామని వాగ్దానాలు చేస్తూ పోతున్నాయి. అంటరాని కులాలతోపాటూ, కొన్ని ఇతర వెనుకబడిన కులాలు కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బాగా వెనుకబడిపోయాయనేది కాదనలేని వాస్తవం. కొన్ని ఆధిపత్య కులాలు మాత్రమే ఆర్థిక, సామాజిక రంగాలపై తరతరాలుగా గుత్తాధిపత్యం సాధించి, రాజకీయాధికారాన్ని హస్తగతం చేసుకోవడం వల్ల చాలా కులాలు అన్ని రంగాల్లో వివక్షకు గురవుతున్నాయి. అందువల్లనే ఆయా కులాలు తమ సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం అనివార్యంగా సంఘటితం అవుతు న్నాయి. ఎన్నో డిమాండ్లను ప్రభుత్వాల ముందు పెడుతున్నాయి. ఆ డిమాండ్లలో తమను ఎస్సీ, ఎస్టీ జాబితాల్లో చేర్చాలనేది కూడా ఉంటోంది. ఏ కులమైనా తమ ప్రగతి కోసం ఎలాంటి డిమాండ్లనైనా రూపొందించు కోవచ్చు. కానీ రాజకీయ పార్టీలు రాజ్యాంగపరమైన మౌలికాంశాలను విస్మరించి ఎన్నికల ప్రణాళికలలో చేస్తున్న వాగ్దానాలతోనే సమస్యలు తలెత్తుతున్నాయి. అలాంటి వాగ్దానాలు కొన్ని సార్లు హింసాత్మక ఘటనలకు సైతం దారితీస్తున్నాయి.

ఉదాహరణకు, రాజస్థాన్‌ను కుదిపేసిన గుజ్జర్ల రిజర్వేషన్ల ఆందోళనలో దాదాపు 26 మంది మరణించారు. లెక్కకు మించిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమయ్యాయి. తమను ఎస్టీలలో చేర్చాలని డిమాండ్ చేస్తున్న గుజ్జర్లను ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఏళ్ళ తరబడి ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అందుకు మినహాయింపు కావు. ప్రభుత్వాలు నియమించిన కమిటీలు ఈ డిమాండు సరైనది కాదని తేల్చి చెప్పాయి. గుజ్జర్ల ఎస్టీ హోదా డిమాండ్ పరిశీలనకు నియమించిన జస్టిస్ జస్‌రాజ్ చోప్రా కమిటీ నివేదిక(2007) ఆ డిమాండ్‌ను స్పష్టంగా తిరస్కరించింది. గుజ్జర్ల సామాజిక, ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపట్టాలని సూచించింది. నాటి ముఖ్యమంత్రి వసుంధరారాజే సింథియా ఈ నివేదికను కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారు. 2013 ఎన్నికల ప్రణాళికలో ఆ రాష్ట్ర బీజేపీ గుజ్జర్లకు ఎస్టీ హోదా కల్పిస్తామనే వాగ్దానాన్ని వీడి, 5 శాతం రిజర్వేషన్లకు హామీ ఇచ్చింది. 2007నాటి జస్టిస్ జస్‌రాజ్ చోప్రా కమిటీ నివేదికను అమలు చేయడానికి మాత్రం ఏ ప్రభుత్వమూ ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఇదీ ప్రభుత్వాలు ఆడే రాజకీయ క్రీడ.

రజకులతోనూ అదే ఆట!
ఏపీలోని అధికార పార్టీ టీడీపీ రజకులను ఎస్సీలలో చేరుస్తామని తమ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. చరిత్ర క్రమాన్ని, వర్తమాన పరిస్థితులను పరిశీలించి ఆ వాగ్దానాన్ని అమలు చేయడం రాజ్యాంగపరంగా చెల్లుతుందా? లేదా? అనే దృష్టి నుంచి చూస్తే.... అది ఇప్పట్లో నెరవేరే పరిస్థితి కనిపించదు. అయినా ఈ డిమాండ్‌పై పదే పదే రాజకీయ పార్టీలు మాట్లాడుతుండడం వల్ల అటువంటివే మరికొన్ని డిమాండ్లు ముందుకు వస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి ఆచరణ సాధ్యంకాని డిమాండ్లను పరిష్కరిస్తామనే తప్పుడు హామీలతో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడటాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలకు నిజంగానే వెనుకబడిన ప్రజల మీద ప్రేమ ఉన్నట్లయితే, తమ బడ్జెట్లలో సంపన్న వర్గాలకు, కాంట్రాక్టర్లకు, పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్న రాయితీలలో ఐదు శాతం ఖర్చు పెట్టినా రజకులు దారిద్య్రం నుంచి బయటపడతారు. కానీ రజకులకు మేలు జరిగే ప్రయత్నాలు కానీ, వారిని పేదరికంలోంచి బయటపడేసే కృషి కానీ చేయకుండా ప్రభుత్వాలు వారిని మభ్యపెట్టే ప్రయత్నమే  చేస్తున్నాయి.

గ్రామాల్లో వచ్చిన మార్పులు, జీవితాల్లోకి వచ్చి చేరిన ఆధునికత కారణంగా రజకులు నేడు కుల వృత్తి మీద ఆధారపడి బతికే పరిస్థితి లేదు. వారికి విద్య, ఉపాధి అవకాశాలను, తగు శిక్షణను ఇచ్చి నూతన జీవన విధానంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి. వారిపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను అరికట్టడానికి తగు రక్షణలు కల్పించాలి. అంతే గానీ రాజ్యాంగపరంగా, చట్టపరంగా సమంజసం కాని వాగ్దానంతో వారిని ఓటు బ్యాంకుగా వాడుకోవాలని చూడడం రాజకీయ వంచన తప్ప మరొకటి కాదు.
 
- మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు  మొబైల్: 97055 66213
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement