అవిశ్రాంత గ్రహాంతర జీవాన్వేషి | searching for Aliens | Sakshi
Sakshi News home page

అవిశ్రాంత గ్రహాంతర జీవాన్వేషి

Published Thu, Feb 27 2014 11:32 PM | Last Updated on Sat, Sep 2 2017 4:10 AM

అవిశ్రాంత గ్రహాంతర జీవాన్వేషి

అవిశ్రాంత గ్రహాంతర జీవాన్వేషి

 గ్రహాంతరాల్లో జీవం ఉన్నదని నార్లికర్ చేసిన పలు పరిశోధనలు సాధికారికంగా నిరూపించాయి. 2001లో ఆయన నేతృత్వంలో ఇస్రో    హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక ప్రయోగంలో నేలకు 41 మీటర్ల ఎత్తులోని వాతావరణంలో సూక్ష్మజీవుల ఉనికిని గుర్తించారు.
 
 అంతరిక్షంలో జీవ రాశి ఉనికిని కనుగొని, గ్రహాంతర పరిశోధనలో నవ శకానికి నాంది పలికిన శాస్త్రవేత్త జయంత్ విష్ణు నార్లికర్. పుణెలోని ప్రొఫెసర్ నార్లికర్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో 1938 జులై 19న జన్మించారు. తండ్రి వాసుదేవ నార్లికర్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర అధ్యాపకులు. తల్లి సంస్కృత పండితురాలు. తండ్రి ప్రభావంతో ఆయన ఖగోళ, గణిత, భౌతిక శాస్త్రాలపై మక్కువ పెంచుకున్నారు. ఖగోళ శాస్త్రవేత్త కావాలని కలలుగన్నారు. ఆ కలలను సాకారం చేసుకోడానికి తొలి మెట్టుగా జయంత్ పాఠశాల, కళాశాల విద్య లో అద్భుత ప్రతిభను కనబరిచారు.
 
  1957లో బీఎస్సీ పూర్తి చేసి, 19 ఏళ్ల నవ యువకునిగా ఇంగ్లండ్‌లో తండ్రి చదివిన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోనే గణిత శాస్త్రంలో ఎంఏ చేశారు. ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త ఫ్రెడ్ హోయల్ పర్యవేక్షణలో పీహెచ్‌డీ (1963) చేశారు. కేంబ్రిడ్జిలోని కింగ్స్ కాలేజీ ఫెలోగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ థియరిటికల్ ఆస్ట్రానమీ వ్యవస్థాపకునిగా, అధ్యాపకునిగా భౌతిక, విశ్వసృష్టి శాస్త్ర పరిశోధనలకు పునాదిని పటిష్టం చేసుకున్నారు. హోయల్‌తో కలసి అంతరిక్ష పరిశోధనలో ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతానికీ, మాక్ సిద్ధాంతానికి మధ్య సమన్వయాన్ని సాధించే ప్రయత్నం చేశారు. వారి ప్రతిపాదన ‘హోయల్-నార్లికర్ సిద్ధాంతం’గా సుప్రసిద్ధమైంది. ఈ కీర్తి ప్రతిష్టలతో సంతృప్తి చెందక ఆయన అంతరిక్ష రహస్య ఛేదన దిశగా నిర్విరామ పరిశోధన సాగించారు. మాతృదేశాభిమానంతో స్వదేశానికి తిరిగి వచ్చి ‘టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెం టల్ రీసెర్చ్’లో ప్రొఫెసర్‌గా (1972-89) పనిచేశారు. ఆయన నేతృత్వంలోని ‘థియరిటికల్ ఆస్ట్రోఫిజిక్స్’ విభాగం అంతర్జాతీయ గుర్తింపును సాధించింది. ఆ ప్రేరణతోనే యూజీసీ పుణెలో ‘ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్’ విభాగాన్ని ఏర్పాటు చేసి సారథ్య బాధ్యతలను నార్లికర్‌కు అప్పగించింది. వారి నేతృత్వంలో ఆ సంస్థ ప్రపంచవ్యాప్తమైన గుర్తింపును పొందింది. 2003లో పదవీ విరమణ చేసినా ఎమిరిటస్ ప్రొఫెసర్‌గా ఆయన అక్కడే పనిచేస్తున్నారు.
 
 గ్రహాంతరాల్లో జీవం ఉందన్న జయంత్ నమ్మకాన్ని ఆయన చేసిన పలు పరిశోధనలు సాధికారికంగా నిరూపించాయి. 2001 జనవరిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నార్లికర్ నేతృత్వంలో హైదరాబాద్‌లో ఒక ప్రయోగం నిర్వహించింది. ఒక భారీ బెలూన్‌కు పేలోడ్‌ను అనుసంధానించి భూమి ఉపరితలం నుంచి 41 మీటర్ల ఎత్తులోని వాతావరణంలోకి పంపి, అక్కడ సూక్ష్మజీవుల ఉనికిని గుర్తించారు. భూమి పై నుంచి సూక్ష్మజీవులు అంత ఎత్తుకు వెళ్లలేవు. కాబట్టి అవి ఇతర గ్రహాలకు చెందినవేననే అభిప్రాయానికి వచ్చారు. ఈ ప్రయోగం అనంత విశ్వం నుంచి జీవ కణాలు భూమిపైకి దూసుకొస్తున్నాయనీ, ఆ కణాలే భూమిపై జీవరాశికి విత్తనాలని చెప్పే సిద్ధాంతానికి దారి తీసింది. త ద్వారా అది అంగారకుడిపై ప్రయోగాలకు నాంది పలికింది. మరో ప్రయోగంలో నార్లికర్ తాను కనుగొన్న సూక్ష్మజీవుల్లో ఒక జాతికి తన గురువు పేరిట ‘జనీబేక్టర్ హోయలీ’ అని నామకరణం చేశారు. మరో జాతికి ఇస్రో పేరిట ‘బేసిల్లెస్ ఇస్రోనెన్‌సిస్’ అని, మూడో జాతికి ‘బేసిల్లెస్ ఆర్యభట్ట’ అని పేర్లు పెట్టారు. ఈ పరిశోధనలకు ముందు జయంత్ ‘బిగ్ బ్యాంగ్’ సిద్ధాంతానికి ప్రత్యామ్నాయ నమూనాలను ప్రతిపాదించారు.
 
 అపార మేధోనిధి నార్లికర్ 26 ఏళ్లకే ‘పద్మభూషణ్’ (1965) పురస్కారాన్ని అందుకున్నారు. 2004లో పద్మవిభూషణ్ సత్కారం పొందారు. ప్రతిష్టాత్మక భట్నాగర్ అవార్డు, నేషనల్ సైన్స్ అకాడమి వారి ఇందిరాగాంధీ అవార్డును పొందారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ‘మహారాష్ట్ర భూషణ్’ బిరుదునిచ్చి ఘనంగా సత్కరించింది. మరెన్నో జాతీయ, అంతర్జాతీయ బహుమతులు, పురస్కారాలు అందుకున్నారు. పుస్తకా లు, వ్యాసాల ప్రచురణతో, రేడియో, టీవీ ప్రసంగాలతో శాస్త్ర విజ్ఞాన ప్రచారం సాగిస్తున్నారు. శాస్త్ర విజ్ఞానాన్ని సామాన్య ప్రజలతో పంచుకోవటానికి ఆయన శాస్త్రీయ కాల్పనిక రచనా మార్గాన్ని ఎంచుకోవటం మరో విశేషం. అశాస్త్రీయమైన జ్యోతి ష్యం, అద్భుత ప్రదర్శనలకు వ్యతిరేకంగా, మహిళల పట్ల వివక్షను ఎండగడుతూ రచనలు చేస్తున్నారు. నార్లికర్ భార్య మం గళ రాజవాడే, ముగ్గురు కుమార్తెలు పీహెచ్‌డీలు చేసి, శాస్త్ర విజ్ఞాన పరిశోధనా రంగంలోనే ఉండటం విశేషం.    
 
 విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ అవార్డును మార్చి 1వ తేదీన ఆయన స్వస్థలమైన తెనాలిలో ప్రముఖ అంతరిక్ష పరిశోధకుడు జయంత్ విష్ణు నార్లికర్‌కు బహూకరిస్తున్న సందర్భంగా...    
 పి.విష్ణుమూర్తి
 వ్యవస్థాపకులు, డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక ట్రస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement