మసకబారుతున్న తెలుగు ‘చంద్రులు’
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగుజాతి విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కీచులాటలు మానుకోవాలి. స్వల్ప విషయాలపై ఘర్షణ పంథాకు స్వస్తి చెప్పాలి. విశాల హృదయంతో వ్యవహరించేవారి స్థాయి పెరుగుతుంది. జాతీయ మీడియా, రాజకీయ పార్టీలు ఇదంతా వినోదంగా చూస్తున్నాయి.
కేంద్రంలో నెల రోజుల పాలన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ట పెరిగింద న్న అభిప్రాయం ప్రధానంగా వ్యక్తమవుతోంది. అందరి అంచనాలను మించి ఆయన పనిచేస్తున్నారు. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల గురించి కూడా ఒకసారి మదింపు వేయాల్సిన అవసరం ఉంది. మోడీ సర్కారుకు నెల రోజులపాటు ‘రాజకీయ హనీ మూన్’ వ్యవధి లభిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ఒక్కరోజు కూడా ఊపిరి తీసుకోడానికి తీరికలేకుండా పోయింది. బీజేపీని గతంలో ఎన్నడూ సమర్థించని చిన్న రాష్ట్రాలు కూడా మోడీ ప్రధాని అయ్యాక ఆయనకు ఎంతో ప్రాధాన్యమివ్వడం ప్రారంభించాయి. మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల వైఖరుల కారణంగా తెలుగువారి ప్రతిష్ట మసకబారుతోంది. ఇది సాటి తెలుగువారికి ఎంతో ఆందోళన కలిగించే విషయం. ఆంగ్లేయులు ‘విభజించు-పాలించు’ సూత్రంతో భారత్‌ను పాలించగా, కే చంద్రశేఖరరావు, చంద్రబాబునాయుడు కీచులాడుకుంటూ కేంద్రం తలదూర్చేలా హాస్యాస్పదంగా వ్యవహారం చేస్తున్నారు. ఈ ఇద్దరు సీఎంలూ తాత్కాలిక పాలకులు. వీరు తమ విధానాలను చక్కదిద్దుకోకపోతే తెలుగువారి ప్రతిష్ట పూర్తిగా మంటగలిసిపోతుంది.
ఇద్దరూ ఇద్దరే
కేసీఆర్, చంద్రబాబు రాజకీయాలలో, పాలనాయంత్రాంగంలో రాటుదేలినవారే. ఏళ్ల తరబడి రాజకీయాలలో కొనసాగుతున్న ఈ రాజకీయ ద్వయానికి ఎత్తులు పైఎత్తులు బాగానే తెలుసు. తాము రచించుకునే వ్యూహాలను విజయవంతంగా అమలు చేయగలిగేవారే. వీరిలో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ రకరకాల కారణాల వల్ల హస్తినలో మాత్రం వీరికి అంత సానుకూలత లేదనే చెప్పాలి.
తెలంగాణలో పూర్తి మెజారిటీ సాధించినందున ప్రభుత్వాన్ని నడిపేం దుకు కేసీఆర్‌కు ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు సమర్థిస్తానని ఎన్నికల ఫలితాలకు ముందు కేసీఆర్ ఒక సందర్భంలో అన్నారు. అంటే భవిష్యత్తులో కాంగ్రెస్‌తో తమకు రాజకీయ అవసరం పడుతుందన్న ఉద్దేశం అప్పట్లో ఆయన మనసులో ఉంది. అంతేకాదు, తమ సర్కారు ఏర్పాటుకు కాంగ్రెస్ తోడ్పాటు అవసరమొస్తుందని భావించి మోడీకి దూరమయ్యారు. టీఆర్‌ఎస్‌కు పార్లమెంట్‌లో 11 మంది ఎంపీలు ఉన్నప్పటికీ వారికి కేసీఆర్‌తో తూగగల రాజకీయ స్థాయి, వ్యూహ నిపుణత వంటి లక్షణాలు లేవు. టీఆర్‌ఎస్ ఎంపీలపై బీజేపీకి కూడా పెద్దగా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు కేసీఆర్ అనుసరించిన ఎత్తుగడలు సరిగా లేవని చెప్పాలి. ఆయనవి అన్నీ ప్రతికూల డిమాండ్లే! ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చినవన్నీ కచ్చితంగా తెలంగాణకూ ఇవ్వాలన్నట్టుగా డిమాండ్ చేస్తున్నారు. ఆయన ప్రతికూల వైఖరి అవలంబిస్తున్నారు. ఈ పద్ధతి జాతీయస్థాయిలో నడవదు. ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన సాయం అందించాల్సిందిగా కేసీఆర్ అడుగుతూనే... అదే సమయంలో తమ రాష్ట్రమైన తెలంగాణకు కావల్సిన డిమాండ్లు చేస్తే బాగుండేది. ప్రతి విషయంలో అడుగడుగునా ఆంధ్రప్రదేశ్‌కు అడ్డుతగులుతూ, ఆయన తన ప్రతిష్టను దిగజార్చుకున్నారు. అంతేగాదు, సమస్యలే కాని చిన్నాచితకా విషయాలను పెద్ద సమస్యలుగా సృష్టించి కేసీఆర్ తన ఇమేజ్‌ను మసకబార్చుకున్నారు. సచివాలయం, ఇతర కార్యాలయాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరించడం పిల్లచేష్టలుగా కనిపిస్తాయి. సెటిలర్స్‌ను బెదిరించడం వల్ల తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. మీడియాతో ఘర్షణ పంథా వల్ల జాతీయ మీడియాలో టీఆర్‌ఎస్ సర్కారుకు ఇప్పటికే చెడ్డ పేరు వచ్చింది.
మజ్లిస్, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకట్టుకునేందుకు కేసీఆర్ చేసే ప్రయత్నాలు బట్టి ఒక విషయాన్ని ఊహించవచ్చు. అతి త్వరలో రాజకీయ తిరుగుబాటు జరగవచ్చన్న భయం ఆయన్ని పట్టి పీడిస్తూ ఉండవచ్చు. టీఆర్‌ఎస్‌కు పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి జనరంజకంగా పాలిస్తే ఆయన దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. కాని టీఆర్‌ఎస్‌లో కొన్ని సామాజిక వర్గాలు ఉన్నందున ఆయనలో కొంత భయం గూడుకట్టుకుని ఉంది. నిరంతరం సమస్యలను సృష్టించడం, ఆందోళనలు నడపడం ద్వారా ప్రభుత్వంలో భిన్నవైఖరులకు తావులేకుండా చూసుకోవాలన్నది ఆయన వ్యూహం. కేంద్రంలో బీజేపీ సర్కారు మాదిరిగా టీఆర్‌ఎస్‌లో కూడా రాజకీయ హేమాహేమీలు, చెప్పుకోదగిన ప్రముఖులెవరూ లేరు.
1978లో రాజకీయాలలో ప్రవేశించిన చంద్రబాబునాయుడు కేంద్రంలో దేవెగౌడ, ఐకే గుజ్రాల్ సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. తర్వాత వాజ్‌పేయి సర్కారుకు కూడా మద్దతునిచ్చారు. పదేళ్లపాటు ప్రతిపక్షంలో గడిపిన తర్వాత ఇటీవలే అధికారంలోకి వచ్చారు. గత 45 రోజుల్లో తెలుగువారు రెండు భిన్నరకాల చంద్రబాబులను చూశారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి అవసరమైన అనుభవం తనవద్ద ఉందని పదేపదే చెప్పారు. అయితే ఆ అనుభవం సరిపోతుందా అన్నది చర్చనీయాంశమే. గానుగెద్దుకు కూడా తన జీవితంలో ఎన్నో చుట్లు తిరిగిన విస్తృతానుభవం ఉంటుంది. అంతమాత్రాన అది సరిపోదు కదా! చంద్రబాబులో కొత్తగా ఎలాంటి ఐడియాలు లేవు. 30 ఏళ్ల క్రితం ఆయన చుట్టూ తిరిగిన వారే ఇప్పుడూ ఉన్నారు. వీరు కొత్తగా ఎలాంటి మార్పులు తీసుకురాలేరు. అవసరానికి మించిన అనుభవం ఆంధ్రప్రదేశ్ కొంపముంచేలా ఉంది.
ఢిల్లీ చుట్టూ చంద్రబాబు చక్కర్లు
అనుభవం తక్కువగా ఉన్న కేసీఆర్‌కు భిన్నంగా చంద్రబాబు మాటిమాటికీ ఢిల్లీకి చక్కర్లు కొడుతూ నిధుల కోసం దేబిరించడం చూడడానికే ఇబ్బందికరంగా ఉంది. రాజకీయంగా సీనియర్ నేత అయిన చంద్రబాబు కొంచెం హుందాగా వ్యవహరించి తెలుగువారి గౌరవాన్ని నిలబెట్టాలి. కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర జలవనరుల మంత్రి ఉమా భారతిల ముందు ఆయన మోకరిల్లాల్సిన అవసరమేముంది? ముఖ్యమంత్రులు జయలలిత, నవీన్ పట్నాయక్‌లు కేంద్రానికి దూరంగా ఉంటున్నప్పటికీ వారు అడిగిన పనులను మోడీ సర్కారు గౌరవంగా చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఎదుగుతుందని ఆ పార్టీ గట్టి విశ్వాసంతో ఉంది.
సామరస్యంగా సమస్యల పరిష్కారం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగుజాతి విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కీచులాటలకు స్వస్తి చెప్పాలి. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, మరుగుదొడ్లు, క్యాంటీన్లు వంటి విషయాల్లో ఘర్షణ పంథాకు స్వస్తి చెప్పాలి. విశాల హృదయంతో వ్యవహరించేవారి స్థాయి పెరుగుతుంది. జాతీయ మీడియా, రాజకీయ పార్టీలు ఇదంతా వినోదంగా చూస్తున్నాయి. స్వల్ప విషయాలపై ఘర్షణపడడం మానుకోవాలి. సమస్యలపై ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించుకోవాలి. ముఖ్యంగా విద్యుత్, నదీ జలాలు, ఇతర సమస్యలను నేరుగా మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చు. ఉమాభారతి, పీయూష్ గోయల్ వంటి జూనియర్ మంత్రులకు వీటిని పరిష్కరించే సత్తా ఏమీ లేదు. రెండు రాష్ట్రాల సీఎంలు తమ ఢిల్లీ పర్యటనలకు తగిన సందర్భాలలో ప్రతిపక్ష నాయకుల్ని కూడా వెంటబెట్టుకుని తీసుకువెళ్లాలి. దీనివల్ల కేంద్రానికి సానుకూల సంకేతాలు పంపినట్టవుతుంది.
లోక్‌సభలో ప్రతిపక్ష హోదా కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎందుకు గట్టిగా పట్టుబడుతున్నారో తెలుసా? రాజకీయాలలో ‘ఇమేజ్’కు ఆమె ఇస్తున్న విలువే దీనికి కారణమని చెప్పాలి. రాజకీయాలలో ఇమేజ్‌ను కోల్పోతే అంతా కోల్పోయినట్టే. కేసీఆర్, చంద్రబాబునాయుడు కూడా రాజకీయాలలో ప్రతిష్ట విలువ గురించి ఇకనైనా తెలుసుకోవాలి. ప్రతిష్ట మంటగలిసాక, రాజకీయాల్లో నవ్వులపాలయ్యాక ఎవరూ లెక్కచెయ్యరు మరి!
(వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) పెంటపాటి పుల్లారావు