రైతుల కోసం రాయల నీతి | Sri Krishnadevaraya was Help to the farmers | Sakshi
Sakshi News home page

రైతుల కోసం రాయల నీతి

Published Mon, Jun 5 2017 1:06 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

రైతుల కోసం రాయల నీతి - Sakshi

రైతుల కోసం రాయల నీతి

రైతులు దేశాలు పట్టిపోతే రాజు ఎలా ఆదుకోవాలో ఐదువందల ఏళ్ల క్రితమే కృష్ణదేవరాయలు సూచించాడు. సేద్యము చేసి నష్టపడి పశువులను, ఇండ్లను, ధాన్యమును వదలుకొని వలసపోయే రైతులను అధికారులు ఉపేక్షింప రాదన్నాడు. వారిని రప్పించి సాయపడి సేద్యమునకు సులువులు కల్పించి ఆదుకోవాలన్నాడు.
 

ఆముక్త మాల్యద తెలుగులో విలక్షణ ప్రౌఢ ప్రబంధం. ఇందులో ప్రధాన కథ గోదాదేవిది కాగా, యామునాచార్యుని కథ ఓ ఉపాఖ్యానం. కథ ముగింపులో యామునాచార్యుడు సన్యాసం స్వీకరించాలని నిశ్చయించుకొని, రాజ్యాన్ని తన కొడుక్కి అప్పగిస్తాడు. ఆ సందర్భంలో కుమారునికి రాజనీతి బోధిస్తాడు. శుక్రనీతి, చాణక్యనీతి, కామందకనీతి, శాంతిపర్వం వంటి నీతిబోధక గ్రంథాలు చదివిన కృష్ణదేవరాయలు తాను  పాటించిన నీతినే యామునాచార్యుని చేత చెప్పించాడని పండితాభిప్రాయం. వాస్తవంగా ఈ రాజనీతి బోధించక పోయినా కథకు ఏ లోటూ రాదు. రెండు దశాబ్దాలపాటు రణతంత్రం, రాజ్యతంత్రం నడిపి, ప్రజారంజకుడిగా పాలించిన చక్రవర్తి గనుక మక్కువతో ఎనభై రెండు పద్యగద్యాలతో రాజనీతిని చెప్పి తన సరదా తీర్చుకున్నాడు.

ఈ రాజనీతిలో పొరుగు రాజులతో యుద్ధాలు, సంబంధాలు, విదేశీ వర్తకులకు చేయవలసిన మర్యాదలు, రాజ్యంలోని వివిధ వర్గాలు, మనస్తత్వాల వ్యక్తులతో వ్యవహరించే విధానాలూ ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే, కేవలం ప్రభువు ప్రజలను ఎలా కాపాడాలి? అని చెప్పే పద్యాలను విశ్లేషించడమే ఈ వ్యాస ముఖ్యోద్దేశం.

‘ఏపట్టున విడువక ర
క్షా పరుడవు గమ్ము ప్రజలచక్కి, విపన్ను
ల్కూపెట్టిన వినితీర్పుము
కాపురుషుల మీద నిడకు కార్యభరంబుల్‌ ’ అని రాశాడు రాయలు. ప్రజలను నిత్యమూ కష్టాలనుండి కాపాడు, ఆపదలోనున్నవాడు మొరపెట్టుకున్నప్పుడు ఆపదలను తొలగించు, కార్య నిర్వహణకు దుర్జనులను నియోగించవద్దు అని ఈ పద్యభావం. ‘దేశ వైశాల్య మర్థ సిద్ధికి మూలము’ అనే పద్యంలో ప్రజలకు జలాధారములు కలిగించి, పంటకాల్వలను తవ్వించాలన్నాడు. చిన్న రైతులకు కూడా నీటివసతి కలిగించి, వారినుండి తక్కువ పన్ను వసూలు చేయాలన్నాడు.

రైతులు దేశాలు పట్టిపోతే రాజు ఎలా ఆదుకోవాలో కూడా ఐదువందల ఏళ్ల క్రితమే రాయలు  సూచించాడు. ‘ప్రజ నవసి చన్న బిలువ, కప్పసుల గొలుచు నమ్మి’ అనే పద్యంలో సేద్యము చేసి నష్టపడి పశువులను, ఇండ్లను, ధాన్యమును వదలుకొని వలసపోయే రైతులను అధికారులు ఉపేక్షింప రాదన్నాడు. వారిని రప్పించి సాయపడి సేద్యమునకు సులువులు కల్పించి ఆదుకోవాలన్నాడు. రైతులను కష్టపెట్టే అధికారులున్న రాజ్యమూ బాగుపడదు, రాజూ బాగుపడడని చెప్పాడు. రైతులను కష్ట పెట్టే అధికారులకు రాజు ఏడుదీవులు జయించి అప్పజెప్పినా రాజ్యం సుభిక్షం కాదని హెచ్చరించాడు.

ఇక రాజు ఎట్లుండాలో కొన్నిపద్యాలలో విపులంగా చెప్పాడు. ‘దండపారుష్యంబు కొండెంబున’ పద్యంలో దండించుటయందు క్రూరత్వం, కొండెగాండ్రు చెప్పిన మాటలు పరిశీలించుట, శత్రువు సంధి కోరినపుడు అవకాశమివ్వక యుద్ధం చేయుట, ఒక విదేశీయుడు వచ్చి తన దేశపురాజు హింసించాడని మొరపెట్టుకుంటే అతడిని బంధించి ఆ దేశపు రాజుకు అప్పగించుట, నమ్మకము లేని మనిషితో కలసి తిరుగుట, నమ్మకస్తుని దూరము చేసికొనుట, మంత్రులు చెప్పిన ప్రతిమాటనూ చర్చించకయే అంగీకరించుట, రహస్యాలోచనను ఇతరులకు తెలియజేసినవానిని దండించకుండుట, వింతలు పుట్టినప్పుడు పరిశీలించకుండుట, వ్యసనములలో పడియుండుట, మాత్సర్యము వహించుట వంటి పనులు రాజు చేయకూడదన్నాడు. ‘ఎరుగ నగున్‌ స్వశక్తి నవనీశుడు’ పద్యంలో యే విషయమైనా మూడుపాళ్ళు తానే తెలుసుకొని, నాల్గవపాలు మిత్రులనుంచి సేకరించాలన్నాడు. తన మతమే జరిగి తీరాలనే దురభిమానము ఉండకూడదన్నాడు. ఆపదలలో పరాధీనుడు కాకూడదనీ, దండనలో ఉగ్రత్వము వహించకూడదనీ రాశాడు.

‘తజ్ఞమండలి గూర్చి, ధాతువుల్‌ దెలిసి, హేమాదులగొని’లో రాజు తన శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే స్వర్ణ భస్మాదులను సేవించి దేహమును కాపాడుకోవాలని చెప్పాడు. రాజు తన దేహాన్ని ఎలా కాపాడుకొంటాడో, అలాగే బంగారు గనులను గుర్తించడం, ప్రజలకు సౌకర్యాలు కలిగించడం, ప్రజాకంటకులను అణగదొక్కడం వంటి పనులతో సప్తాంగములతో కూడిన రాజ్యాన్ని కాపాడాలని శ్లేషతో హితవు పలికాడు. ‘ఆ పాలకూటనే నిజమేపాటియు దప్ప రాడిరే’ పద్యంలోనూ, దానికి ముందు వెనుకగల పద్యాలలోనూ గిరిజనుల మనస్తత్వాన్ని చక్కగా చిత్రీకరించాడు. వారు నాగరిక సమాజంలోని మాయ తెలియనివారు, నమ్మిన వారికి ప్రాణాలు ఇస్తారు, అబద్ధాలతో మోసగించిన వారి ప్రాణాలు తీస్తారు, అట్టి ఆదివాసీలతో సత్యమునే మాట్లాడుతూ రాజ్యం కొరకు వారిని వినియోగించు కోవాలన్నాడు.

అంతిమంగా– ‘కన్నొకటి నిద్రవో బెఱకంట జాగ
రంబు గావించు భూరుహాగ్రంబు మీది
యచ్చ భల్లంబు గతి భోగమనుభవించు
నెడను బహిరంతరులపై దృష్టి వలయు’ పద్యంలో కొమ్మచివర ఎలుగుబంటి కన్నొకటి మూసి నిద్రిస్తుంది, రెండవకన్ను తెరిచి పరిసరాలను, పరిస్థితులను గమనిస్తూనే వుంటుందనీ అలాగే రాజు ఎన్ని భోగాలు అనుభవిస్తున్నా, ఒక కంటితో రాజ్యాన్ని గమనిస్తుండాలనీ అన్నాడు.

రాజనీతి రచన కషాయం లాంటిది. నాడీజంఘుని కథ, దృపదుడు, యాజి, ఉపయాజుల కథ, ఆదివాసుల ఆతిథ్యం వంటివి ఆయా చోట్ల సూచనామాత్రంగా వినియోగించుకున్నాడు రాయలు. ఉపమ, ఉత్ప్రేక్ష వంటి అర్థాలంకారాలను వాడుకున్నాడు. ఇవన్నీ చక్కెరగుళికల్లా కషాయాన్ని ఆస్వాదయోగ్యంగా మార్చాయని చెప్పవచ్చు.
నిత్యమూ ఒక కంటితో ప్రజలనూ, రాజ్యాన్నీ కంటికి రెప్పలా కాపాడాడు కనుకనే కృష్ణదేవరాయలు నేటికీ ప్రాతఃస్మ

                                                                           - గార రంగనాథం
                                                                             9885758123

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement