
జలకళతోనే ఐక్యత
అభిప్రాయం: కోస్తా, తెలంగాణ జిల్లాలకు సాగునీటి కోసం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తూ అలనాటి ప్రధాని నెహ్రూ సాగర్ కుడి, ఎడమ కాలువలు తెలంగాణ, ఆంధ్ర ప్రజల స్నేహ వారధిగా నిలవాలని ఆకాంక్షించారు.
భాషా ప్రాతిపదికపై తెలుగు ప్రజలంతా ఒక రాష్ట్రంగా ఏర్పడినంత మాత్రాన తెలుగునాట నెలకొన్న అసమాన అభివృద్ధి సమస్యలు పరిష్కారం కావని ఆదిలోనే గుర్తించిన మహానుభావులు ఎందరో ఉన్నారు. సంకుచిత ప్రాంతీయ తత్వాన్ని అధిగమించి ఆ సమస్యలను పరిష్కరించడానికి వారు చిత్తశుద్ధితో కృషిచేశారు. జలవనరుల సద్వినియోగం ఆ కృషిలోకెల్లా ప్రధానాంశమని వారు భావించారు. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోయే సందర్భంగా రాయలసీమ ప్రజలు శ్రీభాగ్ ఒడంబడికను కుదుర్చుకున్నారు. అలాగే తెలంగాణ నైజాం పాలన నుంచి విముక్తి చెందిన తదుపరి పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది. అనేక సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటూ, ఎదురుదెబ్బలు తింటూ కూడా తెలుగు వారి వికాసం కొనసాగింది. వెనుకబాటుతనం, నిరుద్యోగం, ప్రాంతీయ అసమానతలనే సమస్యలు ఎప్పటికప్పుడు తలెత్తుతూనే ఉన్నా సమన్యాయం ప్రాతిపదికపై వాటిని పరిష్కరించు కుంటూ తెలుగు ప్రజల ఐక్యతను పదిలం చేయడం సాధ్యమేననే విశ్వాసం అన్ని ప్రాంతాల ప్రజల్లోనూ ఏర్పడింది.
ప్రాంతీయతత్వమన్నదే లేకుండా నీలం, ఎన్టీఆర్, వైఎస్‌లు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు జలకళతో సస్యశ్యామలంగా మారాలని తాపత్రయపడ్డారు.వైఎస్ ప్రజాప్రస్థానం ప్రారంభించిన ప్రాంతంలోనే ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఎత్తిపోతల పథకమైన చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
1956కు మునుపే రాయలసీమతోపాటూ, నెల్లూరు, మద్రాసుల సాగునీటి, తాగునీటి అవసరాల కోసం కృష్ణా-పెన్నార్, గండికోట, గాలేరు-నగరి ప్రాజెక్టులకు పథకాలు రూపొందాయి. కోస్తాలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీటి కోసం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. డాక్టర్ నీలం సంజీవరెడ్డి ఎనలేని కృషితో సాధ్యమైన ఆ ప్రాజెక్టుకు అలనాటి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా నెహ్రూ... నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువలు తెలంగాణ, ఆంధ్ర ప్రజల స్నేహ వారధిగా నిలవాలని ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధి కోసం నీలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పునాదులు వేశారు. కృష్ణా నీటిని రాయలసీమ, తెలంగాణలకు వినియోగించుకోలేని చారిత్రక తప్పిదాన్ని ఆయన గ్రహించారు. నెహ్రూ వద్ద తనకున్న పలుకుబడినంతా ప్రయోగించి శైలం ప్రాజెక్టుకు పునాదిని వేయించారు.
శ్రీశైలం నుంచి మద్రాస్‌కు తాగు నీటిని అందించే ప్రతిపాదన ఎట్టకేలకు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా తెలుగుగంగ రూపంలో సాకారమైంది. కృష్ణా పరీవాహక రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లు ఒక్కొక్కటి 5 టీఎంసీల చొప్పున మొత్తం 15 టీఎంసీలను కేటాయించే ప్రాతిపదికపై ఆ పథకం రూపొందింది. ఆయన చేతుల మీదుగానే గాలేరు-నగరి, హంద్రీ-నీవా, శ్రీశైలం కుడికాలువ, తెలుగుగంగ తదితర ప్రాజెక్టులకు పునాదులు పడ్డాయి. 1983-1989 మధ్య సాగిన సీమ సాగునీటి ఉద్యమానికి వైఎస్ గౌరవాధ్యక్షులుగా నేతృత్వం వహించారు. ఆ ఉద్యమం గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులతోపాటూ, తెలుగు గంగ, శ్రీశైలం కుడికాలువల పొడిగింపును కూడా కోరింది. అనంతపురం జిల్లాకు కేసీ కెనాల్, తుంగభద్ర జలాలను కేటాయించాలని డిమాండు చేసింది. అంతేగాక తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు శ్రీశైలం ఎడమ కాలువ ద్వారా నీటిని అందించాలని కూడా వైఎస్ పోరాడారు. ఇక ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు శ్రీశైలం ప్రాజెక్టు నీటి కోసం ఆందోళన సాగించారు. ప్రాంతీయతత్వమన్నదే లేకుండా నీలం, ఎన్టీఆర్, వైఎస్‌లు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు జలకళతో సస్యశ్యామలంగా మారాలని తాపత్రయపడ్డారు. సంకుచిత ప్రాంతీయ ప్రయోజనాలకు తావులేని తెలుగువారి ఐక్యతకు ప్రతీకలై నిలిచారు.
ప్రతిపక్ష నేతగా వైఎస్ సాగించిన చరిత్రాత్మక ప్రజాప్రస్థానాన్ని తెలంగాణ నుంచి ప్రారంభించడంలో కూడా అదే ఐక్యతాభావం కనిపిస్తుంది. ఎన్ని ఒత్తిడులు, అభ్యం తరాలు ఎదురైనా వైఎస్ తెలంగాణలోని చేవెళ్లలోనే దాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. నాయకుల తీవ్ర నిర్లక్ష్యం, తీవ్రవాదం, మతోన్మాదం కారణంగా తెలంగాణ ప్రజల్లో తీవ్ర నిరక్ష్యానికి గురయ్యామన్న అసంతృప్తి నెలకొన్నదని వివరించారు. ఆయన చేపట్టిన ప్రతి కొత్త పథకం చేవెళ్లలోనే ప్రారంభమైంది. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ఏడు తెలంగాణ జిల్లాలలోని 17 లక్షల ఎకరాలకు నీటిని అందించే పథకం ఇది. ముఖ్యమంత్రిగా వైఎస్ మొదటి విలేకరుల సమావేశంలో పులిచింతల ప్రాజెక్టుపై మాట్లాడుతూ ఎగువన ఉన్న రాయలసీమ, తెలంగాణ జిల్లాల ప్రాజెక్టులకు చెందాల్సిన నీటిని దిగువన ఉన్న కృష్ణా డెల్టా రైతాంగం లాక్కుంటుం దన్న భయాలు నిరాధారమని తేల్చిచెప్పారు.
పోలవరం, దుమ్ముగూడెం, నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టులతో కృష్ణా-డెల్టా, నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల ఆవసరాలను తీర్చి ఆయకట్టును పెంచవచ్చని తెలిపారు. శ్రీశైలం నుండి సాగర్, కృష్ణా-డెల్టాలకు విడుదల చేసేంత నీటిని నాలుగు రాయలసీమ జిల్లాలకు, నెల్లూరు, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు కేటాయించ్చునని విశదం చేశారు. నాటి ఆ ఆలోచనలే జలయజ్ఞంగా రూపుదిద్దుకున్నాయి. గోదావరిపై పోలవరం, దుమ్ముగూడెం, నాగార్జునసాగర్ టెయిల్ పాండ్‌ల నిర్మాణంతోపాటూ తెలంగాణ లోని నాలుగు ప్రాజెక్టులను, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును కలిపి ఏడింటికీ జాతీయ ప్రాజెక్టులుగా గుర్తింపును కోరారు.
ఒక సందర్భంలో తెరాసకు చెందిన పదిహేను మంది ఎమ్మెల్యేలు నాయిని నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ను కలిసి మాట్లాడారు. ఆ సమావేశం చివర్లో హరీష్‌రావు 610 జీవో గురించి ప్రస్తావించారు. అందుకు వైఎస్ వెంటనే ‘చూడండి హరీష్‌రావుగారూ, నేను వెనుకబడిన ప్రాంతాల నుండి ఎదిగి వచ్చిన వ్యక్తిని. వెనుకబడిన ప్రాంతాల మనోభావాలు, సమస్యలు ఏమిటో అర్థం చేసుకోగలను. 610 జీవోను అవసరమైతే సవరించి, ఇంకా విస్తరించి ప్రైవేట్, కార్పొరేట్ సెక్టార్లకు కూడా ఆ జీవో ప్రయోజనాలను విస్తరింపజేయడానికి ప్రయత్నించడానికి సైతం నేను సిద్ధంగా ఉన్నాను’ అన్నారు. వారు వెళ్లిపోయిన తర్వాత ఒక పాత్రికేయుని ప్రశ్నకు సమాధానంగా ఆయన... తెలంగాణ అభివృద్ధి పేరుతో రాజకీయాలు చేసేవారిని, తెలంగాణ ప్రజలను మనం వేరువేరుగా చూడాలి. తెలంగాణ ప్రజల వైపు చూడు. అనేక సమస్యలు అర్థమవుతాయి అని హితవు పలికారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా వైఎస్ లేఖ ఇచ్చారని నేడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, చంద్రబాబు ఒక్క గొంతుకతో అసత్య ప్రచారం సాగిస్తున్నారు. దిగ్విజయ్‌సింగ్, వీరప్ప మొయిలీ, గులాం నబీ ఆజాద్‌లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిలుగా ఉండగా వైఎస్ తెలంగాణ పట్ల, రాష్ట్ర సమైక్యత సమగ్రతల పట్ల వ్యక్తపరచిన అభిప్రాయాలేమిటో అందరికీ తెలుసు. తెలంగాణ అంశం తేల్చడానికి ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రిగా ఆయన హాజరయ్యారు. తెలంగాణ విభజన జరిగితే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని, దాంతో మరి మూడు, నాలుగు రాష్ట్రాలు కావాలని ఉద్యమాలు తలెత్తుతాయని తెలిపారు. ‘‘విభజనపై వైఎస్ అభిప్రాయాలను మేము తప్పుగా అర్థం చేసుకున్నాం. ఆయన వైఖరి సరైనదే’’ అంటూ నాడు కేంద్ర మంత్రిగా ఉన్న ప్రణబ్‌ముఖర్జీ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి.
కాంగ్రెస్ పార్టీ నేడు కేవలం ఓట్లు, సీట్ల లెక్కలతోనే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నదనేది రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలతోపాటూ, తెలంగాణ ప్రజలకు కూడా తెలిసిందే. సహజంగానే నేడు వైఎస్ అన్ని ప్రాంతాల తెలుగు ప్రజలకు గుర్తుకు వస్తున్నారు. వైఎస్ బతికుంటే ఇలా జరిగేదా? వైఎస్ కుటుంబంపై కక్ష సాధింపునకు తెలుగు ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేయడం సమంజసమేనా? అనే ప్రశ్న పార్టీలకు అతీతంగా అందరినీ వేధిస్తోంది.
రాష్ట్ర అభివృద్ధిపై నెలకొన్న అపోహలన్నీ తొలగిపోయేలా శ్రీకృష్ణ కమిషన్ గత ఆరు దశాబ్దాల కాలంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఆర్థిక, సామాజిక అభివృద్ధి చిత్రాన్ని కళ్లకు గట్టింది. రాష్ట్ర ఐక్యతకు ప్రాధాన్యం ఇచ్చి, సమస్యలకు తగు పరిష్కారాలను సూచించింది. సమైక్య రాష్ట్రంలో తెలుగు వారి సర్వోతోముఖాభివృద్ధిని ఆకాంక్షిం చిన పొట్టి శ్రీరాములు, బూర్గుల రామకృష్ణారావు, నీలం, ఎన్టీఆర్, వైఎస్‌ల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ తెలుగు ప్రజల ఐక్యతను పరిరక్షించుకోవాల్సిన సమయమిది.
- ఇమామ్
సంపాదకులు, ‘కదలిక’