భూసమీకరణా.. భూదందానా..?
విశ్లేషణ
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా ఇంతవరకూ దుగరాజపట్నం లేక రామాయ పట్నం మేజరు పోర్టు పనులే ప్రారంభానికి నోచుకోలేదు. పోర్టుల అభివృద్ధే నత్తనడకన సాగుతుండగా రైతులకు చెందిన వేలాది ఎకరాల పట్టాభూములపై ప్రభుత్వం ఎందుకు కన్నేస్తున్నట్లు?
రాష్ట్ర ప్రభుత్వ భూసమీకరణ వ్యవహారం భూదం దాకు అచ్చమైన నిదర్శనంగా రూపొందుతోంది. రాజధాని కోసం ముక్కారు పంటలు పండే ప్రాంతంలో 30 వేలకుపైగా మాగాణి భూములను సమీకరించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పారిశ్రామిక రంగ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఒక్క మచిలీపట్నం ఓడరేవు, పారిశ్రామిక కారిడార్ సాకుతో వేలాది ఎకరాల భూమిని కైవసం చేసు కోవడానికి శరవే గంగా పావులు కదుపుతోంది. దీంట్లో రైతుల పట్టాభూములే 12 వేల ఎకరాలకు పైబడి ఉన్నాయంటే అభివృద్ధి పేరిట ప్రభుత్వం సాగించనున్న భూదందా వ్యవహారం ఎంత తీవ్రస్థాయిలో ఉంటోందో అర్థం చేసుకోవచ్చు. రైతుకు స్వాంతన కలిగిస్తున్న భూ సేకరణ చట్టం కింద కాకుండా ల్యాండ్ పూలింగ్ కింద భూములను లాక్కోవాలని ప్రభు త్వం చూస్తుండటం వేలాది రైతుల జీవితాలను అస్తవ్యస్థతకు గురిచేయనుంది.
మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో 1.05 లక్షల ఎక రాలలోని 36,559 ఎకరాల భూమి మచిలీ పట్నం ఓడరేవు, పారిశ్రామిక కారిడార్ కోసం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఓడరేవు కోసం 2,282 ఎకరాలు, అనుబంధ పరిశ్రమల కోసం 12,144 ఎకరాల రైతువారి పట్టా భూములను ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకోవాలని ప్రభుత్వం సంక ల్పించింది. అమరావతి తరహాలో ఎకరా ఇచ్చిన వారికి 1000 గజముల నివాస స్థలం, 250 గజాల వాణిజ్య స్థలం ఇవ్వాలని, ఏడాదికి లీజు క్రింద రైతుకు రూ. 30,000లు ఇచ్చేం దుకు వ్యవసాయ కూలీ కుటుంబానికి నెలకు రూ. 2,500లు పింఛను ఇచ్చేం దుకు అవకాశం ఉంటుంది.
అనేక దశాబ్దాల తర్వాత రైతులు, భూములపై ఆధారపడ్డ ఇతర ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ ఆమోదం పొందిన 2013 భూసేకరణ చట్టం ఇప్పుడు అమలులో ఉంది. దీని ప్రకారం నిపుణుల బృందంతో సామాజిక ప్రభావం అంచనా, పర్యావరణ అంచనాలు వేసిన తదుపరి నూటికి 70 మంది రైతులు, ప్రజలు భూసేకరణకు ఆమోదించ వలసి ఉంటుంది. మార్కెట్ వాల్యూ (రిజిస్ట్రేషన్ విలువ)కు పట్టణ ప్రాంతంలో 2 రెట్లు, గ్రామీణ ప్రాంతంలో 4 రెట్లు చొప్పున రైతులకు నష్ట పరిహారం ఇవ్వవలసి ఉంటుంది. దీని ప్రకారమే ఇటీవల భోగాపురం ఎయిర్‌పోర్టు కొరకు తీసుకోనున్న భూములకు రూ. 25 నుండి 33 లక్షల రూపాయల నష్ట పరిహారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పుడు మచిలీపట్నం పోర్టు కొరకు 4,800 ఎకరాలు అవసరమని, ప్రభుత్వ భూమి సుమారు 2,300 ఎకరాలు కాక రైతుల నుంచి 2,282 ఎకరాలు భూసమీకరణలో తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించటం ఎంతమాత్రం సరి కాదు. మచిలీపట్నంలో సముద్రంలోతు (డ్రాఫ్ట్) 13 మీటర్లు, 3 బెర్తులు నిర్మిం చాలని పోర్టు డెవలపర్ ప్రతిపాదన, ఇందుకు ప్రభుత్వ భూమి 2,300 ఎకరాలు సరిపోతుంది. 21 మీటర్ల లోతుతో, 5 బెర్తులతో 14 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకును ఇప్పటికే హ్యాండిల్ చేస్తూ ఉన్న గంగవరం పోర్టునకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 1800 ఎకరాలు మాత్రమే. అంతేకాక మన దేశంలో మేజరు పోర్టులు అయిన చెన్నై పోర్టు 500 ఎకరాలు, ఎన్నూరు పోర్టు 2,000 ఎకరాలు, ట్యుటుకో రిన్ పోర్టు 2,150 ఎకరాలు, కొచ్చిన్ పోర్టు 2,000 ఎకరాలు, న్యూమంగళూరు పోర్టు 1,908 ఎకరాలు, మార్మగోవా 530 ఎకరాల విస్తీర్ణంతోనే తమ కార్యకలా పాలు నిర్వహిస్తున్నాయి.
మన రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ఆదర్శప్రాయమైన సింగపూర్‌లో పి.ఎస్.ఎ. సింగపూర్ రేవు 1,500 ఎకరాలలో 52 బెర్తులతో పనిచేస్తూ ఉంది. అలాగే జురాంగ్ పోర్టు 400 ఎకరాలలో 32 బెర్తులతో పనిచేస్తూ ఉంది. అనగా కేవలం 1,900 ఎకరాలలో 84 బెర్తులతో కోట్లాది టన్నుల సరుకులను హ్యాండిల్ చేస్తూ, ఈ రెండు పోర్టులు పని చేస్తున్నాయి. ఇక్కడ మచిలీపట్నం పోర్టునకు అవసరమని చెబుతూ ఉన్న 4,800 ఎకరాలలో ఒక మినీ స్టీల్ ప్లాంట్, ఒక థర్మల్ పవర్ ప్రాజెక్టు, ఒక సెజ్, డీశాలినేషన్ ప్లాంట్ మున్నగునవి ఉంటాయని పోర్టు డెవలపర్ సమర్పించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులో (డి.పి.ఆర్.) ఉంది కావున ఎట్టి పరిస్థితులలోను పోర్టు కోసం రైతుల భూమి ఒక ఎకరా కూడా తీసుకోవలసిన అవసరం లేదు. ఒకవేళ ఉంది అని భావించితే 2013 భూసేక రణ చట్టంను అనుసరించి న్యాయమైన నష్ట పరిహారమును చెల్లించి భూసేకరణ ద్వారా తీసుకొన వచ్చును.
మన దేశంలో అనేక రాష్ట్రాలలో రహదారుల కొరకు, పరిశ్రమల కొరకు, ప్రాజెక్టుల కొరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 2013 భూసేకరణ చట్టంను అను సరించి రైతులకు నష్టపరిహారం ఇచ్చి భూములను తీసుకొంటున్నాయి. ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు భూసమీ కరణ క్రింద భూములు ఇచ్చివున్నారు, కాబట్టి మచిలీపట్నంలో కూడా అదే తరహాలో భూములు ఇస్తారని భావించటం ఎంతమాత్రమూ తగదు. అది రాజ ధాని ప్రాంతం కాబట్టి కొంతకాలం తర్వాతైనా తమ భూములకు మంచి ధరలు వస్తాయని మెట్ట గ్రామాలలోని రైతులు ఆశించారు. కొందరు మంత్రులు, పార్ల మెంట్ సభ్యులు రైతుల భూములకు భవిష్యత్తులో కోట్లకు కోట్ల రూపాయలు వస్తాయని భ్రమలు కల్పించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే కొన్ని ప్రైవేటు సంస్థలకు వందల ఎకరాల భూములను ఎకరాకు రూ. 50 లక్షల చొప్పున భూ సంతర్పణ చేస్తూ ఉంటే ఆ మెట్ట గ్రామాలలోని రైతుల ఆశలు రానున్న కాలంలో అడియాశలు అయ్యే పరిస్థితి ఉంది.
మన బందరు పట్టణంలో ప్రధానమైన రహదారి, కలెక్టరేట్ వంటి కొద్ది రహదారులు మినహా ఏ మాత్రం అభివృద్ధి జరిగినదో ప్రజ లందరికీ ఎరుకే. ఇలాంటి పరిస్థితులలో ఎకరా భూమి (4,840 చదరపు గజాల)ని ఏమాత్రం నష్ట పరిహారం తీసుకోకుండా ప్రభుత్వానికి ఇచ్చి, దానికి బదులుగా ప్రభుత్వం ఇచ్చే 1,250 చదరపు గజాలను మాత్రమే తీసుకోవటానికి రైతులు ఏమన్నా బిచ్చగాళ్ళా! దాదాపు 18 నుండి 20 వేల ఎకరాల మేరకు ప్రభుత్వ భూమి పెట్రో కెమికల్ కాంప్లెక్స్, పారిశ్రామిక కారిడార్ కొరకు అందుబాటులో ఉందని మంత్రులే చెబుతున్నారు. కావున ఏ ఏ పరిశ్రమలు వస్తాయి? వాటికి వాస్త వంగా ఎంత భూమి అవసరం? అని అంచనాలు రూపొందించుకొని రైతుల నుంచి అవసరం అయ్యే భూములకు 2013 చట్టంను అనుసరించి నష్ట పరి హారం చెల్లించి తీసుకోవాలి.
ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో 13 పోర్టులు ఉన్నాయని బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉన్నదని పదే పదే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ రెండు సంవత్సరాలలో ఒక్క పోర్టు పనిని కూడా ప్రారంభించలేదు. పొరుగున ఉన్న ఒరిస్సా రాష్ట్రములో పారాదీప్ మేజర్ పోర్టే కాక నవీన్ పట్నాయక్ ప్రభుత్వం దమ్‌రా, కిరిటానియా, గోపాల్‌పూర్ మున్నగు పలు పోర్టుల అభివృద్ధికి చక్కగా కృషి చేస్తూ గణనీయమైన ఆదాయాన్ని కూడా పొందుతూ ఉంది. తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటికే 3 మేజర్ పోర్టులు ఉండగా ఇప్పుడు కొత్తగా 4వ మేజర్ పోర్టును కొలాచల్ సమీపంలో ఎనైమ్ వద్ద రూ. 21 వేల కోట్లు ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం ఇటీవల ఆమోదించింది.
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటిపోతూ ఉన్నా ఇంత వరకూ దుగరాజపట్నం లేక రామాయపట్నం మేజరు పోర్టు పనులు ప్రారం భానికి నోచుకోలేదు. 2,300 ఎకరాలలో బందరు పోర్టు పనిని చేపట్టేందుకు నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ముందుకు రాని పక్షంలో విశాఖపట్నం పోర్టు ట్రస్టువారు మన రాష్ట్రంలో ఒక పోర్టును చేపట్టి అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో.. మచిలీపట్నంలో 2,300 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఇచ్చి విశాఖపట్నం పోర్టు ట్రస్టు వారిచే మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. రాష్ట్ర ప్రభుత్వం ‘‘మడ’’ ఏరియాలో తలపెట్టిన భూసమీకరణ ప్రయత్నాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రైతాంగం కోరుతూ ఉంది.
- వడ్డే శోభనాద్రీశ్వరరావు
వ్యాసకర్త మాజీ మంత్రి, వ్యవసాయ రంగ నిపుణులు
మొబైల్ : 93929 59999