
'నీ యన్యాయము సిగగొయ్య'
నా రెండవ ఫారములో రాగం సత్యనారాయణ యని యొక డుండెడివాడు. అతని తండ్రి ఫారెస్టు ఆఫీసరు. ధనవంతులు వారు. కాపు లనుకొందును. అతడు కొంచెము బొద్దుగా నుండెడి వాడు. జుట్టు మాత్రము- హిందీలో గొప్పకవి సుమిత్రానందన్ పంత్, తెలుగులో నొక గొప్పకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి- వీరి జుట్టువలె నుండెడిది. వీరిద్దఱిని నేను పెద్దనైన తరువాత నెఱుగుదును. ఆ జుట్టు మాత్రము చిన్నప్పుడు యెఱుగుదును.
అప్పటి నా వేషము చెప్పినచో మీకిప్పుడు నవ్వు వచ్చు ననుకొందును. ఒక లాగు, ఒక చొక్కా, చేతులకు మురుగులు, కాళ్ళకు కడియాలు, నెత్తిమీద జుట్టు, ముందు వసారా గొఱిగింపు, జుట్టుముడి వెనుక గిరజాలు, ముందు సన్నని గిరజాలు- ఇది నా వేషము. ఆ రాగం సత్యనారాయణ జుట్టు నా కబ్బురము గొల్పెడిది. నా వేషము సహజ మన్నమాట!
వింత యనగా మన మెఱుగనిది. ఈ యజ్ఞానముతో పాటు నహంకారము కూడ నున్నచో పరిహాసము కూడ చేయుదురు.
ఈ రాగము సత్యనారాయణ నాకు తమలపాకు కిల్లీలు లంచము పెట్టెడివాడు. ఒక యేడా! రెండేండ్లా!! నాలుగైందేడ్ల లంచము. ఇది యలవాటైనది. తాంబూలము లేకుండ మరియు భోజనము చేసిన వెంటనే లేకుండ నాకానాటి నుండి యీనాటి వఱకు ననగా నరువది యేండ్లు కడచిన దినములు మొత్తము మీద పది యుండునేమో! అనగా అరువది మూడువందల యరువదులు. హెచ్చవేసుకొనుడు.
ఈ తాంబూల సేవనమునకు నా నాల్గవ ఫారమైన తరువాత నొక గట్టి దోహదము జరిగినది. అది నా భార్య కాపురముకు వచ్చుట. నేను తమలపాకులు వక్కలు కొనినచో మా నాయనగా రేమనుటకు వీలులేదు కదా! తాంబూలము వాజీకరణము.
నేను రెండవ ఫారము చదువుచుండగా నొక మార్పు జరిగినది. అప్పటినుండి యిప్పటి వఱకు నింగ్లీషు బడులలో నేమి, అనుసరించి తక్కిన బడులలో నేమి, పెద్ద పరీక్షలు వేసగి కాలమునకు ముందు మార్చి ఏప్రిలు మాసము లందు జరుగును. తత్పూర్వము అనగా 1909, 1910 అనుకొందును. పెద్ద పరీక్షలు డిసెంబరులో జరిగెడివి. నేను రెండవ ఫారములో నుండగా పెద్ద పరీక్షలను డిసెంబరు నుండి మార్చికి మార్చిరి. ఆ సంవత్సరము దేశములో నన్ని పాఠశాలలలో కళాశాలలలో అన్ని తరగతులను, అన్ని ఫారములను, అన్ని పరీక్షలను పదునాల్గు నెలలు చదివిరి. అనగా నా రెండవ ఫారము చదువు సంవత్సరమున్నర చదువన్న మాట.
నేను తరగతికి మానిటరును. తెలివి గలవాడను. నేనల్లరి చేయకూడదు. ప్రక్క కుఱ్ఱవానితో మాటాడకూడదు. నా ప్రవర్తన తక్కిన పిల్లలకు మార్గదర్శిగా నుండవలెను. కాని నాకంటె నల్లరి పిల్లవాడు లేడు. అది మాస్టర్లకు తెలియదు. ఒకనాడు నేను ప్రక్కవానితో మాటాడుచుంటిని. పాఠము చెప్పినాయన చూచినాడు. గద్దించినాడు. 'నీవు పాఠము వినుట లేదు' అన్నాడు. 'వినుచుంటిని' అని నేనంటిని. 'ఏమి చెప్పితినో చెప్పు' మనెను. చెప్పితిని. ఏమి చేయును! ఆయనకు కోపము వచ్చినది. ఆయన పాఠములో ప్రశ్నలు వేయనారంభించెను. పది పండ్రెండ్రు ప్రశ్నలు వేసెను. అన్నిటికి సమాధానము చెప్పితిని. నేను తప్పు చెప్పువఱకు ప్రశ్నలు వేయుచునే యుండెను. చివర కొక తప్పు వచ్చినది. ఇంతపొడుగు ప్రేప బెత్తము... కొట్టుటకు చేయి చాపు మన్నాడు. నాకేడుపు వచ్చినది. ఏడ్చుచు చేయి చాచి 'కొట్టు... నీ యన్యాయము సిగగొయ్య' అన్నాను. నేను పల్లెటూరి వాడను గదా! మా మాటలే అవ్వి. ఆయనకు పకాలున నవ్వు వచ్చినది. నేను తెలివిగల పిల్లవాడనని కొంత ముద్దున్నది కదా!
(విశ్వనాథ సత్యనారాయణ 'ఆత్మకథ' నుండి; సౌజన్యం: శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్, 8019000751)