
జనసంక్షేమానికి వేగుచుక్క
వ్యవసాయం, సాగునీటి రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురయిన కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాకాశంలోకి దూసుకొచ్చిన ధృవతార వైఎస్. సాగునీటి కోసం తను చేపట్టిన జలయజ్ఞం పురాతన కాలంలో మన పూర్వీకులు చేసిన అశ్వమేధ, రాజసూయ యాగాల వంటి పవిత్రమైన పథకం. హామీలు దాటేయటం పాలకులకు అలవాటుగా మారుతున్న కాలంలో ఆయన పథకాలు జనం మరువని జ్ఞాపకాలు. కనుమరుగైనప్పటికీ, అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఆయన జననేతే.
ఆయన కనుమరుగై నేటికి సరిగ్గా అయిదేళ్లు. కానీ ప్రజా రాజకీయాల్లో ఓ వేగుచుక్క లాగ నేటికీ జన నీరాజనాలు అందుకుంటూనే ఉన్నారు. వ్యవసాయం దండగ అంటూ తొమ్మిదేళ్లపాటు రైతుల ఊపిరిని నలిపివేసిన చంద్రబాబు నాయుడి పాలనపై గురిపెడుతూ ఆయన అప్పట్లో మొద లెట్టిన పాదయాత్ర యావత్ దేశాన్నీ ఆకర్షించింది. గెలిచిన తర్వాత కూడా ఏం చెప్పారో దాన్నే చేసి చూపారు. చెయ్య లేమనుకున్నది చెప్పనన్నారు. అధికారంలోకి రాక ముందు, వచ్చాక, ఇప్పుడు కనుమరుగయ్యాక కూడా రాష్ట్ర ప్రజలకు ఆయన విధానాల గొప్పతనం అర్థమవుతూనే ఉంది.
ఆయనకు ముందూ, ఆ తర్వాతా అనే కొల మానంతోనే ప్రజలు ఇవ్వాళ పాలకులను బేరీ జు చేస్తున్నారు. గెలుపుకోసం రుణమాఫీలు, గెలిచాక హామీలు దాటేయటాన్ని పాలకులు అలవాటుగా చేసుకుంటున్న కాలంలో ఆయన పథకాలు ప్రజలు ఏనాటికీ మర్చిపోని జ్ఞాపకా లు. ఈ గడ్డమీది రైతులకు సాగునీరందిస్తే జన్మ సార్థకమవుతుందంటూ తాను పదే పదే చేసిన ప్రకటనను జనం నేటికీ మర్చిపోవడంలేదు. ప్రజల కోసం ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా, అవమానాలైనా దిగమింగి తన లక్ష్యం సాధించేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి అనుసరించిన విధానాలు నేటికీ ప్రజలకు గుర్తుకొస్తున్నాయి.
సంక్షేమానికి చిరునామా..
సంక్షేమ పథకాల అమలులో దక్షిణ భారత దేశంలోనే ఆయన సరిజోడులు అన్నాదురై, ఎన్టీఆర్ మాత్రమే. 1960లలో తమిళనాడు శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోలో రూపాయికు ఒకటిన్నర కేజీల బియ్యం పథకాన్ని డీఎంకే పార్టీ అధినేత అన్నాదురై ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఆ పథకాన్ని చేపట్టి, విజయవంతంగా కొనసాగించారు. 1982లో ఆంధ్రప్రదేశ్‌లో, తెలుగుదేశం పార్టీని స్థాపించిన దివగంత ఎన్టీఆర్, ఎన్నికల ప్రచారంలో, రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని అమలు పరుస్తామని చెప్పారు. గెలిచాక ఎన్ని ఆర్థిక అవాంతరాలు వచ్చినా ఆ పథకాన్ని ఆయన దిగ్విజయంగా అమలు పరిచారు. ఆ తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 ఎన్నికల్లో ఉచిత విద్యుత్ ఇస్తాననీ, విద్యుత్ బకాయిలను దాదాపు రూ.12 వందల కోట్ల మేరకు మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. గెలిచాక తన మొదటి సంతకం ద్వారా ఆయన ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు.
ఆ తర్వాత కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను వైఎస్ ప్రవేశపెట్టారు. ఆయన ప్రవేశపెట్టి, అమలు పరిచిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నేడు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆ పథకాలను ఆయన అమలు పరచటానికి మునుపు ఆ తర్వాత కూడా ప్రపంచ బ్యాంకు సరళీకృత ఆర్థిక విధానాల, ప్రైవేటీకరణ విధానాల నేపథ్యంలో ప్రభుత్వం క్రమంగా తన ఉనికిని పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. దేశీయ కార్పొరేట్ రంగం ప్రభుత్వ ఆర్థిక విధానాలను ప్రభావితం చేసే దశ కూడా వైఎస్‌కు మునుపు మనకు స్పష్టంగా కనిపించేది.
వ్యవసాయం పండుగ
వ్యవసాయ రంగమే కాదు. సాగునీటి రంగం కూడా తీవ్ర నిర్లక్ష్యానికి గురయిన కాలమది. ఈ నేపథ్యంలో వైఎస్ ప్రజలపట్ల తనకున్న అనురక్తిని కోల్పోకుండా వారి అభివృద్ధి కోసం తన సొంత పార్టీలోని అధిష్టానాన్ని ఒప్పించారు. మరోవైపున స్థానిక నాయకులు, సంప్రదాయ ఆలోచనా విధానాలను నమ్మే ఆర్థిక రంగ పండితుల పలుకుబడి నుండి బయటపడి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ‘వ్యవసాయం పండుగ’ అనే వైఎస్ నినాదం, చంద్రబాబు గారి ‘వ్యవసాయం దండుగ’అనే ప్రచారానికి ప్రత్యామ్నాయంగా నిలిచి రైతాంగంలో కొత్త ఆశలు రేపింది.
భగీరథ యత్నం
రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదుల్లోని నీటిని నిల్వ చేసి క్రమబద్ధీకరించి గ్రామీణప్రాంతాల పురోభివృద్ధికై తెలుగునాట 83 సేద్యపు నీటి ప్రాజెక్టుల ద్వారా జలయజ్ఞం పథకాన్ని ప్రారంభించారు. జలయజ్ఞంపై ఎల్లో మీడియా అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ దుమారం సృష్టించాలని ప్రయత్నించింది. ప్రతి ప్రాజెక్టు దగ్గర బహిరంగ చర్చలు నిర్వహించి ఆ ప్రచారంలోని డొల్లతనాన్ని వైఎస్ ఆనాడు ఎండగట్టారు. నేటికి కూడా వైఎస్ వ్యతిరేకులు ప్రత్యేకించి చంద్రబాబు, రామోజీ బృందం అదే అవినీతి ఆరోపణలు కొనసాగిస్తున్నారు. జలయజ్ఞం పథకాన్ని కాంట్రాక్టర్లకు దోచిపెట్టే పథకంగా చంద్రబాబు చెబుతున్నారు. ఈ పథకాలన్నీ తెలుగుదేశం హయాంలో ఎన్టీఆర్, చంద్రబాబు శంకుస్థాపనలు చేసినవే. హంద్రీనీవా కావచ్చు.. తెలంగాణకు నెట్టెంపాడు కావచ్చు,. అవి ఎత్తిపోతల పథకాలే. వైఎస్ వాటిని అమలు పరిచారు.
ఆ పథకాల ద్వారా తెలంగాణకు, రాయలసీమకు కృష్ణా జలాలు తరలిరావడాన్ని చంద్రబాబు ఏమని సమాధానం చెబుతారు? నేడు వంద కోట్లు హంద్రీనీవాకు కేటాయించడంలో బాబు ప్రాధాన్యతలు ఏమిటో స్పష్టంగా మనకు అర్థమవుతోంది. తన పాలనలో ఏలేరు కుంభకోణం, పీఏబీఆర్, వేమన, చిత్రావతి, రిజర్వాయర్ ప్రాజెక్టుల్లో తెలుగుగంగ వెలుగోడు రిజర్వాయర్ హౌక్ రిజర్వాయర్ల నిర్మాణాల్లో ఆయన పాలనలో జరిగిన అవినీ తి గురించి ఏం మాట్లాడతారు...? జలయజ్ఞంపై విమర్శలు చేయడం చంద్రబాబు సేద్యపు నీటి రంగం పట్ల అతనికి వున్న ఆజ్ఞానాన్ని ప్రదర్శించడం కాకపోతే మరేమిటీ..?
పవిత్ర జలయజ్ఞం
జలయజ్ఞంతోపాటు ఏ ప్రాజెక్టులూ ఆగ మేఘాల మీద చేపట్టినవి కాదు. శ్రీశైలం, నాగార్జున సాగర్, కృష్ణా, గోదావరి బ్యారేజీలు, పోచంపాడు ప్రాజెక్టు వంటి అనేక ప్రాజెక్టులు సంవత్సరాల పాటు నిర్మాణంలో కొనసాగినవే. ప్రాజెక్టులపై పెట్టుబడి తక్షణ ఫలితాలు ఇవ్వాలని కోరుకోవడమే అజ్ఞానం. వైఎస్ జలయజ్ఞం పథకం కృష్ణా, గోదావరి బ్యారేజీల్లాగ శ్రీశైలం, నాగార్జునసాగర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లాగ కలకాలం నిలిచిఉంటుంది. అంతేకాని అది ఇంకుడు గుంతలు, వాటర్‌షెడ్ పథకాల వంటిది కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే అది పురాతన కాలంలో అశ్వమేధ యాగం, రాజసూయ యాగం లాంటి పవిత్రమైన పథకం.
వైఎస్ తాను చేసిన ఎన్నికల వాగ్దానాలు కాకుండా ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పావలా వడ్డీ, ఉచిత వివాహాలు, ఇందిరమ్మ ఇళ్లు, లాంటివి ఎన్నో కొత్త పథకాలు అమలు పరిచారు.
నేడు వైఎస్‌ను రేయింబవళ్లు ఆడిపోసుకుంటున్న చంద్రబాబు తాను చేసిన రూ. లక్ష రెండు వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ గురించి ఏమి చెబుతారు? అన్ని రకాల రైతన్నల అప్పులు, డ్వాక్రా మహిళా రుణాలు అప్పులు, చేనేత రుణాలు రద్దు చేస్తానని మరెన్నో ఉచిత హామీలు ఇచ్చిన చంద్రబాబుకు వైఎస్‌ను విమర్శించే అర్హత ఉందా..? జగన్ మోహన్‌రెడ్డి, చంద్రబాబు రుణమాఫీ గురించి అసెంబ్లీలో చర్చను లేవనెత్తుతారని తను ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విమర్శలు సంధిస్తారని తెలిసి అసెంబ్లీ మోహం చాటేయడం కన్నా, పలాయనవాదం కన్నా మరికొటి ఏదైనా ఉందా..? వైఎస్ జగన్ చేస్తున్న విమర్శలకు ఆరోగ్యకరమైన రీతిలో అసెంబ్లీలో సమాధానాలు ఇచ్చేధైర్యాన్ని బాబు ప్రదర్శించలేకపోతున్నారు.
ఆ లోటు తీరేదెన్నడు?
నేడు దేశంలో స్పష్టంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు పెట్టుబడిదారీ వర్గాలకు బహటంగా తమ తలుపులు తెరవడం మనం గమనిస్తున్నాము. కార్పొరేట్‌రంగాలకు ఎర్రతీవాచీ పరచడం మనం చూస్తున్నాము. వ్యవసాయాన్ని, పారిశ్రామిక రంగాన్ని చివరకు రక్షణ రంగంలో సైతం విదేశీ పెట్టుబడులకు ఎర్రతీవాచీ పరచడం ఎంత వరకు స్వదేశీయ పాలనకు నిదర్శనంగా ఉండగలదో.. ప్రజలు తీవ్రంగా ఆలోచించాలి. విద్యా రంగంలో ప్రైవేటీకరణకు శరవేగంతో పథకాలు రూపొందించబడుతున్నాయి. రైతులకు వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి, సాగునీటి రంగానికి ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ రంగాన్ని బలహీన పరిచి కార్పొరేట్ సంస్థలకు జాతి వనరులను తాకట్టుపెట్టే ఆందోళనకర పరిస్థితి మనం చూస్తున్నాము.
అంతా విదేశీ పెట్టుబడులు, విదేశీ విధానాల పలుకుబడి మన పాలనా రంగంలో ప్రభుత్వంలో జోక్యం ద్వారా జరుగుతూ ఉంటే ఇక మనది అనే పాలనకు ప్రత్యేకించి భారతీయ ప్రజాస్వామ్యానికి అర్థం ఏమి ఉంది? నిజంగా జాతిని, ఈ రాష్ట్రాన్ని కలవరపరుస్తున్న పరిస్థితులు ఇవే. ఇటువంటి పాలనను, విధానాలను తనదైన శైలిలో వ్యతిరేకించి, ప్రభు త్వ రంగ సంస్థలన్నీ బలోపేతం చేసి వైఎస్ చేసిన పాలన ఈ రోజు జాతికి అవసరం. వ్యవసాయం సేద్యపు నీటి రంగం, విద్యుత్ రంగం, విద్యా రంగం, శాస్త్ర, సాంకేతిక రంగాలు, పరిశ్రమలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో నూతన స్థాయికి తీసుకెళ్లిన ఖ్యాతి వైఎస్‌దే..!
వైఎస్‌కు ఆయన ఆచరణకు, ఆలోచనలకు మరణం లేదు. నేడు సంక్షోభ పరిస్థితుల్లో వైఎస్ ఆలోచనలు ప్రజలను వెంటాడుతున్నాయి. వాటిని సజీవంగా నిలపడానికి, ఆయన పథకాల కొనసాగింపునకు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన వైఎస్సార్ పార్టీ కృషి చేస్తోంది. ఆయన రాజకీయాల్ని కొనసాగించే వారసత్వానికి వైఎస్ వర్ధంతి సందర్భంగా జేజేలు...! వైఎస్‌కు జోహారులు.
(వ్యాసకర్త కదలిక ఎడిటర్)