
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ మాటలు తనను తీవ్రంగా బాధపెట్టాయని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. రాజకీయ ఎదుగుదల కోసం ప్రధాని స్థాయిలాంటి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడటం ఏ మాత్రం సమంజసం కాదని, ప్రధాని హుందాతనాన్ని కాపాడుకోవాలని, ఆయన చేసిన వ్యాఖ్యలకు దేశానికి క్షమాపణలు చెప్పాలని ఆయన ఓ లేఖ విడుదల చేశారు. 'రాజకీయంగా లబ్ధి పొందడం కోసం శ్రీ ప్రధాని నరేంద్రమోదీ అన్నమాటలు నన్ను బాధించాయి. గుజరాత్ ఎన్నికల్లో ఓటమి పాలవుతారని ఊహించి ఆయన వీలయినన్ని అబద్ధాలు ఆడుతున్నారు. దుష్ఫ్రచారం చేస్తున్నారు. వదంతులు సృష్టిస్తున్నారు.
పాకిస్థాన్ విదేశాంగ మంత్రితో కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సహా మణిశంకర్ అయ్యర్ ఇంట్లో రహస్య సమావేశం అయ్యారని మోదీ ఆరోపించారు. దాదాపు మూడుగంటలపాటు జరిగిన రహస్య సమావేశంలో మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు హమీద్ అన్సారీతోపాటు సీనియర్ నేతలు హాజరయ్యారని, మొత్తానికి గుజరాత్ ఎన్నికల్లో పాక్ జోక్యం చేసుకునేందుకు అవకాశం ఇచ్చారని మోదీ అన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా మోదీపై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. భారత ఆర్మీకి చెందిన మాజీ చీఫ్‌తో సహా పలువురు దౌత్యవేత్తలు, గౌరవనీయ మాజీ అధికారుల సమక్షంలో ఈ సమావేశం అధికారికంగానే జరిగిందని, దీనిపై మోదీ బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఈ వరుసలోనే తాజాగా మన్మోహన్ సింగ్ కూడా ఓ లేఖ విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment