
గ్యాంగ్‌టక్: ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేని లేదా అధికార సంకీర్ణంలో లేని రాష్ట్రం సిక్కిం ఒక్కటే. తాజాగా ఆ రాష్ట్రంలోనూ అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా కమలదళం అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే సిక్కిం డెమొక్రాటిక్ ఫ్రంట్(ఎస్‌డీఎఫ్)కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, ఈశాన్య రాష్ట్రాల పార్టీ ఇన్‌చార్జి రాంమాధవ్‌ల సమక్షంలో మంగళవారం వారు బీజేపీలో చేరారు. ప్రస్తుతం సిక్కింలో ఎస్‌కేఎం అధికారంలో ఉంది.
ఇటీవలి ఎన్నికల్లో మొత్తం 32 స్థానాలకు గానూ 17 సీట్లను ఎస్‌కేఎం గెలుచుకుంది. పవన్ కుమార్ చామ్లింగ్ నేతృత్వంలోని సిక్కిం డెమొక్రాటిక్ ఫ్రంట్ 15 సీట్లను గెలుచుకుంది. వారిలో ఇద్దరు రాజీనామా చేయడంతో ఆ పార్టీకి ప్రస్తుతం 13 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. వారిలో 10 మంది ఇప్పుడు బీజేపీలో చేరడంతో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోని బీజేపీకి ఇప్పుడు సిక్కిం లో ప్రధాన ప్రతిపక్ష హోదా లభించనుంది. మూడింట రెండు వంతులకు పైగా ఎమ్మెల్యేలు బీజేపీలో చేరినందున ఫిరాయింపుల నిరోధక చట్టం వారికి వర్తించదు. రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని రాంమాధవ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment