05–03–2018, సోమవారం
తక్కెళ్లపాడు, ప్రకాశం జిల్లా
అటువంటి కడగండ్లే గ్రామ సచివాలయ వ్యవస్థకు నాలో బీజం వేశాయి
భోజన విరామ సమయంలో ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన మూగ, చెవుడు, అనాథ పిల్లలు కలిశారు. వారి ముద్దుముద్దు ముఖాలు, సంజ్ఞలతో వారు చూపించిన ప్రేమాభిమానాలు మనస్సుకు హత్తుకుపోయాయి. వారి హావభావాలు నన్ను కట్టిపడేశాయి. ఓ ఆరేళ్ల చిన్నారి తన కన్నీటి గాథను సైగలతోనే నా ముందుంచింది. తాను ఈ పరిస్థితిలో ఉన్నా కనీసం పింఛన్ కూడా రావడం లేదట. ఆదుకునే మనసుంటే.. తమకున్న లోపం శాపం కాదంటూ గుండె నిబ్బరాన్ని ప్రదర్శించింది. మరో పదేళ్ల చిన్నారి ముకుళిత హస్తాలతో చేసిన ప్రార్థన నన్నెంతో ఆకట్టుకుంది. ఆ చిన్నారి, ఆమె సోదరి కూడా అనాథలేనని తెలియడంతో నా గుండె బాధతో బరువెక్కింది.
ఆ సంస్థలో చాలామంది మూగ, చెవుడు, మానసిక దివ్యాంగులున్నారట. నా వద్దకొచ్చిన వారిలోనే ఆరేడు మంది పిల్లలు మూగ, చెవిటివారున్నారు. వారికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ ఎందుకు చేయించలేకపోయారని నిర్వాహకులను అడిగాను. తమ సంస్థకు అంత ఆర్థిక స్థోమత లేదని, ఆరు, ఏడు లక్షల రూపాయలు ఖర్చయ్యే ఆ ఆపరేషన్‌ను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేయించడం లేదని వాపోయారు. చికిత్స ఉండీ.. వైద్యం చేయించుకునే స్థోమత లేక దివ్యాంగులుగా మిగిలిపోయిన ఆ చిన్నారులను చూసి చలించిపోయాను.
ఇలాంటి పిల్లలకు కొత్త జీవితాన్ని ఇవ్వగలిగితే అంతకంటే సార్థకత ఏముంటుంది? అనిపించింది. వారికి ఆపరేషన్‌లు చేయించకపోగా.. వారిలో చాలామందికి కనీసం పింఛన్లు కూడా ఇవ్వడం లేదట. ఒకే కడుపున పుట్టిన ముగ్గురు మూగ, చెవుడు పిల్లలుంటే.. వారిలో ఒక్కరికే పింఛన్ వస్తోందట. వాళ్లకు, వారి సహాయకులకు కనీసం బస్ పాసైనా ఇస్తే బావుంటుందని సంస్థ నిర్వాహకులు అన్నారు. ఇలాంటి వాళ్లకు ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉంటే కొంతైనా ఊరట కలిగేది. నిజంగా మంచి మనసుతో వారిని ఆదుకోవడంలో కలిగే తృప్తి మరిదేంట్లో ఉంటుంది.
కులాంతర వివాహం చేసుకున్న అనూష, నాగరాజు ఈ రోజు నన్ను నాగులపాడులో కలిశారు. వారి ఇద్దరు పిల్లల్లో ఒకరికి గుండె జబ్బు. రేషన్‌కార్డు, ఆధార్ కార్డులు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ వర్తించే అవకాశం లేదన్నారు. వాటికోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని చెప్పారు. ప్రయివేటు ఆస్పత్రికెళితే రూ.రెండు లక్షల వరకూ ఖర్చవుతుందన్నారట. సంవత్సరాల తరబడి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులూ ఇవ్వకపోతే ఎలా? ఏదో ఒక సాకు పెట్టి.. సంక్షేమ పథకాల లబ్ధిదారులను కుదించాలన్నదే ఈ ప్రభుత్వ దురాలోచన. ప్రజలు పడుతున్న ఇటువంటి కడగండ్లే గ్రామ సచివాలయ వ్యవస్థకు నాలో బీజం వేశాయి.
‘ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతుకు ఇదే దుస్థితి అన్నా..’అంటూ వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు మోహన్‌రెడ్డి ఆవేదన వెలిబుచ్చాడు. నాలుగేళ్లుగా సాగర్ నీళ్లు రావడం లేదని, వర్షం జాడే కనిపించడం లేదని తెలిపాడు. గతేడాది ఎకరాకు పది క్వింటాళ్లు పండిన శనగ.. ఈ సంవత్సరం మూడు క్వింటాళ్లు కూడా పండలేదన్నాడు. పోయిన ఏడాది క్వింటాల్ రూ.6 వేలుంటే.. ఈ సంవత్సరం రూ.3,600 కూడా దక్కే పరిస్థితి లేదన్నాడు. ఆఖరికి సబ్సిడీ విత్తనాలను కూడా అధిక రేట్లకు అమ్ముతున్న ఈ పాలనలో వ్యవసాయం చేసేదెలా.. అంటూ ప్రశ్నించాడు.
మరో రైతన్న పొంగులూరు సాంబశివరావుదీ ఇదే పరిస్థితి. ఎనిమిదెకరాల్లో మిర్చి వేశాడట. గతంలో ఎకరాకు దాదాపు 30 క్వింటాళ్ల దాకా దిగుబడి వచ్చేదట. ఇప్పుడు నీళ్లు లేక.. 12 క్వింటాళ్లు కూడా పండటం కష్టమేనన్నాడు. మిర్చి నాణ్యతా తగ్గిపోయిందట. ఖర్చు ఎకరాకు రూ.లక్ష వరకు అవుతోందట. గతంలో క్వింటాల్ రూ.12 వేలు పలికిన ధర.. అమాంతం రూ.5,500 – 6000కు పడిపోయిందని బావురుమన్నాడు. పెట్టుబడులే కాదు.. కనీసం కూలీల ఖర్చు కూడా వచ్చేలా లేదని దిగాలుగా చెప్పాడు. ఇది నిజంగా దయనీయ పరిస్థితే. అన్నదాతే ఇలా కన్నీళ్లు పెడితే రాష్ట్రంలో సుఖశాంతులుంటాయా? ఈ పరిస్థితులు మార్చాలన్నదే నా తపన. అందుకే పెట్టుబడుల ఖర్చు తగ్గించడంతో పాటు.. గిట్టుబాటు ధర కల్పించాలన్నదే నా లక్ష్యం.
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. గత నాలుగేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ ఎడమ కాలువకు పుష్కలంగా నీరు పారించుకుని మాగాణి పంటలు పండించుకుంటుంటే.. మన రాష్ట్రంలో మాత్రం నీటి కేటాయింపులున్నా.. కుడి కాలువ కింద నీళ్లు రాక, రైతన్న పంటలు వేసుకోలేక కష్టాలపాలవ్వడానికి కారణమేంటి? మీ స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే దానికి కారణం కాదా?
Comments
Please login to add a commentAdd a comment