14–04–2018, శనివారం
చనమోలు వెంకట్రావు ఫ్లైఓవర్, కృష్ణా జిల్లా
అంబేడ్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న మీకు నివాళులర్పించే అర్హత ఎక్కడిది?
సమాజంలోని అంతరాలు తొలగిపోయి కుల వివక్ష నిర్మూలన కావాలంటే.. సాంఘిక సంస్కరణలు, బలమైన రాజ్యాంగ రక్షణ, దళితుల, పేదల అభ్యున్నతికి త్రికరణ శుద్ధితో కృషి చేసే పాలకులు అవసరమని విశ్వసించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌గారి జయంతి సందర్భంగా నివాళులర్పించి పాదయాత్ర ప్రారంభించాను. దురదృష్టవశాత్తు ఇప్పుడు మన రాష్ట్రంలో ఆ మహనీయుని స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా పాలన సాగుతోంది.
రాష్ట్ర చరిత్రలో దళితుల మీద దాడులు, దౌర్జన్యాలు అత్యధికంగా ఉన్న పాలన ఎవరిదంటే.. కళ్లు మూసుకుని చంద్రబాబు పాలన అని చెప్పే పరిస్థితి. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా.. అన్న మాటల్లోనే ఆ వర్గాల పట్ల ఆయన గుండెల్లో గూడుకట్టుకున్న ఏహ్యభావం బహిర్గతమైంది. తన మంత్రివర్గ సహచరుడే దళితుల పట్ల అత్యంత అవమానకరంగా మాట్లాడినా.. మిన్నకుండిపోయినప్పుడే ఆయన దృక్పథం తేటతెల్లమైంది.
తన సొంత పార్టీ నేతలే దళిత మహిళల్ని వివస్త్రల్ని చేసి, దాడులు చేస్తున్నా దృతరాష్టుడ్రిలా కళ్లు మూసుకుని, నిందితులకు కొమ్ముకాసినపుడే ఆయన నైజం స్పష్టమైంది. దళితుల భూముల్ని వారికి ఇష్టమున్నా, లేకున్నా అత్తగారి సొత్తులా లాక్కోవడమేకాక, పరిహారం కూడా మిగిలినవారికన్నా తక్కువగా ఇచ్చినప్పుడే.. ఆయన చిత్తశుద్ధి ఏపాటితో తెలిసిపోయింది.
గుంటూరు జిల్లా పాదయాత్రలో తెలుగుదేశం నాయకుల అరాచకాలపై దళితులు ఫిర్యాదుచేయని రోజే లేదంటే అతిశయోక్తి కాదు. ఈ రోజుతో గుంటూరు జిల్లాలో యాత్ర ముగిసింది. ఒక్కసారి ఆ జిల్లాలో పాదయాత్ర స్మృతులు మదిలో మెదిలాయి. పక్కనే కృష్ణమ్మ పరుగులిడుతున్నా.. తాగునీరందక, గిట్టుబాటు ధరల్లేక తెలుగుదేశం దళారీల దోపిడీ దెబ్బకు విలవిల్లాడుతున్న పత్తి, మిర్చి, మొక్కజొన్న, పసుపు, కంది తదితర రైతన్నల కన్నీటి కథలు మరిచిపోలేని చేదు వాస్తవాలు.
ఇసుక, మట్టి మాఫియా తరహా దోపిడీలు, పత్తి కొనుగోళ్లలో సీసీఐ కుంభకోణాలు, రేషన్ బియ్యం అక్రమాలు, నీరు–చెట్టు, రాజధాని నిర్మాణం తదితర భారీ స్కాములు మదిలో మెదిలాయి. వక్ఫ్ బోర్డులు, చర్చిల ఆస్తులు, దేవాలయాల మాన్యాలు, దళితుల భూములు, సదావర్తి భూములు.. ఆఖరికి నదులను సైతం ఆక్రమించుకుని దోచుకున్న వైనాలు గుర్తుకొచ్చి మనసు కలతచెందింది.
నన్ను స్వాగతించడానికి విచ్చేసిన విజయవాడ ప్రజలు వేలాదిగా వెన్నంటి రాగా జన సందోహం మధ్య కనకదుర్గమ్మ వారధిపై పాదయాత్ర సాగింది. వారధిపై నడుస్తుండగా చంద్రబాబు సర్కారు అక్రమ సంపాదన కక్కుర్తికి 23 మంది ప్రాణాలు బలైన బోటు విషాదం మదిలో మెదిలింది. ప్రమాదం వెనుక ఉన్న అసలు పెద్దలను వదిలేసి సామాన్యులను బలిచేసిన విషయం గుర్తొచ్చింది.
ఎదురుగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ గుడిని చూడగానే.. బాబుగారు అధికారంలో ఉన్న ప్రతిసారీ అమ్మవారి గుడిలో జరుగుతున్న అపచారాలు గుర్తుకొచ్చాయి. గతంలో బాబుగారి హయాంలో.. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే అమ్మవారి కిరీటం దొంగతనానికి గురైన ఘటన, మొన్నటికి మొన్న తాంత్రిక పూజలు జరిగిన విషయాలు మదిలో మెదిలాయి. ప్రజల మీద ప్రేమ, దేవునిపై విశ్వాసం, పాపభీతి లేని ఈ కఠినాత్ముని పాలనలో ప్రజలకు సుఖసంతోషాలు ఆశించగలమా? కాగా కోట్లాది రూపాయలు స్వాహా చేస్తూ.. సంతోష నగరాలంటూ సదస్సులు నిర్వహించడం వంచనకాక మరేంటి?
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. దళితులపై జరుగుతున్న అరాచకాలకు బాహాటంగా కొమ్ముకాస్తున్న మీరు.. ఎన్నికలకు సంవత్సరం ముందుగా దళిత తేజం పేరుతో కార్యక్రమాలు నిర్వహించడం కపట ప్రేమ కాదా? అనునిత్యం రాజ్యాంగ స్ఫూర్తికి, అంబేడ్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న మీకు ఆ మహనీయునికి నివాళులర్పించే అర్హత ఎక్కడిది?
Comments
Please login to add a commentAdd a comment