
ఉదయ్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన పశ్చిమ ఢిల్లీ అభ్యర్థి బల్బీర్ సింగ్ జాఖడ్ కొడుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రూ.6కోట్లు చెల్లించినట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ టికెట్ కోసం తన తండ్రి ఈ నగదును కేజ్రీవాల్‌కు ఇచ్చినట్లు బల్బీర్ కొడుకు ఉదయ్ చెప్పారు. అయితే విలేకరుల సమావేశంలో ఈ ఆరోపణలను బల్బీర్ ఖండించారు. ఉదయ్ తనతోపాటు ఎప్పుడూ కలిసి ఉండలేదని, తన భార్యతో విడాకుల అనంతరం ఉదయ్ తన తల్లి తరఫు బంధువులతో కలిసి ఉంటున్నాడని తెలిపారు. ఉదయ్ ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని బల్బీర్‌సింగ్ వ్యాఖ్యానించారు.
అయితే బల్బీర్ విలేకరుల సమావేశం ప్రారంభించే సమయంలోనే ముగ్గురు పోలీసులు ఆప్ కార్యాలయంలోకి ప్రవేశించి సమావేశాన్ని అడ్డుకున్నారు. ఆప్ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పోలీసులు విలేకరుల సమావేశాన్ని వీడియో తీయడానికి ప్రయత్నించడంతో ఆప్ కార్యకర్తలు పోలీసులను లోనికి రానివ్వకుండా తలుపులు వేసి సమావేశం నిర్వహించారు. అయితే పోలీసులు మాత్రం ఎన్నికల నియమావళి అమల్లో ఉందని, పోలింగ్‌కు ముందు 48 గంటలపాటు ఎటువంటి సమావేశాలు నిర్వహించరాదని, కాబట్టే సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశామని వివరించారు. ఆప్ చర్యను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment