
న్యూఢిల్లీ: బీజేపీ తనను చంపాలను కుంటోందని, మాజీ ప్రధాని ఇందిరాగాంధీని చంపినట్లే వ్యక్తిగత రక్షణ సిబ్బందే తనను హత్య చేయవచ్చని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అత్యున్నత జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న కేజ్రీవాల్ శనివారం పంజాబ్ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో..‘బీజేపీ నన్ను చంపాలనుకుం టోంది. ఇందిరా గాంధీని చంపినట్లే ఏదో ఒక రోజు వ్యక్తిగత రక్షణ అధికారితో బీజేపీ నన్ను హత్య చేయిస్తుంది. నా వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా బీజేపీకే అనుకూలంగా ఉన్నారు’ అని ఆరోపించారు. కేజ్రీవాల్ ఆరోపణలను ఢిల్లీ పోలీసు విభాగం ఖండించింది.
దేశ రాజధానిలో ఉండే సీఎం కేజ్రీవాల్ సహా అన్ని రాజకీయ పార్టీల నేతల భద్రతను తమ అధికారులు చూసుకుంటున్నారని, వీరంతా సమర్థులు, విధుల పట్ల అంకిత భావం ఉన్నవారేనని పేర్కొంది. వ్యక్తిగత భద్రత వంటి సీరియస్ అంశాలను సైతం ప్రజల మెప్పు పొందేందుకు వాడుకోవడం దిగజారుడుతనమని బీజేపీ మండిపడింది. వ్యక్తిగత భద్రతా అధికారిపై అనుమానం ఉంటే వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదంది. అనంతరం కేజ్రీవాల్ ట్విట్టర్‌లో..ఏం తప్పు చేశానని బీజేపీ నన్ను చంపాలనుకుంటోంది? తుది శ్వాస వరకు దేశం కోసం పనిచేస్తూనే ఉంటా’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment