తిరువనంతపురం : చంద్రుడిపై హోటల్ రూం బుక్ చేస్తే తాను తప్పక అక్కడికి వెళ్తానంటూ మలయాళ దర్శకుడు అదూర్ గోపాలకృష్ణన్ బీజేపీ అధికార ప్రతినిధి గోపాలకృష్ణన్‌కు కౌంటర్ ఇచ్చారు. దేశంలో ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీలపై మతం ఆధారంగా జరుగుతున్న మూకహత్యలు, హింసాత్మక ఘటనలపై సినీ ఇండస్ట్రీతో పాటు వివిధ రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జై శ్రీరాం నినాదం పేరిట దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వీరిలో అదూర్ గోపాలకృష్ణన్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో లేఖ విషయంపై స్పందించిన బీజేపీ నేత బి.గోపాలకృష్ణన్... జై శ్రీరాం అనే పదం వినపడకూడదని భావిస్తే చంద్రుడిపైకి వెళ్లి జీవించాలంటూ అదూర్ గోపాలకృష్ణన్‌కు సూచించారు. వెంటనే శ్రీహరికోటకు వెళ్లి చంద్రయాత్రకు తన పేరు నమోదు చేసుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు.
ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలపై స్పందించిన అదూర్ గోపాలకృష్ణన్...‘ బీజేపీ వాళ్లు ఇచ్చిన ఆఫర్ నాకు బాగా నచ్చింది. ప్రపంచం మొత్తం చుట్టివచ్చాను. చంద్రుడిపైకి వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్నాను. నాకోసం ఒక టికెట్ బుక్ చేయండి. అదే చేత్తో హోటల్ రూం కూడా’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా మూకహత్యలపై ప్రధానికి ప్రముఖులు రాసిన లేఖపై కంగనా రనౌత్, ప్రసూన్ జోషి తదితర 62 మంది సినీ ప్రముఖులు ఘాటుగా స్పందించారు. రాజకీయ దురుద్దేశంతోనే వారు లేఖ రాశారంటూ విమర్శించారు. ఈ మేరకు వాళ్లు కూడా ఓ లేఖ విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment