సాక్షి, విజయవాడ/గుడివాడ: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు సొంత నియోజకవర్గమైన గుడివాడలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) జిల్లాలో తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందారు. గుడివాడ రాజకీయంలో ఆయన ఒక సంచలనం. ఏళ్ల తరబడి తమదైన శైలిలో జిల్లా రాజకీయాలు నడిపిన ఎన్నో కుటుంబాలను తెరమరుగు చేసిన చరిత్ర కొడాలి నానిది.
నెరవేరిన గుడివాడ ప్రజల కల
గుడివాడ ప్రజల కల నెరవేరింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి వర్గంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)కి చోటు దక్కటంతో ప్రజల సంబ రాలు చేసుకుంటున్నారు. గుడివాడ నియోజకవర్గం ఏర్పడ్డాక 25 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కఠారి ఈశ్వర్‌కుమార్ మంత్రిగా పని చేయగా అనంతర కాలంలో గుడివాడ నుంచి మంత్రిగా పనిచేసిన వారు లేరు.
తెలుగు యువత జిల్లా అధ్యక్షుడుగా రాజకీయ అరంగేట్రం..
తెలుగుదేశం పార్టీలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా కొడాలి నాని రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. మొదట్లో ట్రాన్స్‌పోర్టు నిర్వాహకుడిగా ఉంటూ రాజకీయాల్లో తనదైన శైలిలో రాణించారు. అప్పటికే తెలుగుదేశం పార్టీలో గుడివాడకు రావి కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయి. అటువంటి తరుణంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున 2004లో అనూహ్యంగా టిక్కెట్టు దక్కించుకోవటమే కాకుండా ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో గుడివాడలో రావి కుటుంబానికి స్థానం లేకుండా చేశారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం సాధించారు. అనంతరం 2013లో వైఎస్సార్ సీపీలోకి వచ్చారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు వైఎస్సార్‌సీపీ తరపున గెలుపొందారు. గుడివాడ నియోజక వర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు తిరుగులేని నేతగా కొడాలి నాని సత్తాను చాటుకున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున 19,749 ఓట్లు మెజార్టీతో నాలుగవ సారి విజయం సాధించారు. గుడివాడ నియోజకవర్గ ప్రజల్లో తనపై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. తెలుగుదేశం పార్టీ కొడాలి నానిని ఓడించేందుకు ఎన్ని కుట్రలు చేసినా ఆయన విజయాన్ని ఆపలేక పోయింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు వచ్చిన సమయంలో గుడివాడలో కొడాలి నానిని గెలిపిస్తే మంత్రిగా చేస్తానని మాట ఇచ్చారని ఆమాటను నేడు నిలబెట్టుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికార పక్షంతో పాటు మంత్రి పదవి రావడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని అంటున్నారు. కొడాలి నాని శనివారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ఆయన మాట్లాడుతూ...వైఎస్ జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వొమ్ము చేయనని అన్నారున.
Comments
Please login to add a commentAdd a comment