
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ముగిసినా... టీడీపీ, జనసేనకు చెందిన పలువురు నేతలు కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్కసీటు మాత్రమే సంపాదించుకున్న జనసేన పార్టీకి మరో షాక్ తగలనుంది. ఓటమిపై నేతలు అధైర్యపడవద్దంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినా అవేమీ వారిలో ధైర్యాన్ని నింపడం లేదు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత ఆకుల సత్యనారాయణ...జనసేనకు గుడ్‌బై చెప్పనున్నారు.
తిరిగి ఆయన సొంతగూటికి (బీజేపీ)కి చేరుకోనున్నారు. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి జనసేన తరఫున ఎంపీగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. అంతకు ముందు రావెల కిషోర్ బాబు కూడా జనసేనకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరోవైపు టీడీపీ నుంచి కూడా పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు కూడా ధ్రువీకరిస్తున్నారు. పలువురు టీడీపీ నేతలు తమతో టచ్‌లో ఉన్నారని, వారంతా త్వరలోనే బీజేపీలో చేరతారంటూ చెబుతున్నారు.