సాక్షి, బెంగళూరు: ప్రస్తుత రాజకీయ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ముంబైలో క్యాంప్ వేసిన నేతలను బుజ్జగించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇందులో భాగంగా కుమారస్వామి కేబినెట్‌లోని మంత్రులందరూ రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం జీ పరమేశ్వర సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన 22మంది, జేడీఎస్‌కు చెందిన 10 మంది తమ మంత్రి పదవులను త్యజిచేందుకు సిద్ధపడ్డారు. ఈ మేరకు సీఎం కుమారస్వామికి రాజీనామా లేఖలు అందించారు. దీంతో మంత్రిమండలిని సమూలంగా ప్రక్షాళన చేసి.. రెబెల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కేటాయించే అవకాశముంది. మంత్రి పదవులు ఆశజూపి.. రాజీనామా చేసిన 13 మంది రెబెల్ ఎమ్మెల్యేలను బుజ్జగించాలని కాంగ్రెస్-జేడీఎస్ పెద్దలు భావిస్తున్నారు.
డిప్యూటీ సీఎం జీ పరమేశ్వర నివాసంలో ఉదయం కాంగ్రెస్-జేడీఎస్ మంత్రులు, కీలక నేతలు అల్పాహార విందు భేటీలో పాల్గొన్నారు. సీఎం కుమారస్వామి కూడా ఈ భేటీకి హాజరయ్యారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే మంత్రి పదవులు త్యాగం చేయాలని ఈ సమావేశంలో పలువురు మంత్రులు ప్రతిపాదించారు. తాము మంత్రి పదవులను వీడి.. వాటిని అసంతృప్తులకు కట్టబెడితే.. వారు సమ్మతించే అవకాశముందని, దీంతో సంకీర్ణ ప్రభుత్వం నిలబడుతుందని ఈ సమావేశంలో నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాజీనామా లేఖల్ని సీఎం కుమారస్వామికి మంత్రులు అప్పగించారు. ఈ క్రమంలో ముంబైలో క్యాంప్ వేసిన రెబెల్ ఎమ్మెల్యేలను రప్పించేందుకు సంకీర్ణ కూటమి పెద్దలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. త్వరలో చేపట్టబోయే కేబినెట్ విస్తరణలో మంత్రి పదవులు ఇస్తామని అసంతృప్త ఎమ్మెల్యేలకు వర్తమానం పంపినట్టు తెలుస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు సంకీర్ణ కూటమి ప్రయత్నిస్తున్నా.. మరోవైపు వరుసగా ఎమ్మెల్యేలు జారిపోతూనే ఉన్నారు. తాజాగా స్వతంత్ర ఎమ్మెల్యే సంకీర్ణ కూటమికి షాక్ ఇస్తూ.. మంత్రి పదవికి రాజీనామా చేసి..మద్దతు ఉపసంహరించుకున్నారు. అనంతరం నేరుగా ముంబై ఫ్లయిట్ ఎక్కారు. ఆయన కూడా రెబెల్ ఎమ్మెల్యేల క్యాంపులో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్-జేడీఎస్ చేపట్టిన బుజ్జగింపు ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.
కర్ణాటక సంక్షోభంపై తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి: కుమారస్వామీ.. రాజీనామా చేయ్..!
Comments
Please login to add a commentAdd a comment