సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలను రెచ్చగొట్టి, ప్రాంతీయ విభేదాలు సృష్టించేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని ధ్వజమెత్తారు. ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ.. ఒక ప్రాంతానికి నష్టం కలిగించేలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. ఉత్తరాంధ్ర ప్రజల వ్యతిరేకత మధ్య చంద్రబాబు విశాఖలో పర్యటించడం సరైంది కాదన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు శాంతి కాముకులని అన్నారు. అంబటి రాంబాబు గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి.. బాబు కుళ్లు బుద్ధికి మధ్యనే ఇవాళ పోరాటం జరుగుతోందని పేర్కొన్నారు. ఇది వైఎస్సార్‌సీపీ, టీడీపీల మధ్య జరుగుతున్న పోరాటం కాదని స్పష్టం చేశారు. బాబు ఇంత చేసినా విశాఖ ప్రజలు హుందాగానే వ్యవహరించారన్నారు.
విశాఖ ప్రజలే బాబును వెనక్కి పంపారు
‘‘తమ ప్రాంతంలో పర్యటించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని ఉత్తరాంధ్ర ప్రజలు నినదించారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని ఆయన అంటున్నారు. కానీ, రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానులు అన్న ఆలోచన చేశారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర వెళ్లి ప్రజలను ఏ విధంగా చైతన్యవంతం చేస్తారు? ఉత్తరాంధ్ర రాజధానిగా పనికి రాదని చెప్పదలుచుకున్నారా? ఉత్తరాంధ్రలో బాబు ఉన్మాద చర్యలకు పాల్పడ్డారు. 5 వేల మంది రాయలసీమ నుంచి వచ్చారని టీడీపీ నేతలు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. పులివెందుల నుంచి ఒక్కరు కూడా విశాఖకు రాలేదు. విశాఖ ప్రజలే బాబును వెనక్కి తిప్పి పంపారు’’ అని ఉద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment