
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల భయంతోనే కేంద్రం జీఎస్టీకి సవరణలు చేసిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, ‘గత కొద్ది నెలల్లో జీఎస్టీ రేట్లు మార్చడం ఇది మూడోసారి. ఈ రకంగా తగ్గించడం, మార్పులు చేయడం ద్వారా ప్రభుత్వం సరైన రీతిలో హోంవర్క్ చేయడంలేదని అర్థమవుతోంది’ అని అన్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. సీఎంగా కేసీఆర్ బాధ్యతాయుతంగా మాట్లాడాలని సురవరం సలహా ఇచ్చారు.‘నిజాం నవాబు నీచమైన పాలన చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వేలాది మంది కమ్యూనిస్టులను, ఇతర కార్యకర్తలను హత్య చేశారు. వీటన్నింటినీ పక్కనపెట్టి నిజాం నవాబును పొగడడం కేసీఆర్‌కు తగదు’అని సురవరం అన్నారు.