సాక్షి : అమేథీలో మూడు తరాలుగా గాంధీ కుటుంబం చేసింది ఏమీ లేదని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నాడు. మంగళవారం అమేథీలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఏకీపడేశారు.
’మాట్లాడితే మోదీ ప్రభుత్వంపై రాహుల్ బాబా విరుచుకుపడుతున్నాడు. నువ్వు ఇక్కడ ఎంపీగా ఉన్నావ్. కానీ, ఇప్పటిదాకా కలెక్టర్ కార్యాలయం, ఆకాశవాణి కేంద్రం కూడా లేవు. అంటే నువ్వు నీ నియోజక వర్గం గురించి ఎంత ఆలోచిస్తున్నావో అర్థమౌతోంది. గుజరాత్‌లో పర్యటించటం కాదు. ముందు అమేథీని పట్టించుకో. అమేథీలో ఉన్న ఐదు నియోజకవర్గాల్లో నాలిగింటిని బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడ రెండు మోడల్‌లు పని చేశాయి. ఒకటి నెహ్రూ-గాంధీ మోడల్, రెండోది మోదీ మోడల్. ప్రజలు రెండోదానిపైనే నమ్మకంతో ఉన్నారు. యోగి జీ-మోదీ జీలు(ఆదిత్యానాథ్-నరేంద్ర మోదీలను) ఉద్దేశించి కలిస్తే యూపీ అభివృద్ధి సులభతరం అవుతుంది అని షా ప్రసంగించారు.
ఈ మూడేళ్లలో మోదీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం 116 పథకాలు ప్రవేశ పెట్టిందని.. రాహుల్‌కు లెక్కలు కూడా రావని ఆయన ఎద్దేవా చేశారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా 2022 నాటికి యూపీ అభివృద్ధి జరిగి తీరుతుందని షా స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌కు దేశమంటే ప్రేమ లేదని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ పేర్కొన్నారు. ఇవాళ ఇక్కడ పలు కార్యక్రమాలకు చేసిన శంకుస్థాపన అభివృద్ధికి సూచనలని ఆయన చెప్పారు. నోబెల్ బహుమతి విజేత రిచర్డ్ థాలెర్ నోట్ల రద్దును స్వాగతించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆదిత్యానాథ్ ప్రస్తావించారు.
ఇక తాను అమేథీ బిడ్డనని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. మూడున్నరేళ్ల క్రితం ఇక్కడి వచ్చిన సమయంలో ఇక్కడి అభివృద్ధి గురించి జనాలు తన దగ్గర వాపోయారని ఆమె చెప్పారు. తమ పిల్లలకుఉద్యోగాలు వస్తాయన్న ఉద్దేశ్యంతో ఎంతో మంది రైతులు తమ భూములు అప్పటి ప్రభుత్వానికి(కాంగ్రెస్) అప్పజెప్పారు. కానీ, వారు దారుణంగా మోసం చేశారు.. భూ కబ్జాలకు పాల్పడ్డారు అని రాహుల్ పై స్మృతి మండిపడ్డారు. యూపీఏ హయాంలో రాష్ట్రం ఏ రకంగానూ అభివృద్ధి చెందలేకపోయిందని ఆమె చెప్పుకొచ్చారు. మొత్తానికి యూపీపై కేంద్ర ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తుందన్న విమర్శలకు 21 అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనతో బీజేపీ చెక్ పెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment