కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2019 సార్వత్రిక ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. సరైన మెజారిటీ రాని పక్షంలో సైద్ధాంతిక వైరుధ్యాలున్న పార్టీలు కూటమిగా ఏర్పడేందుకు సిద్ధమయ్యే అవకాశాలతో.. కమలదళంలో ఒక రకమైన కలవరం మొదలైంది. కర్ణాటక ఫలితాలు, ఎస్పీ–బీఎస్పీల పొత్తు ప్రభావంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరెస్సెస్ ముఖ్య నేతలు బీజేపీ కీలక నేతలతో త్వరలోనే సమావేశం కానున్నారు. సమీప భవిష్యత్తులో జరగనున్న ఎన్నికలపై ప్రత్యేక వ్యూహాలను, ప్రాంతీయ పార్టీల దూకుడుకు అడ్డుకట్ట వేసి బీజేపీ బేస్‌ను పెంచే కార్యాచరణతోపాటుగా జాతీయ విద్యా విధానం, భద్రతాపరమైన అంశాలు, కశ్మీర్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులనూ ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకతపై దృష్టి
మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రభుత్వాలకు ఎదురుగాలి వీస్తున్నట్లు సర్వేలు చెబుతుండటం, అటు కేంద్రంలో మోదీ ప్రభుత్వంపైనా పలు (ఆర్థికాంశాలు, ఇంధన ధరల పెరుగుదల, దళితులతోపాటు మైనార్టీల్లో అసంతృప్తి, మహిళలపై అత్యాచారాలు తదితర) అంశాల్లో కనబడుతున్న వ్యతిరేకత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతీరును సమీక్షించాలని సంఘ్ భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇకపై రాష్ట్రాల్లోనూ బీజేపీ ఎన్నికల వ్యూహాలను నిర్ణయించే భేటీల్లో ఆరెస్సెస్ కీలక పాత్ర పోషించనుంది.
కర్ణాటక ఎన్నికల కోసం స్థానిక స్వయం సేవకులతోపాటు పక్క రాష్ట్రాల నుంచి 50 వేల మంది ఆరెస్సెస్ కార్యకర్తలు రెండు నెలలపాటు శ్రమించారు. దీంతోపాటు, దేశవ్యాప్తంగా బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో మరింత బలోపేతం కావడంపైనా ఆరెస్సెస్ దృష్టిపెట్టింది. ఇప్పటికే ఒడిశా, పశ్చిమబెంగాల్‌లలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపుతున్న బీజేపీ.. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ దూసుకుపోవాలనే ప్రయత్నాల్లో ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు. దీనికితోడు ఈ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటంతో క్షేత్రస్థాయి కార్యాచరణను కూడా ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు.
– సాక్షి నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment