సాక్షి, బెంగళూరు : జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చేపట్టిన ఆపరేషన్ కమల విఫలమైన తరువాత బీజేపీ నాయకుల మధ్య లోలోపల నెలకొన్న వివాదం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో భగ్గుమంది. శుక్రవారం జరిగిన కేంద్ర నాయకుల సమావేశంలో పాల్గొన్న అమిత్ షా సమక్షంలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, జాతీయ సహ సంఘటనా కార్యదర్శి సంతోష్ పరస్పరం వాగ్వివాదానికి దిగారు. సమయం లభించనప్పుడు పదే పదే యడ్యూరప్పకు వ్యతిరేకగా హైకమాండ్ నాయకులకు ఫిర్యాదు చేస్తున్న సంతోష్, ఆపరేషన్ కమల విఫలమై పార్టీకి తీవ్ర స్థాయిలో ఎదురుదెబ్బ తగిలింది.
ఆపరేషన్ కమల నాయకులను నియంత్రించాలని నేరుగానే యడ్యూరప్పపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆపరేషన్ కమలకు పూనుకొన్న కొందరు నాయకులపై కూడా సంతోష్... అమిత్ షాకు ఫిర్యాదు చేయగా, ఈ రాజకీయ కార్యకలాపాల నుంచి పార్టీకి భంగపాటు కలగటమే కాకుండా ప్రజల ముందు తలదించుకొనే పరిస్థితి నెలకొంది. బీజేపీకి ఇటువంటి రాజకీయ కార్యకలాపాలు సరికాదని చెప్పినట్లు తెలిసింది. పార్టీ అధ్యక్షుడికి తనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన సంతోష్‌పై అసంతృప్తిని వ్యక్తం చేసిన యడ్యూరప్ప, సంతోష్ జాతీయ సహ సంఘటనా కార్యదర్శిగా ఉన్నా కూడా రాష్ట్రంలో బీజేపీ వ్యవహారాల్లో జోక్యం చేసుకొంటున్నారు. ద్వేషం పెట్టుకొని పని చేస్తున్నారు. వీరికి బుద్ధి చెప్పాలని యడ్యూరప్ప కూడా అమిత్ షాకు ఫిర్యాదు చేశారని తెలిసింది.
ఒక ప్రయత్నం చేశాం
శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉంది. అంతేకాకుండా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలల అసంతృప్తిని ఉపయోగించుకొని ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నం చేశాం. ఇందులో తప్పేముంది. రాజకీయాలలో ఇలాంటి సహజం. తమ ప్రయత్నం కొన్ని కారణాలతో సఫలం కాలేదని, ముందు తాము విజయం సాధిస్తాం. అందులో అనుమానమే అవసరం లేదు. అయితే ప్రస్తుతం జరిగిన వైఫల్యాలను పెద్దదిగా చేస్తూ ఏదో అయిపోయిందన్న విధంగా కొందరు నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఇది సరికాదని యడ్యూరప్ప.. షాకు తెలియజేశారని సమాచారం. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో అతి సమీపంలో ఉండగా, పార్టీ అభ్యర్థుల గెలుపుకు కలసికట్టుగా పనిచేయాల్సి ఉంది. అనవసరంగా ఇంతకు ముందు జరిగినదాన్నే మాట్లాడటం సరికాదు. ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. తాము ఆపరేషన్ కమల చేపట్టినందుకు ప్రజలు విసుగుచెందలేదు. ప్రజల భావాలు తమకు తెలుసునని యడ్యూరప్ప అమిత్ షాకు వాస్తవ స్థితిని తెలియజేసే ప్రయత్నం చేశారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment