
ఆ నియోజకవర్గంలో అందరూ ఆమెను సత్యవతమ్మ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. లక్ష ప్రసవాలు చేసిన వైద్యురాలిగా అనకాపల్లి, ఆ చుట్టపక్కల ప్రాంతాల్లో ప్రసిద్ధిచెందారు. అన్నింటా ఆదర్శ జీవితం అక్కడి ప్రజలకు ఆమెను చేరువచేసింది. వైద్యం ఖరీదైన రోజుల్లోను కేవలం రూ.30 ఫీజుగా తీసుకుంటూ ఎందరో పేదలకు ఆప్తురాలిగా మారారు. ఆమె ఎవరో కాదు.. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భీశెట్టి వెంకట సత్యవతి. అజాత శత్రువుగా, సంఘ సేవకురాలిగా, వైద్యురాలిగా పేరొందిన సత్యవతి ప్రజలకు మరింత సేవా చేయాలనే దృక్పథంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజల కోసం వైఎస్ జగన్ చేస్తున్న అవిశ్రాంత పోరాటం, దేనికీ వెరవని ధీరత్వం, రాజీలేని వ్యక్తిత్వం తనను ఆయన అడుగులో అడుగేశాలా చేశాయంటున్న డాక్టర్ సత్యవతి అంతరంగం ఆమె మాటల్లోనే..
‘‘ప్రజా సేవ చేయాలనే ఆకాంక్షతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నన్ను వైఎస్ జగన్ దృఢ సంకల్పం, పట్టుదల, ప్రజల కోసం ఆయప పడుతున్న తపన ఎంతో ఆకట్టుకుంది. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేసిన రాజీలేని పోరాటం నాపై చెరగని ముద్రవేసింది. నిర్ధిష్టమైన లక్ష్యాలతో జగనన్న ముందుకెళ్తున్న తీరు ఆలోచింపచేసింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆయన వెనుకంజ వేయలేదు. జన క్షేమం కోసం ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనుదిరిగి చూడరు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి పాలనకు ముగింపు పలికి అసెంబ్లీకి సీఎంగా వస్తానని శపథం చేసిన జగనన్న గత తొమ్మిదేళ్లుగా ప్రజల్లోనే ఉంటూ మాలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.
జగనన్న నాయకత్వంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతా
అనకాపల్లి ఎంపీ స్థానానికి నన్ను ఎంపిక చేశారని తెలియగానే నా ఆనందానికి అవధులు లేవు. పార్లమెంట్‌కు పోటీ చేస్తే జాతీయస్థాయి సమస్యలపై పోరాడవచ్చు. ప్రత్యేకహోదా సాధనకు కృషి చేయొచ్చు. విద్య, వైద్య రంగాల్లో ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలు మన రాష్ట్రానికి రావాలి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వాటి సాధన కోసం, రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలపై పోరాడవచ్చు. అందుకే ఆయన నాయకత్వంలో నడవాలని నిర్ణయించుకున్నా. రాజకీయాల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలనేది నా ఆకాంక్ష. అవకాశమిస్తే ఆకాశంలో సగంగా ఎదగడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారు. దానికి అనుగుణంగా విశాఖ జిల్లాలో నలుగురు మహిళలకు వైఎస్ జగన్ సీట్లు ఇచ్చారు.
నూటికి 85 శాతం సాధారణ ప్రసవాలే...
అనకాపల్లి మెటర్నటీ ఆస్పత్రిలో 1993 నుంచి 99 వరకూ గైనకాలజిస్టుగా పనిచేశా. ఆ సమయంలో ప్రసవానికి వచ్చే వారి కుటుంబ సమస్యలపై అవగాహన ఏర్పడింది. ఆర్థికపరమైన ఇబ్బందులతో వచ్చేవారిని చూసి మనసు చలించేది. అందుకే ఎక్కడ పనిచేసినా తక్కువ ఖర్చుతోనే సేవలందించాలని నిర్ణయించుకున్నా. 2000లో భర్త విష్ణుమూర్తి సహకారంతో అనకాపల్లిలో వివేకానంద ఆస్పత్రిని ప్రారంభించా. అప్పట్లో కేవలం రూ.10 తీసుకుని వైద్యసేవలందించేవాళ్లం. లక్షకు పైగా ప్రసవాలు చేసే అదృష్టం నాకు దక్కింది. వివేకానంద చారిటబుల్ ట్రస్టు తరఫున ఆధ్యాత్మిక, వైద్య, విద్య రంగాల్లో సేవలందిస్తున్నాం. వైద్యాన్ని కేవలం సేవగానే భావించాలనే దృక్పథంతో ముందుకు సాగుతున్నా. నా వద్దకు వచ్చే ప్రసవాల కేసుల్లో వందకు 15 మాత్రమే సిజేరియన్లు చేస్తా. వీలైనంత వరకూ సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యతనిస్తా.
ప్రజాసేవ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా
మా తల్లిదండ్రులు భీశెట్టి జగన్నాథరావు, దేముళ్లమ్మ. వారి ప్రోత్సాహంతో ఎంబీబీఎస్ చదివా. పెద్దల అంగీకారంతో సహ విద్యార్థినే పెళ్లి చేసుకున్నా. మా అత్తగారి కుటుంబంలో పలువురు రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. వారిని దగ్గరినుంచి చూసిన నాకు రాజకీయాలతోనే ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుందని అర్థం చేసుకున్నాను. 1992లో నా మనసులో మెదిలిన రాజకీయ ప్రస్థానం ఆలోచన ఆరేళ్ల క్రితం సాకారమైంది. చట్టసభలకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. జగనన్న నాకు ఆ అవకాశం కల్పించారు.
అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మా కుటుంబీకులు, స్నేహితులు, సహచర వైద్యులున్నారు. మా నాన్నగారు కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఉద్యోగిగా పని చేసేటప్పుడు చోడవరం కేంద్రంగా విధులు నిర్వహించేవారు. ఆ సమయంలో మాడుగులలో చదువుకోవడంతో అక్కడ కూడా మంచి పరిచయాలున్నాయి’’ – దాడి కృష్ణ వెంకట్రావు, అనకాపల్లి
Comments
Please login to add a commentAdd a comment