మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ అధ్యక్షుడు అనంత, పక్కన తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఆలూరి సాంబశివారెడ్డి, ధనుంజయయాదవ్
మంత్రి పరిటాల సునీత హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. శుక్రవారం ఆ పార్టీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి తదితరులు ఎస్పీని కలిశారు.
అనంతపురం సెంట్రల్: ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయ హత్యలను ప్రేరేపిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయయాదవ్‌పై హత్యకు కుట్ర జరిగిన విషయంపై ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ను శుక్రవారం క్యాంపు కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. బాధితుడు ధనుంజయయాదవ్‌కు రక్షణ కల్పించాలని అనంత వెంకట్రామిరెడ్డితో పాటు రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి తదితరులు ఎస్పీని కోరారు. అనంతరం మాజీ ఎంపీ అనంత మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులే లక్ష్యంగా అధికారపార్టీ నేతలు హత్యారాజకీయాలు ప్రేరేపిస్తున్నారన్నారు. ఈ సారి కూడా ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే పథకం రచిస్తున్నారన్నారు. గత ఎన్నికల్లోనూ ఇలాంటి కుట్ర రాజకీయాలు చేశారని గుర్తు చేశారు.
అధికారం చేపట్టినప్పటి నుంచి రాక్షసత్వం
టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులను పొట్టన పెట్టుకున్నట్లు తెలిపారు. పెద్దవడుగూరు సింగిల్‌విండో అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, ప్రసన్నాయపల్లి ప్రసాద్‌రెడ్డి తదితరులను హత్య చేయించారని గుర్తు చేశారు. పేరూరులో సమావేశమైన వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి చేయడమే కాకుండా కౌంటర్ కేసులు నమోదు చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులను భయబ్రాంతులకు గురిచేయడానికి దౌర్జన్యాలకు, దారుణాలకు తెగబడుతున్నారన్నారు. రాప్తాడు సమన్వయకర్త ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. మంత్రి పరిటాల సునీత హత్యారాజకీయాలను ప్రేరేపిస్తున్నారన్నారు.
మంత్రి స్థానంలో ఉంటూ ఇలాంటి చర్యలను ప్రోత్సహించడం బాధాకరమన్నారు. సీనియర్ నాయకులను అంతమొందిస్తే తప్పా ఎన్నికల్లో గెలవలేమనే ఉద్దేశంతో దారుణాలకు తెగబడుతున్నారని తెలిపారు. మనోహర్‌నాయుడు, శీన అనే వ్యక్తులు కుట్ర చేస్తున్నారని, వీరి వెనుక స్థానిక ప్రజాప్రతినిధి హస్తముందని ఆరోపించారు. దీనిపై పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయయాదవ్‌కు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌నగర అధ్యక్షుడు సోమశేఖరరెడ్డి, అధికార ప్రతినిధులు చింతకుంట మధు, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షుడు పెన్నోబిలేసు, నాయకులు అమర్‌నాథ్‌రెడ్డి, యూపీనాగిరెడ్డి, రఘునాథరెడ్డి, వరప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment