
సాక్షి, తాడేపల్లి: లాక్‌డౌన్ తొలినాళ్లలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో కొంత ఇబ్బంది ఉన్నా ప్రభుత్వం కల్పించుకోవడంతో పరిస్థితులు మెరుగయ్యాయని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. అరటి ఎగుమతి విషయంలో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వ ముందుచూపుతో ఎగుమతులు ఊపందుకున్నాయని చెప్పారు. గిట్టుబాటు ధర కోసం అన్ని ప్రయత్నాలు చేశామని ప్రస్తుతం ధర ఆశాజనకంగా ఉందని వెల్లడించారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మామిడి ఎగుమతుల్లో కూడా ప్రభుత్వం చొరవ చూపిందని గుర్తు చేశారు. ఇప్పటికే తిరుపతి నుంచి స్విట్జర్లాండ్ కు ఎగుమతులు ప్రారంభమయ్యాయని చెప్పారు. లాక్‌డౌన్ పూర్తయ్యే నాటికి మామిడి పంట పూర్తిగా చేతికందుతుందని తెలిపారు. పంట ఉత్పత్తుల ఎగుమతులపై కూడా ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు.
‘ఆక్వా ఉత్పత్తులు ఎగుమతులకు ఇప్పుడు ఇబ్బంది లేదు చైనా, అమెరికా, యూరప్ దేశాల మార్కెట్లు తెరుచుకున్నాయి. మన రాష్ట్రంలోనూ ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేసేలా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఫలితంగా ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు కూడా ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ అంశాలన్నింటిపై ప్రతి రోజూ సమీక్షిస్తున్నారు. ఇన్ని చేస్తుంటే ప్రతిపక్షాలకు కనిపించడం లేదు. లేఖలు రాయడం, అసంబద్ధ ఆరోపణలు చేయడం వారికి రివాజుగా మారింది. అందుకే ప్రజలు వారిని చీత్కరించారు. 2019 లోనే క్వారంటైన్, ఐసోలేషన్ పదాలకు ఏపీ ప్రజలు అర్ధం చెప్పారు. టీడీపీని ప్రజల మధ్య ఉండొద్దంటూ క్వారంటైన్‌కు పంపేశారు. అయినా వారి తీరు మారడం లేదు’అని కన్నబాబు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment