
సాక్షి, అమరావతి: వ్యాక్సిన్ సరఫరా అనేది కేంద్రం చేతుల్లో ఉన్న విషయం టీడీపీ వారికి తెలిసినా పనికట్టుకొని, దురుద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. గ్లోబల్ టెండర్లతో వ్యాక్సిన్ సరఫరా పెంచి అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలనుకోవడం తప్పా అని ప్రశ్నించారు. కేంద్రం అనుమతి లేక గ్లోబల్ టెండర్లకు ఎవరూ రాలేదని, అందుకే కేంద్రమే దీనిపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అన్నదాంట్లో తప్పేముందని నిలదీశారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘45 ఏళ్లు దాటిన వారందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి.
వ్యాక్సిన్ గురించి ఇంతగా మాట్లాడుతున్న చంద్రబాబు అసలు టీకా వేయించుకున్నారా లేదా? వేయించుకుంటే ఎక్కడ వేయించుకున్నారు? ఏపీలోనా లేక తెలంగాణలోనా? తన బంధువు కంపెనీ భారత్ బయోటెక్ వాళ్ల వ్యాక్సిన్ కోవాగ్జిన్ వేయించుకున్నారా? లేక కోవిషీల్డ్ వేయించుకున్నారా?’’ అన్నది ప్రజలకు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేద వాడు ఉండకూడదని సీఎం వైఎస్ జగన్ శ్రమిస్తుంటే దాన్ని ఎలా అడ్డుకోవాలా అని ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
జగనన్న కాలనీల్లో మౌలిక వసతులకు ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నారో టీడీపీ వాళ్లకు తెలియదా? ఆ స్థలాలు ఇవ్వకూడదని అడ్డుకుని కోర్టులో కేసులు వేసింది టీడీపీ వాళ్లు కాదా? చివరికి అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే డెమోగ్రాఫికల్ బ్యాలెన్స్ పోతుందని నిస్సిగ్గుగా కోర్టుకు చెప్పింది మీరు కాదా అని నిలదీశారు. సీఎం జగన్ మంచి చేస్తుంటే తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో కేంద్రం ఇచ్చిన నిధులతో ఇళ్ల పథకానికి ఎన్టీఆర్ హౌసింగ్ అని పేరు పెట్టుకోలేదా, దీనికేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment