గృహ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న మంత్రి అనిల్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని
బుట్టాయగూడెం: చంద్రబాబు పాలనలో పడకవేసిన పోలవరం ప్రాజెక్టు పనులు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పరుగులు పెడుతున్నాయని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో బుధవారం ఉపముఖ్యమంత్రి ఆళ్ల నానితో కలిసి ఆయన పర్యటించారు. ప్రాజెక్టు నిర్వాసితుల గృహ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం రౌతుగూడెంలో మీడియాతో మాట్లాడారు. జూన్ 30 నాటికి నిర్వాసితుల గృహ నిర్మాణం పనులను పూర్తి చేసి జూలై 15 నాటికి 17 వేల కుటుంబాలను తరలిస్తాం అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
► దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో నిర్మలమైన మనస్సుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. ప్రాజెక్టు పూర్తి చేసే భాగ్యం ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రావడం పూర్వ జన్మసుకృతం.
► పోలవరం ప్రాజెక్టు అంటే గత పాలకులు భావించినట్లు ఒక డ్యామ్, రెండు కాల్వలు కాదు. రూ.50 వేల కోట్లు ప్రజాధనం, లక్ష 11 వేల పేద, గిరిజన, ఎస్సీ, బీసీ కుటుంబాల త్యాగం.
► 50–60 సంవత్సరాలుగా నివసిస్తున్న ప్రజలు తమ సొంత ఊళ్లను ప్రాజెక్టు కోసం త్యాగం చేయడం అభినందనీయం.
► ఈ ప్రాజెక్టులో సింహ భాగమైన రూ.30 వేల కోట్ల విలువైన ఆర్‌అండ్‌ఆర్ పనుల్లో ఇప్పటి వరకూ 15 శాతం మాత్రమే జరిగాయి. గత ప్రభుత్వం పనులు తక్కువ ప్రచారం ఎక్కువ అన్నట్లు సాగించడంతోనే ఈ పరిస్థితి నెలకొంది.
► రూ.50 వేల కోట్ల ప్రాజెక్టులో 70 శాతం పనులు చేశామని గొప్పలు చెప్పుకున్నారు. వాస్తవానికి చేసిన ఖర్చు రూ.16 వేల కోట్లు అయితే 70 శాతం పనులు ఎలా పూర్తయ్యాయో వారే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment