నెల్లూరు (సెంట్రల్): అధికారంలో ఉన్నప్పుడు రైతుల్ని జైల్లో పెట్టించిన నీచ చరిత్ర చంద్రబాబుదని జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్ అన్నారు. నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు అన్యాయం జరిగిపోతోందని లోకేశ్ మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రైతులను కొట్టించి జైల్లో పెట్టించిన విషయం గుర్తు చేసుకోవాలన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా రైతులకు అన్నివిధాలా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉంటూ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారని వివరించారు.
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో లోకేశ్‌కు కనీసం లెక్కలు కూడా రావని ఎద్దేవా చేశారు. పోలవరం నిర్మాణానికి రూ.50 వేల కోట్లు ఖర్చవుతుందని, అందులో రూ.18 వేల కోట్లను తమ ప్రభుత్వం ఖర్చు చేసి 75 శాతం పనులు పూర్తి చేసిందని లోకేశ్ చెబుతుండటం ఆయన మిడిమిడి జ్ఞానానికి అద్దం పడుతోందన్నారు. పోలవరం విషయంలో గత ప్రభుత్వం కేబినెట్‌లో పెట్టిన నోట్‌ను ఒకసారి చదివితే అందులో ఏముందో తెలుస్తుందని చురకలంటించారు. పోలవరం చిన్న డ్యామ్, కాలువ కాదనే విషయం తెలుసుకోవాలని తండ్రీకొడుకులకు సూచించారు. తమ ప్రభుత్వం చెప్పిన ప్రకారం పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్ణీత వ్యవధిలోనే పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. నెల్లూరు, సంగం బ్యారేజీ పనులు నీటి ప్రవాహం తగ్గిన తర్వాత చేపట్టి త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.
కరోనా అదుపులోకి వచ్చాకే ఎన్నికలు
రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. కరోనా అదుపులోకి వచ్చేవరకు ఇష్టానుసారంగా ఎన్నికలు నిర్వహిస్తామంటే కుదరదన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో రాష్ట్ర ఎన్నికల అధికారి వ్యవహరిస్తామంటే ఎలా అన్నారు. ప్రభుత్వం అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఆలోచన చేస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment