
నాలుగు లోక్‌సభ, పది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీల విజయం బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పక్షాల ఐక్యతకు దారితీస్తుందని భావిస్తున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని కైరానా లోక్‌సభ , నూర్పూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రాంతీయపక్షాలైన రాష్ట్రీయ లోక్‌దళ్(ఆరెల్డీ), సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) గెలుపు తాజాగా ఈ విషయం స్పష్టం చేశాయి. ఈ రెండు పార్టీలకు బీఎస్పీ మద్దతు పలకడం, కాంగ్రెస్ కూడా సమర్థించడంతో బీజేపీ ఈ రెండు సీట్లను కోల్పోయింది. బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి 2019 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీచేస్తే అత్యధిక సీట్లు కైవసం చేసుకోవచ్చు. బిహార్‌లో అతి పెద్ద ప్రాంతీయపక్షమైన ఆర్జేడీ కూడా కాంగ్రెస్, మాజీ సీఎం జీతన్ రాం మాంఝీ నాయకత్వంలోని హెచ్ఏఎంతో పొత్తు పెట్టుకుని జోకీహాట్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ నుంచి కైవసం చేసుకుంది.
2014, 2015 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో కాంగ్రెస్‌తో పాటు హెచ్ఏఎం వంటి చిన్నా చితకా ప్రాంతీయపక్షాలతో కలిసి ఆర్జేడీ బరిలోకి దిగితే అత్యధిక సీట్లు సాధించవచ్చు. జార్ఖండ్‌లో రెండు అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన జేఎంఎం రెండింటినీ నిలబెట్టుకుంది. రెండుచోట్లా బీజేపీ సంకీర్ణ భాగస్వామి అయిన ఏజేఎస్‌యూ అభ్యర్థులను జేఎంఎం ఓడించింది. ఈ రాష్ట్రంలో బీజేపీని మినహాయిస్తే జేఎంఎం, ఏజేఎస్‌యూ వంటి ప్రాంతీయపక్షాలకు చెప్పుకోదగ్గ బలముంది. ఈ రాష్ట్రంలో ప్రాంతీయపక్షాలు ప్రతిసారీ కూటములు మారుతుంటాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికలనాటికి ఎన్డీఏ నుంచి ఏజేఎస్‌యూ బయటికొచ్చి జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్తదితర బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపితే అత్యధిక సీట్లలో బీజేపీని ఓడించడం తేలికవుతుంది.
పశ్చిమ బెంగాల్లో బీజేపీయేతర పక్షాలన్నీ ఏకమైతే?
పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నిక జరిగిన ఒకే సీటును పాలక టీఎంసీ భారీ మెజారిటీతో నిలబెట్టుకున్నా బీజేపీ రెండో స్థానంలో నిలబడడం సీఎం మమతా బెనర్జీకి ఆందోళన కలిగించే విషయం. బెంగాల్లో బలపడతున్న బీజేపీకి వచ్చేసారి రెండు సీట్లు కూడా రాకుండా చేయడానికి ఆమె కాంగ్రెస్, వీలైతే వామపక్షాలతో కూడా పొత్తు పెట్టుకోవడానికి అంగీకరించే అవకాశాలున్నాయి. తృణమూల్‌తో సర్దుబాటుకు సీపీఎం అంగీకరిస్తే బీజేపీకి ఒక్క సీటు రాకుండా చేయవచ్చు. ఒడిశలో 18 ఏళ్లుగా అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్(బీజేడీ) కొంత బలహీనపడినట్టు స్థానిక ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. రెండో పెద్ద పార్టీగా కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది. బీజేపీని ఓడించడానికి బీజేడీ అవసరమైతే కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుకు ప్రయత్నించే వీలుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ మద్దతుతో భండారాగోండియా లోక్‌సభ సీటును బీజేపీ నుంచి ఎన్సీపీ కైవసం చేసుకుంది. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఎన్సీపీ అదే ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసింది.
బీజేపీ, శివసేన కూడా విడివిడిగా పోటీచేసినా చివరికి సంకీర్ణ భాగస్వాములయ్యాయి. బీజేపీతో సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో 2019 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండదని కూడా ఇదివరికే శివసేన ప్రకటించింది. ఇదే జరిగితే తన ఉనికి కాపాడుకోవడానికి కాంగ్రెస్ ఎన్సీపీ, ఒకప్పటి ఎన్డీఏ భాగస్వామి స్వాభిమాన్ పక్ష, బహుజన్వికాస్ఆఘాడీ(బీవీఏ) వంటి చిన్నపార్టీలతో చేతులు కలిపి పార్లమెంటుకు పోటీచేసే అవకాశాలు లేకపోలేదు. పాల్‌ఘర్ లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ వ్యతిరేక ఓట్లు శివసేన(2,43,206), బీవీఏ(2,22,837) మధ్య చీలిపోవడంతో బీజేపీ అభ్యర్థి స్వల్ప మెజారిటీతో గెలిచారు. శివసేన సహా మిగిలిన చిన్న చిన్న ప్రాంతీయపక్షాలన్నీ కాంగ్రెస్ ఎన్సీపీ కూటమితో చేతులు కలిపితే బీజేపీకి రాష్ట్రంలో దక్కే సీట్లు గణనీయంగా పడిపోతాయి. 2014 లోక్‌సభ ఎన్నికల నుంచి ఇప్పటి వరకూ 27 లోక్‌సభ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తన ఖాతాలోని 7 స్థానాలు కోల్పోయింది. ఆరు చోట్ల మాత్రమే గెలుపు సాధించింది.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment