సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సవరణ బిల్లుకు శాసనసభ శుక్రవారం ఆమోదం తెలిపింది. దీంతోపాటు వేతన సవరణ బిల్లుకు కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అంతకుముందు లోకాయుక్త సవరణ బిల్లుపై ప్రభుత్వ విప్, వైఎస్సార్‌సీపీ సభ్యుడు కాపు రామచంద్రారెడ్డి చర్చను ప్రారంభిస్తూ.. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం చట్టాలు తీసుకొస్తూనే.. మరోవైపు అవినీతి నిరోధించడానికి, పరిపాలనను మరింత మెరుగ్గా అందించడానికి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బిల్లులు తీసుకువస్తున్నారని, ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సవరణ బిల్లు, జ్యుడీషియల్ కమిషన్ బిల్లులను తీసుకువస్తున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సవరణ బిల్లు సీఎం వైఎస్ జగన్ దార్శనికతకు ఒక నిదర్శనమని, అవినీతి రహిత మెరుగైన పరిపాలన విషయంలో సీఎం వైఎస్ జగన్ ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోతారని కొనియాడారు. గత చంద్రబాబు ప్రభుత్వం కనీసం సమాచార కమిషనర్లను కూడా నియమించలేదని, ట్రైబల్ వెల్ఫేర్ కమిటీని కూడా వేయలేదని తప్పుబట్టారు. లోకాయుక్త కమిషన్‌ను ఏర్పాటు చేయలంటే ప్రస్తుతం హైకోర్టు చీఫ్ జస్టిస్ లేదా హైకోర్టు జస్టిస్‌ను నియమించాలని, అయితే, దేశంలో న్యాయమూర్తుల కొరత ఉండటంతో ఇది సమస్యగా మారిందన్నారు. దేశంలో మొత్తం 1079 మంది న్యాయమూర్తుల అవసరం ఉండగా.. ప్రస్తుతం 534 మంది న్యాయమూర్తులు, 132 మంది అదనపు న్యాయమూర్తులు మాత్రమే అందుబాటులో ఉన్నారని తెలిపారు. 239 న్యాయమూర్తుల పోస్టులు, 174 అదనపు న్యాయమూర్తుల పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయన్నారు. ఏపీ విషయానికొస్తే.. రాష్ట్రంలో 28 మంది న్యాయమూర్తులు, తొమ్మిది మంది అదనపు న్యాయమూర్తులు అవసరముండగా.. 13మంది న్యాయమూర్తులు మాత్రమే అందుబాటులో ఉన్నారని, 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు.
ఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తులు లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను లోకాయుక్తగా నియమించడమంటే ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని, అందుకే హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ లేదా, హైకోర్టు రిటైర్డ్ జస్టిస్‌ను లోకాయుక్తగా నియమించవచ్చునని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం లోకాయక్త చట్టంలో సవరణ తీసుకొచ్చిందని, దేశంలో, రాష్ట్రంలో పలువురు రిటైర్డ్ న్యాయమూర్తులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఈ మేరకు చట్టంలో సవరణ తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో లోకాయుక్త నియామకానికి సీఎం వైఎస్ జగన్ మార్గం సుగమం చేశారని అన్నారు. లోకాయుక్త కేవలం అవినీతి కేసులనే కాకుండా.. పరిపాలనలో అధికారుల తప్పిదాలు, నిర్లక్ష్యం.. చేయాల్సిన పనులు చేయకపోవడం, చేయకూడని పనులు చేయడం వంటివి విచారిస్తుందని తెలిపారు. లోకాయుక్త వ్యవస్థను బలపరచడం ద్వారా పరిపాలనను మరింత మెరుగు చేయవచ్చునని, మరింత పారదర్శకత తీసుకురావచ్చునని కాపు రామచంద్రారెడ్డి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment