
సాక్షి, న్యూఢిల్లీ : ఆపరేషన్ గరుడ వెనుక ఉన్నది ఎవరో నిగ్గు తేల్చాలని, ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఏపీ బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరగడంతో రాష్ట్రంలో దుమారం రేగుతోంది. అయితే ఇదంతా ఆపరేషన్ గరుడలో భాగమేనని చంద్రబాబు వ్యాఖ్యానించడంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సినీ నటుడు శివాజీ గతంలో ఆపరేషన్ గరుడ గురించి మీడియాకు వివరించిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పినవిధంగానే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరగడంతో ఈ ఆపరేషన్ గరుడ పేరుతో జరుగుతున్న కుట్రపై దర్యాప్తు జరపాలని సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ గరుడపై విచారణ జరపాలని, తిత్లీ తుపానుతో నష్టపోయిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఆదుకోవాలని కేంద్ర హోంమంత్రిని బీజేపీ నేతలు కోరారు.
అనంతరం ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ గరుడ అనేది టీడీపీ సృష్టేనని, దీనిపై నిజానిజాలు వెలికితీయాలని రెండు నెలల కిందటే ఫిర్యాదు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహించిందని విమర్శించారు. వైఎస్ జగన్‌పై దాడి జరుగుతుందని రెండు నెలల కిందటే చెప్పిన వ్యక్తిని సాక్షిగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. నటుడు శివాజీని భద్రత బలగాలు అదుపులోకి తీసుకుని విచారించాలని డిమాండ్ చేశారు. సీఎంపైనే దాడి జరుగుతుందని రెండు రోజుల కిందటే చెప్పినా.. ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. చార్జిషీట్‌లో శివాజీ పేరు లేకుండాచేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం నిందితులను కాపాడుతోందని మండిపడ్డారు. కడప ఉక్కు పరిశ్రమ రాకుండా అడ్డుపడిన టీడీపీకి ధర్మపోరాట దీక్ష చేసే హక్కులేదని ఎద్దేవా చేశారు. తిత్లీ సహాయక చర్యలను ప్రధాని మోదీ అడ్డుకుంటున్నారంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని పేర్కొన్నారు. చంద్రబాబులో ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలనే తలంపే కనబడుతోందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment