సాక్షి, అమరావతి : ఆపన్నుల వైద్యానికి ఆదరువుగా నిలవాల్సిన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్)ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, కొన్ని కార్పొరేట్ ఆస్పత్రుల యాజమానులు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. నిస్సహాయులైన పేదల వైద్య సహాయానికి అండగా ఉండాల్సిన సీఎంఆర్‌ఎఫ్‌లో అక్రమాలు మూడు బిల్లులు ఆరు చెక్కులు చందంగా సాగుతోంది. ‘వైద్యం చేయండి.. నిధులిస్తాం’ అంటూ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) జారీ చేసే లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ)ల జారీతోనే వాటాల పర్వం ఆరంభమవుతోంది. కొందరు అధికార పార్టీ నేతలతో కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు ‘మీకింత.. మాకింత’ తరహా మౌఖిక ఒప్పందాలు చేసుకున్నాయి. ఆ ఆస్పత్రులకు వైద్యం కోసం వచ్చే వారికి అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల ద్వారా కార్పొరేట్ ఆస్పత్రులు ఎల్‌ఓసీలు ఇప్పించుకుంటున్నాయి.
ఇందులో 30 శాతానికి పైగా వాటా ఆ ప్రజాప్రతినిధులకు ఆస్పత్రులు నగదు రూపంలో ముట్టజెబుతున్నాయి. మంత్రులు, అధికారపార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వ్యక్తిగత సహాయకులు (పీఏలు) నేరుగా సిఫార్సు లేఖలను సీఎంవోకు తీసుకెళ్లి ఎల్‌ఓసీలు ఇప్పిస్తున్నారు. ఎక్కువ మొత్తానికి ఎల్‌ఓసీలు, నిధులు మంజూరు చేయిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల ఏజెంట్లు కూడా సీఎంఓలో నేరుగా బిల్లులు మంజూరు చేయించుకుంటున్నారు. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు సీఎంఆర్‌ఎఫ్ నుంచి అధిక నిధులు పొందుతున్నాయని తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన ముఖ్యమైన ప్రజాప్రతినిధులతో ఒప్పందాలే ఇందుకు కారణమని కార్పొరేట్ ఆస్పత్రుల వర్గాలు చెబుతున్నాయి. విజయవాడ, గుంటూరు, ఒంగోలులోని ఒక వర్గానికి చెందిన ఐదు ఆస్పత్రులకు సీఎంఆర్‌ఎఫ్ నుంచి అత్యధిక నిధులు మంజూరు అవుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యమంత్రి పేషీలోని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు బయట బేరాలు చేసుకుని నిధుల మంజూరులో కీలక భూమిక పోషిస్తున్నారు. ఆస్పత్రులకు ఎల్‌ఓసీల మంజూరులోనూ బిల్లుల విడుదలలోనూ వారు చక్రం తిప్పుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కుప్పం నేతల దందా..
ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పంలో సీఎంఆర్‌ఎఫ్ వ్యవహారం తెలుగుదేశం పార్టీలో తీవ్ర రచ్చకు దారితీసింది. కుప్పం నియోజకవర్గంలోని కంచనపల్లికి చెందిన సుజాత కుమారుడు అజయ్‌కుమార్‌కు కిడ్నీ దెబ్బతింది. అతనికి వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి గత ఏడాది ఏప్రిల్ 22న రూ.7 లక్షలు మంజూరైంది. ఈ నిధులు తానే మంజూరు చేయించానంటూ అక్కడి తెలుగుదేశం నాయకుడు నారాయణాచారి రూ.3 లక్షలు తీసుకున్నారని సుజాత వాపోతున్నారు. ఆ డబ్బు గురించి అడుగుతుంటే ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారని సుజాత కంటతడి పెట్టుకుంటోంది. మరోపక్క విజయవాడ నగరంలోని వన్‌టౌన్‌కు చెందిన ఒక కోటీశ్వరుడి వైద్యానికి ఓ ప్రజాప్రతినిధి సిఫార్సు చేసి రూ.10 లక్షలు సీఎంఆర్‌ఎఫ్ నుంచి విడుదల చేయించారు. ‘ఫిఫ్టీ.. ఫిఫ్టీ’ ఒప్పందం మేరకే ఈ నిధులు మంజూరు చేయించారని ఆరోపణలు ఉన్నాయి. సీఎంఆర్‌ఎఫ్ కింద నిధుల విడుదలకు ఇస్తున్న జీవోల్లో ఏవైద్యానికి ఎంత నిధులు ఇచ్చారనే వివరాలు ఉండవు. ఒకే తరహా వైద్యానికి ఒక ఆస్పత్రికి ఒకలా మరో ఆస్పత్రికి మరోలా వ్యత్యాసం చూపుతున్నారని కొన్ని ఆస్పత్రుల వారు చెబుతున్నారు.
ఆరోగ్యశ్రీకి ఒకలా.. సీఎంఆర్‌ఎఫ్‌కు మరోలా..
హైదరాబాద్‌లో వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ వర్తించదని జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్ కింద బెంగళూరు, చెన్నైల్లో వైద్యం చేయించుకున్న వారికి ఎలా నిధులు ఇస్తోందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. వైద్యానికి ప్రభుత్వ నిధుల మంజూరులో పేదలకు ఒక రూలు, ధనికులకు మరో రూలా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక మరోపక్క విజయవాడలోని కొన్ని ఆస్పత్రులు సీఎంఆర్‌ఎఫ్ నిధులను ఇప్పిస్తామని చెప్పి పేషెంట్‌లను ఆకర్షిస్తున్నాయి. ఇక జిల్లాల వారీగా బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర వివక్ష కొనసాగుతోంది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని అధికార పార్టీ నేతలకు సన్నిహితులైన కొన్ని ఆస్పత్రులకు మోకీలు ఆపరేషన్‌కు సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ. 1,08,610 మంజూరు చేశారు. కర్నూలు, అనంతపురం నగరాల్లో ఇదే శస్త్రచికిత్సలు చేసిన ఆస్పత్రులకు కేవలం రూ. 81 వేలు మాత్రమే మంజూరు చేశారని ఒక ప్రైవేటు ఆస్పత్రి యజమాని పేర్కొన్నారు. ఇలా వివక్ష చూపడం అన్యాయమని ఆస్పత్రుల యజమానులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment