సాక్షి, విశాఖపట్నం : ఎల్‌జీ పాలిమర్స్ ఘటనపై తమ ప్రభుత్వమేమి తప్పించుకోవడంలేదని మంత్రి కురసాల కన్నాబాబు స్పష్టం చేశారు. ఘటన జరిగిన వెంటనే సీఎం నుంచి కింది స్థాయి వరకు అంతా వేగంగా స్పందించామని గుర్తుచేశారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాద సమయంలో అలారం ఎందుకు మోగలేదని ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారని వివరించారు. ఈ క్రమంలోనే ఫ్యాక్టరీ యాజమాన్యంతో సీఎం మాట్లాడితే తప్పన్నట్లు కొందరు పనికట్టుకొని విష ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీటికి సమాధానం చెప్పండి చంద్రబాబు
‘1998 లో మీరు సీఎం(చంద్రబాబు)గా ఉన్నప్పుడు ఎల్‌జీ పాలిమర్స్ లో ప్రమాదం జరిగితే అప్పుడు మీరేం చేశారు?. నిబంధనలకి విరుద్దంగా ఎల్‌జీ పాలిమర్స్‌కు మీ హయాం(2015)లో విస్తరణకు ఎలా అనుమతులిచ్చారు?. అంతేకాకుండా నిబంధనలకు వ్యతిరేకంగా 2023 వరకు ఎల్‌జీ పాలిమర్స్‌కు అనుమతులిచ్చింది మీరు కాదా?. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తూ అప్పటి పెందుర్తి ఎమ్మెల్యే మానం ఆంజనేయులు లేఖ రాస్తే ఎందుకు స్పందించలేదు? నిబంధనలకు విరుద్దంగా అనుమతులివ్వడంపై ప్రశ్నిస్తున్న మాజీ ఐఏఎస్ అధికారి శర్మకి ముందుగా సమాధానం చెప్పండి. నిబంధనలను పట్టించుకోకుండా సింహాచలం దేవస్థానానికి చెందిన వందల ఎకరాలని డీ నోటిఫై చేసి మరీ ఎల్‌జీ పాలిమర్స్‌కు మీరు అప్పగించలేదా? జీవిఎంసీ పరిధిని ఎల్‌జీ పాలిమర్స్ వరకు పెంచినప్పుడు ఇలాంటి ఫ్యాక్టరీ వల్ల ప్రజలకి ఇబ్బంది అని తెలీదా?
ఐఏఎస్ కమిటీలను ఎలా విమర్శిస్తారు?
ఎల్‌జీ పాలిమర్స్ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వివిధ కమిటీలను నియమించింది. ఐఏఎస్‌లతో కూడిన ఈ కమిటీలను చంద్రబాబు ఎలా విమర్శిస్తారు. వారికేం తెలుసని అడగడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు నియమించిన టీడీపీ కమిటీలో ఉన్న అచ్చెన్నాయుడు, చిన్నరాజప్ప, రామానాయుడు రసాయన శాస్త్రవేత్తలా? నగరంలో గెయిల్ ప్రమాదం జరిగితే చంద్రబాబు ఎలాంటి నష్టపరిహారం ఇచ్చారో అందరికీ తెలుసు. పుష్కరాల తొక్కిసలాట వల్ల చనిపోయిన కుటుంబాలను ఎలా ఆదుకున్నారో ప్రజలందరికీ గుర్తుంది. సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు’ అని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.
చదవండి:
‘బాబు తప్పిదాల వల్లే ఈ ప్రమాదం’
ఆందోళన వద్దు... మీ బాధ్యత మాది
Comments
Please login to add a commentAdd a comment