
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని దాదాపు 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని పండగలా జరపాలనుకున్నామని.. ఇలాంటి కార్యక్రమానికి రాజకీయ పార్టీలు అడ్డు పడటం దారుణమని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఇస్తున్న ఇళ్ల పట్టాలను ప్రతిపక్షాలు అడ్డుకోవడాన్ని ‘బ్లాక్ డే’ గా చెప్పుకోవాలని విమర్శించారు. రాజకీయ పార్టీలు తాత్కాలికంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆపవచ్చు గానీ.. ప్రభుత్వం త్వరలోనే చెప్పిన విధంగా అర్హులకు ఇళ్ల పట్టాలను అందిస్తుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ మహిళలకు వీరోచిత చరిత్ర ఉంది.. ఏదైనా పోరాడి సాధించుకోగలరని పేర్కొన్నారు. మంగళవారమిక్కడ ఆమె మాట్లాడుతూ.. మహిళలకు ఇస్తున్న ఇళ్ల పట్టాలను ఇవ్వకుండా టీడీపీ అడ్డుకుంటుందని ధ్వజమెత్తారు.
‘‘గతంలో ఏ ప్రభుత్వానికి రాని ఆలోచన మా ప్రభుత్వానికి వచ్చింది. ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీద ఇచ్చేందుకు సిద్ధం చేసింది. మహిళలను ఆర్ధికంగా ఆదుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అనుకుంది. గత సంవత్సరం కాలం నుంచి మహిళల స్థితిగతులలో మార్పు కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో అన్ని రంగాల్లో మహిళలకు ఈ ప్రభుత్వం 50 శాతం మహిళలకు కేటాయిస్తోంది. అన్ని పథకాలకు సంబంధించిన నగదు నేరుగా మహిళల అకౌంట్‌లోకే వేస్తోంది. మద్యం అమ్మకాలని గణనీయంగా తగ్గించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రభుత్వ నిర్ణయానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. సినీతారలు, ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులు, క్రీడాకారులు, ఇలా అన్ని రంగాలకు చెందిన మహిళలు అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నీ ప్రశంసిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కోరుతున్నారు. గత ప్రభుత్వాలు ప్రకటనల్లో తప్ప నిజ జీవితంలో మహిళలను పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ఇళ్ల పట్టాలను ప్రతిపక్షాలు అడ్డుకోవడాన్ని ఒక బ్లాక్ డే గా చెప్పుకోవాలి’’ అని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment