న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో పాటు 11 మంది ఆప్ ఎమ్మెల్యేలకు స్థానిక కోర్టు సమన్లు జారీచేసింది. పోలీసులు దాఖలుచేసిన చార్జిషీటు ఆధారంగా వారిని నిందితులుగా పేర్కొంది. అక్టోబర్ 25న తమ ముందు హాజరుకావాలని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ నిందితులందరికీ నోటీసులు పంపారు.
వారిపై నేరాభియోగాలు మోపేందుకు తగినన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. దోషులుగా తేలితే వారికి గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. ఈ కేసులో మే 18న ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్‌ను మూడు గంటల పాటు విచారించిన సంగతి తెలిసిందే. ఆప్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే పెద్ద కుట్రలో భాగంగానే నోటీసులు పంపిస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ మండిపడ్డారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బూటకపు కేసులను పెడుతోందని, అవన్నీ కోర్టులో నిలబడవని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్న ఆప్ ప్రభుత్వ స్ఫూర్తిని ఇలాంటి కుట్రలు దెబ్బతీయలేవని అన్నారు. ఫిబ్రవరి 19న కేజ్రీవాల్ నివాసంలో ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment