
సాక్షి, ముంబై : మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్ష పదవి తనకే కట్టబెట్టాలని ప్రజా పనుల శాఖ మంత్రి అశోక్ చవాన్ డిమాండ్ చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు బాలాసాహెబ్ థొరాత్ పనితీరు సక్రమంగా లేదని చవాన్ లేఖలో ఆరోపించారు. థోరాత్ కారణంగానే గత సంవత్సరం అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ స్థానాలు వచ్చాయని ఆరోపిస్తూ నేరుగా కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. అందులో పీసీసీ పదవీ బాధ‍్యతలు తనకే కట్టబెట్టాలని కోరారు. గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పీసీసీ అధ్యక్ష పదవి నుంచి అశోక్ చవాన్‌ను తొలగించారు. ఆ తర్వాత ఆ పదవిలో థోరాత్‌ను నియమించారు. కానీ, మళ్లీ ఆ పదవిలో కొనసాగాలని చవాన్ ఉవ్వీళ్లూరుతున్నారు. దీంతో ఆ పదవి తనకే కట్టబెట్టాలని సోనియాకు రాసిన లేఖలో డిమాండ్ చేశారు.
ముంబై రీజియన్‌లో కూడా...
రాష్ట్రంలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ నేతృత్వంలో మహాకూటమి ఆఘాడి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని మరింత పటిష్టంగా ముందుకు నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంత్రి మండలిలో మంత్రుల పదవులు పంపకం తర్వాత తమ పార్టీలు మరింత సంఘటితం చేసే ప్రయత్నాలు జోరుగా చేస్తున్నాయి. అందులో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన కాంగ్రెస్ ముంబై రీజియన్ అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు ఆ పార్టీలో పోటీ తీవ్రమైంది. వచ్చే బీఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముంబై అధ్యక్ష పదవి దక‍్కించుకునేందుకు ఇప్పటి నుంచి పోటీ మొదలైంది. అందుకు పార్టీ సీనియర్ నేతలతో పైరవీలు, సిఫార్సులు చేయడం ప్రారంభించారు. ముంబై అధ్యక్ష పదవి తమకే కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అమర్‌జిత్ సింగ్ మన్హాస్, మాజీ అధ్యక్షుడు మిలింద్ దేవరా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మాజీ మంత్రి సురేశ్ వెట్టి, నసీం ఖాన్, ఎమ్మెల్యే భాయి జగ్తాప్, చరణ్‌జీత్ సింగ్ సప్రా తదితరులు కూడా ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
పైరవీలు షురూ!
అత్యంత కీలకమైన ముంబై రీజియన్ అధ్యక్ష పదవి కోసం మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేల మద్ధతుదారులు పార్టీ సీనియర్ నాయకులతో పైరవీలు చేస్తున్నారు. మరోపక్క పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ తరచూ చర్చల్లోకి వస్తున్న అమర్‌జిత్ సింగ్‌కు ఆ బాధ్యతలు అప్పగించాలని కొందరు పట్టుబడుతున్నారు. గతంలో కూడా అమర్‌జిత్ సింగ్‌కు ముంబై రీజియన్ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మల్లికార్జున్ ఖర్గేతో సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ఆ పదవికి అమర్‌జిత్ సమర్ధుడని, దీంతో ఆ పదవి ఆయనకే కట్టబెట్టాలని ఈ భేటీలో డిమాండ్ చేశారు. అయితే, ఇప్పుడు అమర్‌జిత్‌కు పోటీగా మిలింద్ దేవరాతో పాటు మరో అరడజను పేర్లు తెరమీదకు రావడంతో పేచీ మొదలయ్యే ప్రమాదం ఉంది. దీంతో ఇద్దరిలో ఎవరికి ఈ పదవి దక్కుతుందనే దానిపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అందరి సమ్మతితోనే ఈ క్లిష్టమైన సమస్యను పరిష్కరించి ఒకరికి ఈ పదవి బాధ్యతలు కట్టబెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment