సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ తాజాగా ఆమోదించిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అస్సాంలో ఆందోళనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గడిచిన వారం రోజులుగా అస్సాంతో పాటు ఈశాన్యంలో ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడి పరిస్థితులపై విపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రశాంతంగా ఉండే అస్సాంను బీజేపీ ప్రభుత్వం మరో కశ్మీర్‌గా మార్చుతోందని కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాదస్పద బిల్లుతో ఈశాన్య ప్రాంతమంతా రావణకాష్టంగా తయారైందని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పౌరసత్వ బిల్లుతో బెంగాల్ కూడా హింసాత్మకంగా మారిందని కేంద్రంపై విమర్శలు చేశారు. బెంగాల్‌లో పరిస్థితిని సాధారణ స్థితికి చేర్చేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి లేఖ రాసినట్లు రంజన్ తెలిపారు. పౌరసత్వ వివాదానికి కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరే కారణమని ఆరోపించారు. (ఇంటర్‌నెట్ నిలిపివేత)
కాగా వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుతో ఈశాన్యంలో యుద్ధ వాతావరణం కనిపించింది. కర్ఫ్యూను సైతం లెక్కచేయకుండా రోడ్ల దిగ్బంధం, గృహ దహనాలు, దుకాణాల లూటీకి పాల్పడుతుండటంతో పోలీసులు లాఠీచార్జి, కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ఆరుగురు ఆందోళనకారులు మృతి చెందారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విద్యా, వాణిజ్య సంస్థలు పని చేయడంలేదు.రవాణా వ్యవస్థ స్తంభించింది. అధికారులు ముందు జాగ్రత్తగా త్రిపుర, అసోంలకు రైలు సర్వీసులను రద్దు చేశారు. విమాన సర్వీసులను సైతం పలు ప్రాంతాలకు రద్దు చేశారు. సైనికులు ఫ్లాగ్ మార్చ్ చేపడుతున్నారు. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు కొనసాగనున్నాయి. ఆందోళనల దృష్ట్యా అస్సాం, త్రిపుర వైపు వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ఇదివరకే వెల్లడించింది. ఆందోళనల కారణంగా ప్రయాణికులు పలు ప్రాంతాల్లో చిక్కుకు పోయారు.
పౌరసత్వ రగడ: మరో కశ్మీర్‌లా ఈశాన్యం!
Published Sun, Dec 15 2019 4:18 PM | Last Updated on Sun, Dec 15 2019 4:21 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment