
సాక్షి, విజయవాడ: తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఓడినా బొప్పన భవకుమార్ ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు తీరుస్తున్నారని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం తూర్పు నియోజకవర్గంలోని 15వ డివిజన్‌లో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. మొదట వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి.. అనంతరం సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో విజయవాడ అభివృద్ది కుంటుపడిందని విమర్శించారు. టీడీపీ పాలనలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో నిధుల కేటాయింపులే లేవని మంత్రి ప్రస్తావించారు.
అయితే ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉందని.. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి కోటి రూపాయల నిధులు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనని ప్రశంసించారు. విజయవాడలోని అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తామని, టీడీపీలా తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు. అనంతరం తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి నియోజకవర్గ ఇంచార్జి బొప్పన భవకుమార్ ధన్యవాదాలు తెలిపారు.