బి.శ్రీరాములు (ఫైల్ ఫొటో)
సాక్షి, బళ్లారి: తాను ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో తాను లేనని, పార్టీ అధినాయకత్వం అప్పగించే ఏ బాధ్యత అయినా స్వీకరిస్తానని కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్షుడు, మొళకాల్మూరు ఎమ్మెల్యే బి.శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన శుక్రవారం బళ్లారిలో రాఘవ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాను ఏ ఒక్క జిల్లాకో చెందిన వ్యక్తిని కానని, అన్ని జిల్లాలకు చెందిన ప్రజలు తనను ఆదరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో గత సంకీర్ణ సర్కార్‌పై జనం విసిగిపోయారన్నారు. ఆరు కోట్ల మంది కన్నడిగులు మద్దతు ఇవ్వడంతో యడియూరప్ప మళ్లీ సీఎం అయ్యారన్నారు. యడియూరప్ప సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు పడుతున్నాయన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, జేడీఎస్ శాసనసభ్యులు రాజీనామాలు చేసిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే బీజేపీ అభ్యర్థులు గెలవడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసిన వారిపై స్పీకర్ అనర్హత వేటు వేసిన అంశం కోర్టు విచారణలో ఉన్నందున తాను ఏమీ మాట్లాడబోనన్నారు. అయితే అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే రాజీనామాలు చేసిన వారి బంధువులే ఎన్నికల బరిలో దిగుతారన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గెలవడం తథ్యమన్నారు. బళ్లారి రాఘవ పేరుపై అవార్డులు అందజేసేందుకు కృషి చేస్తామని శ్రీరాములు పేర్కొన్నారు. కార్యక్రమంలో బళ్లారి సిటీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment