సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎదుగుదలకు కారణమైన బీసీలను చంద్రబాబు నిలువునా మోసం చేశారు. మాటల్లో మాత్రం వారిపై కపట ప్రేమను కురిపిస్తూ ‘స్థానిక’ ఎన్నికలలో వారికి దక్కాల్సిన పదవులకు భారీగా గండికొట్టారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఎక్కువ రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంటే.. దానిని తప్పుపడుతూ టీడీపీ నేతలతో సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసులు వేయించారు. ఆ కేసుల కారణంగా హైకోర్టు ఆదేశాలను అనుసరించి బీసీలకు రిజర్వేషన్లు తగ్గే పరిస్థితి వస్తే.. తగ్గించడానికి వీలు లేదు. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లాల్సిందేనంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది చంద్రబాబేనని బీసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని తీర్పు ఇచ్చింది.
ఇప్పుడు దేశమంతటా అన్ని రాష్ట్రాల్లోనూ రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేసుకున్నాయి. ఇలాంటి పరిస్థితులలో కూడా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ధైర్యంతో ఆంధ్రప్రదేశ్‌లో 59.85 శాతం రిజర్వేషన్ల అమలుకు కొత్త జీవో తీసుకొచ్చారు. కానీ.. టీడీపీ కుతంత్రం వల్ల బీసీలకు రిజర్వేషన్లు తగ్గిపోయాయి’ అని బీసీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తక్షణమే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు ఈ ఏడాది జనవరి 8వ తేదీన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు వెలువడిన రెండు రోజులకు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు వరకు వెళ్లి కేసు వేసింది టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి. ఇప్పుడు టీడీపీ నేతలందరూ ప్రతాప్‌రెడ్డికి, టీడీపీకి ఏమీ సంబంధం లేదని వక్రభాష్యం చెబుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. సరిగ్గా ఎన్నికలకు కొద్దిరోజుల ముందు అదే వ్యక్తిని రాష్ట్ర ఉపాధి హామీ పథకం కౌన్సిల్ సభ్యుడిగా నియమిస్తూ 2019 మార్చి 9వ తేదీన అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రతిసారీ బీసీలకు అన్యాయమే
రాష్ట్రానికి చెందిన న్యాయవాదులు అమరనాథ్ గౌడ్, అభినవ్‌కుమార్ చావలి, గంగారావు, డీవీ సోమయాజులు, విజయలక్ష్మి, కేశవరావులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీం కోర్టు జడ్జిల కొలీజయం కేంద్రానికి సిఫార్సు చేస్తూ.. ఆ ఆరుగురు న్యాయవాదులపై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలని అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబును కేంద్ర న్యాయ శాఖ కోరింది. బీసీ వర్గాలకు చెందిన అమర్‌నాథ్‌గౌడ్, అభినవ్‌కుమార్ చావలి, ఎస్సీ వర్గానికి చెందిన గంగారావు, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన డీవీ సోమయాజులుకు విషయ పరిజ్ఞానం, వ్యక్తిత్వం లేవని, వారు సచ్ఛీలురు కారంటూ మార్చి 21, 2017న సీఎం చంద్రబాబు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాశారు. దేవదాయ శాఖ అధీనంలో ఉండే పలు ఆలయాల వద్ద క్షౌ రవృత్తి చేసే నాయీబ్రాహ్మణులు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర సచివాలయం వరకూ వెళ్లి తమకు గౌరవ వేతనం చెల్లించాలని అడిగితే ‘మీ తోక కత్తిరిస్తాం’ అంటూ అవమానించారు.
ఎస్సీ, ఎస్టీలన్నా చులకనే..
ఎస్సీ, ఎస్టీలన్నా చంద్రబాబుకు చులకనే అని పలు ఘటనలు నిరూపించాయి. 2016 ఫిబ్రవరి 8వ తేదీన చంద్రబాబు విలేకరుల సమావేశంలో ‘ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారు. అందరూ సంపన్ను వర్గాలోనే పుట్టాలనుకుంటారు. అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాలు ఏలవచ్చనుకుంటారు’ అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రానికొచ్చే నిధులకూ మోకాలడ్డు
గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి నేరుగా రావాల్సిన రూ.3,710.46 కోట్ల నిధులకు ప్రతిపక్ష నేత చంద్రబాబు మోకాలడ్డుతున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిపితే గానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఈ నిధులను విడుదల చేయదు. సర్పంచుల పదవీ కాలం 2018లో ముగిసినా అప్పట్లో సకాలంలో ఎన్నికలు నిర్వహించని కారణంగా టీడీపీ అధికారంలో ఉన్న 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు విడుదల చేయాల్సిన రూ.1,089.33 కోట్లను కేంద్రం నిలిపివేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో గ్రామాలకు ఇవ్వాల్సిన రూ.2,622.13 కోట్లను కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు.
ఈ మొత్తం నిధులు రూ.3,710 కోట్లను మున్సిపాలిటీలకు విడుదల చేయాల్సిన నిధులతో కలుపుకుంటే ప్రస్తుతానికి రూ.5,000 కోట్లు వరకు మార్చి నెలాఖరులోగా విడుదల చేయాల్సి ఉంది. మార్చి నెలాఖరులోగా నిధులు విడుదల కాకుంటే.. ఆ మొత్తం మురిగిపోయే పరిస్థితి ఉంది. 14వ ఆర్థిక సంఘం కాల పరిమితి ఈ ఏడాది మార్చి నెలాఖరుతో ముగియనుంది. ఆ తర్వాత 14 ఆర్థిక సంఘం నిధుల విడుదల పూర్తిగా కేంద్రం దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించటం ద్వారా గ్రామాలకు, మున్సిపాలిటీలకు సంబంధిత నిధులు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయగా.. టీడీపీకి అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులతో కోర్టులలో కేసులు వేయించి ఎన్నికల జరక్కుండా అడ్డుపడ్డుతున్నారు.
బీసీల కోసం వైఎస్ జగన్ ధైర్యం చేసి జీవో తెస్తే..
తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 34 శాతం రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ధైర్యంతో 59.85 శాతం రిజర్వేషన్ల అమలుకు కొత్త జీవో తీసుకొచ్చారు. కానీ, ఆ జీవోపై టీడీపీ నేత సుప్రీంకోర్టులో వేసిన కేసు కారణంగానే ఇప్పుడు ఆ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు తగ్గిపోతున్నాయి. కోర్టు వెళ్లకపోతే బీసీల రిజర్వేషన్లు తగ్గేవి కాదు. భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోలేని నిర్ణయాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటే.. టీడీపీ వాళ్లు దానిని అమలు కాకుండా అడ్డుకున్నారు.
ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు తగ్గకూడదంటే పార్లమెంట్‌లో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ చేయడం ఒక్కటే మార్గం. దానికి కొంత సమయం పడుతుంది. ఇదిలా ఉంటే జనాభా ప్రతిపాదికన బీసీలకు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టింది కూడా జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ఒక్కటే. పార్లమెంట్‌లో బీసీలకు పెద్దపీట వేసేది తామేనని చెప్పుకునే చాలా పార్టీలున్నా, అవి కూడా చేయని పని జగన్‌మోహన్‌రెడ్డి చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాలు జగన్‌మోహన్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి.
– ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు
టీడీపీ నేతల్లో అసంతృప్తి
59.85 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై కోర్టులో కేసు దాఖలు చేసిన బిర్రు ప్రతాప్‌రెడ్డి టీడీపీ నాయకుడనే విషయం బహిర్గతమవడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ పార్టీ నేతలు రకరకాల ప్రచారాలకు తెరలేపారు. చంద్రబాబు కావాలని వ్యూహాత్మకంగా ఇదంతా చేయించినట్లు బట్టబయలు కావడంతో టీడీపీలోని బీసీ నాయకులు, బీసీ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పంచాయతీరాజ్ చాంబర్, సర్పంచ్‌ల సంఘం, ఎంపీటీసీల సంఘాలు నడిపిన టీడీపీ నాయకుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ అనుచరుడిగా ప్రతాప్‌రెడ్డి అందరికీ తెలిసిన వ్యక్తి. అతనితో కోర్టులో కేసు వేయించి ముందుకు నడిపించింది టీడీపీ లీగల్ సెల్‌లోని ముఖ్య నాయకులనే విషయం బహిరంగ రహస్యమే. టీడీపీ కార్యాలయంలో జరిగిన అనేక కార్యక్రమాల్లో ప్రతాప్‌రెడ్డి పాల్గొనేవారు. అతనికి ఉపాధి హామీ పథకం డైరెక్టర్ పదవి ఇచ్చింది కూడా చంద్రబాబే. తమ పార్టీకి చెందిన వ్యక్తి, తనతో తిరిగిన అనుచరుడినే తమ వాడు కాదని చెప్పాల్సి రావడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. పార్టీ అధిష్టానం ఆదేశించడంతో ప్రతాప్‌రెడ్డి తమ నాయకుడు కాదని చెప్పక తప్పడం లేదని పలువురు టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment