సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త అసెంబ్లీ, సచివాలయ భవనాలు అవసరం అనుకుంటే ఓ కమిటీ వేసి సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన అసెంబ్లీ హాల్‌లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. టీఆర్‌ఎస్‌కు అధికారం పరిమితం కాదని, కొత్త సచివాలయం కట్టాలనుకుంటే దానిపై కమిటీ వేసి పరిశీలించాలని సూచించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఎన్నో హామీలను ఇచ్చిన కేసీఆర్.. వాటిని పక్కకు పెట్టి సచివాలయం కడతానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకుల సచివాలయ సందర్శనపై మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలను పట్టించుకోమని, సీఎం కేసీఆర్ మాట్లాడితే సమాధానం చెబుతామన్నారు. ప్రభుత్వ ఆస్తులను కూలగొడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. అప్పులు కట్టేది కేసీఆర్ కుటుంబ సభ్యులు కాదన్నారు. కేసీఆర్ చేసిన తప్పులకు ప్రజలు శిక్ష అనుభవించాలా అని ప్రశ్నించారు.
(చదవండి : కాంగ్రెస్ నేతల ముల్లేం పోయిందో?)
కాగజ్‌నగర్‌లో మహిళా అటవీ అధికారిణిపై దాడిని సమర్థించడంలేదని, కానీ ఆ పరిస్థితిని తీసుకొచ్చింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. కాగజ్‌నగర్ ఘటన తిరుగుబాటుకు సంకేతమన్నారు. గిరిజనుల భూములను అన్యాయంగా గుంటుకున్నందుకే ప్రజలు తిరగబడ్డారన్నారు. కాగజ్‌నగర్ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఓ కమిటీని వేస్తుందని చెప్పారు. జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పోడెం వీరయ్యతో కూడిన కమిటి కాకజ్‌నగర్ వెళ్లి విచారిస్తుందని తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో చాలా మంది నేతలతో చర్చించానని, వారంత త్వరలో తాను ఏర్పాటు చేయబోయే రౌండ్‌టేబుల్ సమావేశానికి హాజరవుతారని భట్టి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని, అందుకే తమ పార్టీ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment