సాక్షి, అమరావతి : అసెంబ్లీలో మంగళవారం ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఏం యోజన’పై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలతో వాడి వేడి చర్చ జరిగింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కన్నబాబు, కొడాలి నాని, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య మాటల తూటాలు పేలాయి. చర్చను పక్కదోవ పట్టించేలా చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని అధికార పక్ష సభ్యులు అంబటి రాంబాబు, రోజాలు తిప్పికొట్టారు. దీంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎదురు దాడికి దిగారు. చివరకు వ్యక్తిగత వ్యవహారాలపైనా వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ పథకానికి పేరు పెట్టనందున ‘చంద్రన్న దగా’ అని పెడితే బాగుంటుందని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. సభలో ప్రతిపక్ష నేత, సభా నాయకుడిని ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. తొలుత ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ రైతులకు రూ.12,500 ఇస్తామని చెప్పి రూ.7,500 మాత్రమే ఇచ్చి మోసం చేశారని వ్యాఖ్యానించారు. నాలుగు, ఐదు విడతల్లో చెల్లించాల్సిన రైతు రుణమాఫీపై అవసరమైతే కోర్టుకు వెళతామన్నారు.
తుస్సుమన్న చంద్రబాబు సవాల్
హెరిటేజ్ తనది కాదని, నిరూపిస్తే ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా రాజీనామా చేస్తానని చంద్రబాబు సవాల్ చేశారు. దీనిపై ఆర్థిక మంత్రి స్పందిస్తూ రిటైల్ విభాగంలోని హెరిటేజ్ ఫ్రెష్‌ను ఫ్యూచర్ గ్రూప్‌నకు రూ.296 కోట్లకు విక్రయించారని, దీని ద్వారా చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ గ్రూప్‌నకు ఫ్యూచర్ గ్రూప్‌లో 3.5 శాతం వాటా దక్కిందని ఆధారాలతో సహా వివరించారు. దీంతో చంద్రబాబు మిన్నకుండిపోయారు.
రైతులకు మేలు చేసిన ఏకైక సీఎం జగన్ : మంత్రి కన్నబాబు
అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి నాలుగేళ్ల పాటు రూ.50 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పటికీ రైతు కష్టాలు తెలిసిన నేతగా సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని ఐదేళ్లపాటు అమలు చేయాలని నిర్ణయించారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఏడాదికి పెట్టుబడి సాయాన్ని రూ.12,500 నుంచి రూ.13,500కు పెంచారని తెలిపారు. పెట్టుబడి సాయాన్ని రూ.50 వేల నుంచి రూ.67,500కు పెంచడం విశేషమన్నారు. రైతు భరోసా మొదటి విడతగా మే నెలలో రూ.7,500, రెండో విడత అక్టోబర్‌లో రూ.4,000, మూడో విడత జనవరిలో రూ.2,000 సాయం అందుతుందని తెలిపారు. కౌలు రైతులతో పాటు దేవాలయ భూములు సాగు చేస్తున్న రైతులను, రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ (ఆర్వోఎఫ్‌ఆర్) కింద పట్టా పొంది సాగు చేస్తున్న గిరిజనులకు, భూసేకరణ చేసి పరిహారం అందని రైతులకు పెట్టుబడి సాయం అందించాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. మొత్తం 45,82,500 రైతు కుటుంబాలకు రూ.5,230.24 కోట్ల లబ్ధి కలిగిందన్నారు.
అర ఎకరంలో కూరగాయలు సాగు చేసే రైతులను కూడా ఈ పథకంలో లబ్ధిదారులుగా చేర్చామన్నారు. 10 సెంట్లలో తమలపాకు పండించే రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. వైఎస్ జగన్ మానసపుత్రిక రైతు భరోసా పథకం ప్రకటించే నాటికి పీఎం కిసాన్ యోజన పథకంపై ప్రకటన రాలేదని తెలిపారు. చంద్రబాబు అమలు చేసిన ఎన్టీఆర్ హౌసింగ్, ప్రధాన మంత్రి మాతృత్వ వంజన యోజన, ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, పింఛన్లు, చంద్రన్న బీమా ఇలా ఏ పథకం తీసుకున్నా.. కేంద్రం వాటా ఉందని గుర్తు చేశారు. రైతులు, కౌలు రైతులకు మేలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని స్పష్టం చేశారు. ఒక్క ధాన్యం గింజ కూడా వదలకుండా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కిలో ఉల్లి రూ.25కే అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని హిందూ పత్రికలో వచ్చిన వార్తను మంత్రి కన్నబాబు సభకు చూపించారు.
బాబూ.. మీరు మాఫీ చేసిందెంత? : బుగ్గన
చంద్రబాబు తన హయాంలో ఎంత మొత్తం రుణమాఫీ చేశారని ఆర్థిక మంత్రి బుగ్గన ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు రైతు రుణాలన్నీ (రూ. 87,612 కోట్లు) బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పిన బాబు, రూ.24 వేల కోట్లకు కుదించి.. రూ.15 వేల కోట్లే ఇచ్చారన్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీల వీడియోలను సభలో ప్రదర్శించారు. చంద్రబాబుకు ఫిల్మ్ ఫీల్డ్ పునాది అని, ఇంకా నేరపూరితంగా మాట్లాడుతున్నారంటే ఆయనకు హ్యాట్సాఫ్ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిర్వాకంతో బ్యాంకులు రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు అనుగుణంగా కూడా లోన్‌లు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. సున్నా వడ్డీ పథకాన్ని కూడా రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నదాత సుఖీభవ పథకానికి కూడా డిస్కమ్ నిధులు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌ను తాకట్టు పెట్టి వాడారని మండిపడ్డారు. కేంద్ర పథకాలకు చంద్రన్న బాట, చంద్రన్న బీమా వంటి పేర్లు పెట్టుకున్నారని, నీరు–చెట్టు పథకంతో టీడీపీ నేతలు వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. రుణమాఫీపై చిత్తశుద్ధి ఉంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో ఎందుకు కేటాయింపులు జరపలేదని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన రుణ ఉపశమన పత్రాలు పసుపు–కుంకుమ పొట్లాలు కట్టుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయని చెప్పారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ తనకు వయసు మళ్లిందని, 70 ఏళ్లు పైబడ్డాయని అంతా అంటున్నారని, తనకు 25 ఏళ్ల కుర్రాడి ఆలోచనలున్నాయని చెప్పారు.
ఎమ్మెల్యేలు ఏమన్నారంటే..
చంద్రబాబు సభను పక్కదారి పట్టిస్తున్నారు
చంద్రబాబు రెచ్చగొట్టే కార్యక్రమంతో సభను పక్కదోవ పట్టిస్తున్నారు. టీడీపీ సభ్యులకు సభా సంప్రదాయాలు తెలియడం లేదు. ఉదయం నుంచి చంద్రబాబును గమనిస్తున్నా.. చాలా స్పీడ్గా మాట్లాడుతున్నారు. 25 ఏళ్ల వయసులో ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు. 150 మంది ఎమ్మెల్యేలు వచ్చినా ఎదుర్కొంటా అంటున్నారు.. ఇదేమన్నా.. ఫైటింగా? లేక మీరేమైనా బాహుబలా చంద్రబాబూ?.
– అంబటి రాంబాబు
రైతులు అప్పుల పాలైంది నిజం కాదా?
టీడీపీ పాలనలో రైతులు 90 శాతం అప్పులపాలైంది నిజం కాదా?. చంద్రబాబు, ప్రతిపక్ష సభ్యులు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. రైతుల విషయంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రెండు అడుగులు ముందుకేస్తే.. ఆయన కుమారుడు సీఎం వైఎస్ జగన్ నాలుగడుగులు ముందుకు వేశారు. రైతు భరోసా కార్యక్రమం నాలుగేళ్లు అమలు చేస్తానని ఐదేళ్లు అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్‌దే.
– ఆర్కే రోజా
బాబుకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు
అధికారంలో ఉన్నన్నాళ్లూ వ్యవసాయ రంగాన్ని పట్టించుకోని టీడీపీకి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. బాబు హయాంలో మైదుకూరులో గిట్టుబాటు ధర లేక ఉల్లి రైతులు పంటను రోడ్లపైన పారబోశారు. టమాటాలను పొలాల్లోనే పశువులకు విడిచి పెట్టేశారు. రైతులను ఆదుకోవాలని తాము ధర్నాలు చేసినప్పటికీ చంద్రబాబు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అత్యధిక ధరలకు రైతుల నుంచి పంటలను కొనుగోలు చేస్తున్నారు. వినియోగదారులకు సబ్సిడీతో విక్రయిస్తున్నారు.
– రఘురామిరెడ్డి
జగన్‌తో స్వర్ణ యుగం
రైతు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ స్వర్ణ యుగాన్ని తీసుకువచ్చారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయించడానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 రిగ్గులు, లోక్‌సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 రిగ్గులు కొనుగోలు చేయాలని నిర్ణయించడం ఈ ప్రభుత్వానికే సాధ్యమైంది. రైతుల కోసం ఇంతగా చేస్తుంటే.. పచ్చ చొక్కాల వారికి కనిపించకపోవడం వింతేమీ లేదు.
– కాకాణి గోవర్ధన్‌రెడ్డి
కౌలు రైతులను ఆదుకున్నది సీఎం జగనే
కౌలు రైతులను ఆదుకునేందుకు ఏకంగా చట్టం తీసుకువచ్చిన రైతు బంధు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినవే కాకుండా ఇవ్వని వాటిని కూడా అమలు చేస్తూ రైతు సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. ఇచ్చిన మాటకు కట్టుబడ్డ ప్రభుత్వాన్ని రైతులు సమర్థించడాన్ని సహించలేకే టీడీపీ అవాస్తవ విమర్శలు చేస్తోంది.
– కరణం ధర్మశ్రీ
Comments
Please login to add a commentAdd a comment